శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
వైద్యరంగంలోని ప్రతి ప్రత్యేక విభాగంలో వేగవంతమైన సాధనంగా రోబోటిక్స్
కచ్చితమైన ఆరోగ్య సేవలు, వైద్యం కోసం విస్తృత వ్యవస్థను రూపొందించనున్న రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్
రోబోటిక్ శస్త్రచికిత్సల నుంచి రోబోటిక్ వైద్యం దాకా అన్ని వైద్య విభాగాల్లో విస్తరించనున్న సాంకేతికత
టెలి-రోబోటిక్స్ ద్వారా భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా రోగుల వద్దకే వైద్య నిపుణుల సేవలు
దేశం ఎదుర్కొంటున్న ప్రత్యేక, విభిన్న ఆరోగ్య సంరక్షణ సవాళ్లను పరిష్కరించుటలో ఏఐ, రోబోటిక్స్ సహాయం కీలకం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 5:28PM by PIB Hyderabad
వైద్యరంగంలో రోగ నిర్ధారణ నుంచి చికిత్స దాకా ప్రతి విభాగంలోనూ రోబోటిక్స్ ఒక వేగవంతమైన సాధనంగా మారనుందని ప్రముఖ వైద్యులు, మధుమేహ వ్యాధి నిపుణులు, కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ, ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
కృత్రిమ మేధ, నానోసైన్స్‌లతో కలిపి రోబోటిక్స్.. కచ్చితమైన ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవలను అందించే ఒక సమగ్ర వ్యవస్థను సృష్టిస్తుందని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి జన్యుపరమైన వివరాలు, పర్యావరణ పరిస్థితులు, జీవనశైలి, ఆహారపు అలవాట్లను బట్టి... సరికొత్త సాంకేతికతల సాయంతో మరింత వ్యక్తిగతీకరించిన వైద్య సేవలను అందించడం దీని ద్వారా సాధ్యమవుతుందని ఆయన వివరించారు.
సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభోపన్యాసం చేశారు. రోబోటిక్స్‌ను కేవలం శస్త్రచికిత్సలకు మాత్రమే పరిమితం చేయకుండా, వైద్య రంగానికి చెందిన అన్ని విభాగాలకూ విస్తరించాల్సిన సాధనంగా చూడాలని ఆయన పేర్కొన్నారు. "ఇది ఒక సాధనం. ఇది ప్రతిచోటా కనిపిస్తుంది" అని ఆయన అన్నారు. ప్రస్తుత సదస్సు రోబోటిక్ సర్జరీపై దృష్టి సారించినప్పటికీ... వివిధ వైద్య విభాగాల్లో ఏఐ అనువర్తనాలను కనుగొంటున్న విధంగానే, భవిష్యత్తులో రోబోటిక్ మెడిసిన్, రోబోటిక్ ఎండోక్రినాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి విభాగాలు ఆవిర్భవించవచ్చని ఆయన తెలిపారు.
21వ శతాబ్దంలో ఏఐ, బయోటెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఇతర సాంకేతికత ఆధారిత పరిష్కారాల ఆవిర్భావంతో... వైద్యరంగం సరికొత్త పద్ధతుల ఉత్తేజకరమైన దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. తదుపరి దశలో క్వాంటం టెక్నాలజీలు, నానోమెడిసిన్, రోబోటిక్స్‌లో పురోగతితో పాటు... జన్యుపరమైన రోగ నిర్ధారణ పరిష్కారాల వినియోగం మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఒకే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ, ప్రతి రోగికి వారి వారి అవసరాలకు అనుగుణంగా చికిత్సా విధానాలు రూపొందించాల్సిన అవసరం కచ్చితమైన వైద్య విధానంలో పెరుగుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జన్యుపరమైన ప్రొఫైల్, పర్యావరణ పరిస్థితులు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు వైద్య నిర్ణయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయన్నారు. తద్వారా సాంకేతికత ఆధారితమైన, వ్యక్తిగతీకరించిన ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు వైద్యంలో కీలక భాగంగా మారుతుందని ఆయన అన్నారు.
