ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వన్యప్రాణుల అక్రమ రవాణాపై డీఆర్ఐ ఉక్కుపాదం

ఏనుగు దంతాలు, చిరుతపులి చర్మం, సజీవ పంగోలిన్లు, పులి అవయవాలు స్వాధీనం - 11 మంది అరెస్టు

మహారాష్ట్ర వ్యాప్తంగా నిఘా ఆధారిత కార్యకలాపాలు

బయటపడిన సంరక్షిత వన్యప్రాణులు, వాటి ఉత్పన్నాల అక్రమ వ్యాపార ప్రయత్నాలు

నాడు పోస్టు చేయడమైనది: 02 OCT 2026 10:02PM by PIB Hyderabad

వన్యప్రాణుల అక్రమ రవాణా, సంరక్షిత వన్యప్రాణుల ఉత్పత్తుల అక్రమ వ్యాపారాన్ని ఎదుర్కొనే ప్రయత్నాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ముమ్మరం చేసింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా మూడు చోట్ల సోదాలు నిర్వహించింది. ఎంతో నైపుణ్యంతో చెక్కిన నాలుగు ఏనుగు దంతాలు, ఒక చిరుతపులి చర్మం, రెండు సజీవ పంగోలిన్‌లు, 3 కిలోల పులి ఎముకలు, రెండు పులి కోరలను ఈ సోదాల్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు తనిఖీల్లో మొత్తం పదకొండు మందిని అరెస్టు చేశారు.

 

ఏనుగు దంతాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు డీఆర్ఐ అధికారులు ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ఎంతో నైపుణ్యంతో చెక్కిన 4 ఏనుగు దంతాలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు అందిన కచ్చితమైన సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అక్రమ రవాణా చేస్తున్న వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు... ఇందులో భాగస్వాములైన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణుల (సంరక్షణ) చట్టం-1972లోని సెక్షన్ 49బి ప్రకారం ఎటువంటి లైసెన్స్ లేకుండా ఏనుగు దంతాలను కలిగి ఉండడం, వాటితో వ్యాపారం చేయడం పూర్తిగా నిషేధం. తదుపరి దర్యాప్తు, చట్టపరమైన చర్యల కోసం స్వాధీనం చేసుకున్న వస్తువులను, నిందితులను అధికారులు స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కు అప్పగించారు.

 

మహారాష్ట్రలోని గోండియా జిల్లా పురాడ గ్రామ సమీపంలో చిరుతపులిని చంపి, దాని చర్మాన్ని అక్రమంగా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు అందిన సమాచారంతో డీఆర్ఐ అధికారులు నిఘా ఉంచారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 2026 సెప్టెంబర్ 29న ఇద్దరు వ్యక్తులను అడ్డుకుని, వారి నుంచి ఒక చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల (సంరక్షణ) చట్టం-1972లోని షెడ్యూల్-I కింద చిరుతపులికి (పాంథెరా పార్డస్) అత్యున్నత రక్షణ ఉన్నందున, ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్మాన్ని జప్తు చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం పట్టుబడిన ఇద్దరు నిందితులను, స్వాధీనం చేసుకున్న చిరుత చర్మాన్ని గోండియాలోని దేవోరియా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్‌కు అప్పగించారు.

అంతరించిపోతున్న వన్యప్రాణుల అక్రమ వ్యాపార ముఠాను లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్రలోని అల్లపల్లి అటవీ ప్రాంతంలో అధికారులు 2026 సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ఒక భారీ ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. డీఆర్ఐ, అటవీ శాఖ, ముంబైకి చెందిన వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ), ఉదంతి-సీతానది టైగర్ రిజర్వ్ (యూఎస్‌టీఆర్) యాంటీ పోచింగ్ యూనిట్‌లు సంయుక్తంగా ఈ దాడులను నిర్వహించాయి. ఈ దాడుల్లో అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్నట్లు అనుమానిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రాణంతో ఉన్న ఒక పెద్ద పంగోలిన్, పంగోలిన్ పిల్ల, 3 కిలోల పులి ఎముకలు, రెండు పులి కోరలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల (సంరక్షణ) చట్టం-1972 కింద అత్యున్నత రక్షణ కలిగిన, 'షెడ్యూల్ I' లో చేర్చిన పంగోలిన్లు, పులులు (వాటి శరీర భాగాలు) చట్టపరంగా సంరక్షణ కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ వన్యప్రాణుల రక్షణ ఒప్పందం (సీఐటీఈఎస్) 'అనుబంధం-I' లోనూ పంగోలిన్లను చేర్చారు. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా వీటిని విక్రయించడం లేదా అంతర్జాతీయంగా వాటితో వ్యాపారం చేయడం పూర్తిగా నిషేధం.

 

పూర్తి స్థాయి విచారణ, సోదాల ద్వారా... పులి శరీర భాగాలను అక్రమంగా వేటాడటం, కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడానికి ప్రయత్నించడం వంటి చర్యలకు సంబంధించి కీలక ఆధారాలు లభించాయి. అటవీ శాఖ తదుపరి చర్యల నిమిత్తం... వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972 నిబంధనల ప్రకారం రెండు సజీవ పంగోలిన్లు, పులి ఎముకలు, పులి కోరలు, నిందితులు ఉపయోగించిన రెండు మోటార్‌సైకిళ్లనూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

సంరక్షిత జాతులు, వాటి ఉత్పన్నాలను అక్రమంగా కలిగి ఉండడం, రవాణా చేయడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే వన్యప్రాణుల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను ప్రత్యేక వన్యప్రాణి సంరక్షణ సంస్థలతో సన్నిహిత సమన్వయం ద్వారా ప్రయత్నాల దశలోనే అడ్డుకోవడం పట్ల డీఆర్ఐ నిరంతర దృష్టిని ఈ మూడు ఆపరేషన్లు స్పష్టం చేస్తున్నాయి.

****


(రిలీజ్ ఐడి: 2318619) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Urdu , Bengali , Gujarati