వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఏపీఈడీఏ సహకారంతో పూర్నియా నుంచి గ్రీస్‌కు బిహార్ మఖానా ఎగుమతి
ఈ ఎగుమతుల ద్వారా మార్కెట్ అందుబాటుతో రైతులకు మెరుగైన ఆదాయం.. బిహార్ మఖానా ఎగుమతుల విస్తరణ
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 11:55AM by PIB Hyderabad
వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) సహకారంతో బిహార్‌లోని పూర్నియా నుంచి 1 మెట్రిక్ టన్నుల పాప్డ్ (ఫూల్) మఖానాను గ్రీస్ దేశానికి ఎగుమతి చేశారు. బిహార్ సంప్రదాయ ఉత్పత్తి అయిన మఖానాకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత విస్తృత అవకాశాలు కల్పించడంతో పాటు, విదేశీ ఎగుమతి ఆధారిత విలువ వ్యవస్థల ద్వారా స్థానిక రైతులకు మెరుగైన ఆదాయ అవకాశాలను కల్పించే దిశగా ఇది కీలక చర్యగా నిలిచింది.
పూర్నియాలోని బెలౌరీకి చెందిన ఇండో గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ నుంచి ఈ సరుకును సేకరించారు. న్యూఢిల్లీలోని ఎస్‌ఎస్ ఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా దీనిని గ్రీస్‌కు ఎగుమతి చేస్తున్నారు. ఈ సరుకు భారత్‌లోని ముంద్రా ఓడరేవు నుంచి గ్రీస్‌లోని పిరాయస్ పోర్టుకు రవాణా కానుంది.
దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం లభిస్తున్న విక్రయ ధరతో పోలిస్తే ఈ ఎగుమతి ద్వారా మఖానాకు అధిక ధర లభించింది. అంతర్జాతీయ మార్కెట్లు మఖానా ఉత్పత్తిదారులకు అదనపు విలువను సృష్టించే సామర్థ్యాన్ని ఇది చాటిచెబుతోంది. ఎగుమతుల ఆధారిత మార్కెట్ అందుబాటు ద్వారా ఉత్పత్తిదారులు, అంతర్జాతీయ కొనుగోలుదారుల మధ్య అనుసంధానాలను బలోపేతం చేయడంతో పాటు, రైతులకు మెరుగైన ఆదాయాలు లభించే అవకాశాలను కూడా కల్పించవచ్చు.
మఖానా ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది. దేశ మొత్తం మఖానా ఉత్పత్తిలో బిహార్ వాటా సుమారు 80 నుంచి 85 శాతంగా ఉంది. బిహార్‌లోని 10 జిల్లాల్లో 35,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో మఖానా సాగు జరుగుతోంది. సబౌర్‌లోని బిహార్ వ్యవసాయ యూనివర్సిటీ (బీఏయూ), దర్భంగాలోని ఐసీఏఆర్-జాతీయ మఖానా పరిశోధనా కేంద్రం నుంచి క్షేత్రస్థాయిలో అందుతున్న సాంకేతిక సహకారంతో ఈ రంగానికి మద్దతు లభిస్తోంది.
బిహార్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీఈడీఏ చైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్, బిహార్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఉద్యానవన డైరెక్టర్ శ్రీ అభిషేక్ కుమార్‌తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు, మఖానా ఎగుమతి వ్యవస్థతో అనుబంధం ఉన్న ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.
సమావేశంలో శ్రీ విజయ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. “మఖానా అంతర్జాతీయ మార్కెట్లకు నిరంతరం చేరుతున్న నేపథ్యంలో ఈ ఎగుమతి బిహార్ మఖానా రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 20కి పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు 7,000 మెట్రిక్ టన్నులకు పైగా మఖానా, 22 మిలియన్ డాలర్ల విలువైన విలువ ఆధారిత మఖానా ఉత్పత్తులను ఎగుమతి చేసింది” అని తెలిపారు.
రైతులకు మద్దతు అందించడంతో పాటు ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా వారి ఆదాయాలను మెరుగుపరచే లక్ష్యంతో బిహార్ ప్రభుత్వం వ్యవసాయ ఎగుమతి విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తోందని ఆయన తెలిపారు. మఖానా ఎగుమతి విలువ వ్యవస్థకు మద్దతు అందించేందుకు ప్యాకింగ్ కేంద్రాలను కూడా అభివృద్ధి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మఖానా ఎగుమతులను విస్తరించడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం లభించేలా ఏపీఈడీఏ నిరంతరం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
బిహార్ మఖానా ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించేందుకు జరుగుతున్న విస్తృత ప్రయత్నాల్లో భాగంగా పూర్నియా నుంచి గ్రీస్‌కు ఈ ఎగుమతి జరుగుతోంది. బిహార్‌తో మఖానాకు ఉన్న బలమైన సంప్రదాయ, సాంస్కృతిక అనుబంధం నేపథ్యంలో ఇది భారత్ వ్యవసాయ ఎగుమతుల జాబితాలో ఒక ముఖ్యమైన ఉత్పత్తిగా ఎదిగింది.
భారతీయ మఖానాను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లేందుకు ఏపీఈడీఏ మార్కెట్ అనుసంధానాలను సులభతరం చేయడంతో పాటు ఎగుమతిదారులకు మద్దతు అందిస్తోంది. యూరప్ మార్కెట్లలోకి కూడా మఖానా ఎగుమతులు విస్తరిస్తున్నాయి. భారతీయ ఉత్పత్తిదారులకు పెరుగుతున్న అవకాశాలతో పాటు, సంప్రదాయ మార్కెట్లకు మించి కొత్త మార్కెట్లలోకి విస్తరించే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రయత్నాల ద్వారా బిహార్‌లోని మఖానా ఉత్పత్తిదారులను అంతర్జాతీయ డిమాండ్డుతో అనుసంధానించడంతో పాటు, రైతులకు మెరుగైన ఆదాయ అవకాశాలు, ఎగుమతి విలువ వ‍్యవస్థలో ఉత్పత్తిదారుల సంఘాల అధిక భాగస్వామ్యానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2318367)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5