జీనోమ్ ఇండియా కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ... ఇప్పటికే 10,000 మంది వ్యక్తుల జన్యుక్రమాన్ని నిర్ధారించారని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రతి నవజాత శిశువు జన్యుక్రమాన్ని నిర్ధారించే దిశగా భారత్ పయనించగలదని డాక్టర్ జితేంద్ర సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 140 కోట్ల జనాభాకు ఇంతటి వివరణాత్మక జన్యుక్రమాన్ని నిర్ధారించడంలో ఏఐ, రోబోటిక్స్‌ను అత్యుత్తమంగా ఉపయోగించుకోవలసి ఉంటుందనీ ఆయన పేర్కొన్నారు.
దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ సవాళ్లను పరిష్కరించడంలో నానోమెడిసిన్ సామర్థ్యాన్ని గురించి కేంద్ర మంత్రి వివరించారు. నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించారు. నానో స్థాయిలో జరిగే పురోగతి... సాంప్రదాయిక ఔషధ పంపిణీకి సంబంధించిన పరిమితులను అధిగమించడానికి, చికిత్సా విధానాలకు కొత్త అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడతాయని ఆయన అన్నారు.
భారత పరిమాణం, వైవిధ్యం, భౌగోళిక విస్తరణ కారణంగా ఆరోగ్య సంరక్షణ అందించడంలో ఏఐ, రోబోటిక్స్, టెలి-రోబోటిక్స్ వంటి సాంకేతికతలు ప్రత్యేకంగా ఉపయోగపడతాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. రోబోటిక్ అల్ట్రాసోనోగ్రఫీతో తన అనుభవాన్ని పంచుకున్నారు. రిమోట్‌గా పనిచేసే వైద్య సాంకేతికతల అవకాశాలను ప్రదర్శిస్తూ... అంటార్కిటికాలో 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వ్యక్తికి తాను అల్ట్రాసౌండ్ పరీక్ష నిర్వహించానని ఆయన చెప్పారు.
సాంప్రదాయిక నిపుణుల ఆరోగ్య సంరక్షణ నమూనాలో రాబోయే సంభావ్య మార్పును డాక్టర్ జితేంద్ర సింగ్ వివరిస్తూ... “రోగిని డాక్టర్ వద్దకు పంపడానికి బదులుగా, డాక్టరే రోగి వద్దకు వెళ్లేలా ఈ మార్పు ఉంటుంది” అని పేర్కొన్నారు. టెలి-రోబోటిక్స్ సాంకేతికత ద్వారా భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా నిపుణులైన వైద్య సేవలను రోగుల వద్దకే చేర్చవచ్చని ఆయన తెలిపారు. దీనివల్ల రోగి సదరు వైద్య నిపుణుల వద్దకు ప్రయాణించే అవసరం లేకుండానే, అత్యాధునిక వైద్య సేవలను అందుకోవడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు.
అంటువ్యాధులతో పాటు జీవక్రియ, జీవనశైలి సంబంధిత రుగ్మతలూ సహజీవనం సాగిస్తున్న భారత్‌లో... మారుతున్న వ్యాధుల ప్రొఫైల్ గురించి కేంద్ర మంత్రి మాట్లాడారు. సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు ఇప్పుడు యువకుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితి దేశంలో సంక్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు. దీనిని ఎదుర్కోవడానికి అధునాతన సాంకేతిక సాధనాలు సహా మరింత సమగ్రమైన, సంపూర్ణమైన విధానం అవసరమని ఆయన పేర్కొన్నారు.
భారత ఆరోగ్య సంరక్షణ అవసరాల పరిమాణం, వైవిధ్యం కారణంగా కొత్త సాంకేతికతలను స్వీకరించడం ఇక్కడ చాలా ముఖ్యమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా వైద్య సేవలను అందించడంలో ఏఐ, రోబోటిక్స్ శక్తిమంతమైన సహాయక సాధనాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కచ్చితమైన, వ్యక్తిగతీకరించిన వైద్య విధానం దిశగా సాగే పరిణామానికి ఇవి మద్దతునిస్తాయని ఆయన పేర్కొన్నారు.
రోబోటిక్ సర్జరీని సంస్థాగత అభ్యాసం, విద్యాసంబంధమైన, వృత్తిపరమైన సమావేశ వేదికల పరిధిలోకి తీసుకువచ్చినందుకు ఎస్ఆర్ఎస్ ఇండియా-2026 నిర్వాహకులను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. వేగంగా మారుతున్న వైద్య విజ్ఞాన రంగానికి అనుగుణంగా ముందుకు సాగడానికి రోబోటిక్స్ వంటి సరికొత్త సాంకేతికతలను స్వీకరించడం ఎంతో అవసరమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2318410)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14