వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హర్యానా నుంచి కెనడాకు ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో ఫ్రోజెన్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులను సులభతరం చేసిన ఏపీఈడీఏ

ఎగుమతి ఆధారిత మార్కెట్ అందుబాటులోకి రావడంతో రైతులకు, ఆహార ఉత్పత్తిదారులకు కొత్త అవకాశాలు

నాడు పోస్టు చేయడమైనది: 02 OCT 2026 11:54AM by PIB Hyderabad

వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) హర్యానాలోని సోనిపట్ నుంచి కెనడాకు ఎగుమతుల ప్రక్రియను సులభతరం చేసింది. 24 మెట్రిక్ టన్నుల (ఎంటీల) ఫ్రోజెన్ ఆహార ఉత్పత్తుల ఎగుమతిని ఈ సంస్థ నిన్న అధికారికంగా ప్రారంభించింది. ‘అటెర్నా ఫుడ్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ ఎగుమతి చేసిన ఈ రవాణాలో 2,295 బాక్సుల ఫ్రోజెన్ ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. ఈ మొత్తం సరుకు విలువ 35,140 కెనడియన్ డాలర్లు (సీఏడీ).

 

రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీవో) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎగుమతిలో పచ్చి బఠానీలు, పలు రకాల కూరగాయలు, బఠానీలు-క్యారెట్లు, స్వీట్ కార్న్, సమోసాలతో పాటు మరికొన్ని ఇతర ఉత్పత్తులూ ఉన్నాయి. ఈ ఎగుమతి యూనిట్ కోసం ఏపీఈడీఏ సంస్థ తన ఆర్థిక సహాయ పథకం కింద మద్దతు అందించింది. భారతీయ ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను విస్తరించడం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులు, మార్కెట్లతో అనుసంధానించడం దిశగా ఈ ఎగుమతి మరో కీలక ముందడుగు.

 

ఎగుమతి ఆధారిత వాణిజ్య వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో, మన రైతులు అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోవడంలో పెరుగుతున్న రైతు ఉత్పత్తిదారుల సంస్థల పాత్రను ఈ ఎగుమతి ప్రముఖంగా చాటుతోంది. మార్కెట్ సౌకర్యాలను బలోపేతం చేయడం, రైతు సమూహాలను ఎగుమతి అవకాశాలతో అనుసంధానించడం వంటి లక్ష్యాలతో కూడిన పలు కార్యక్రమాల ద్వారా ఎఫ్‌పీవోలు/ఎఫ్‌పీసీలు, ఎగుమతిదారుల మధ్య సంబంధాలనూ ఏపీఈడీఏ సులభతరం చేస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్‌తో, అంతర్జాతీయ మార్కెట్లతో జోడించడం ద్వారా... ఈ ఎఫ్‌పీవో ఆధారిత నమూనా రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించడంలో తోడ్పడుతుంది. ఎగుమతి వాణిజ్య వ్యవస్థలో రైతు సమూహాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

ఈ సమావేశంలో ఏపీఈడీఏ ఛైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్ ప్రసంగిస్తూ... ఎగుమతిదారులను, దీనికి సహకరించిన వారందరినీ అభినందించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీవో) నేరుగా ఎగుమతి చేయడం వల్ల రైతులు తమ ఉత్పత్తులపై మరింత మెరుగైన లాభాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో నిఫ్టెమ్ అందించిన అమూల్య సహకారాన్నీ ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కెనడా మార్కెట్‌కు ఎగుమతులను మరింతగా విస్తరించడంపై శ్రీ అభిషేక్ దేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘ఏపీఈడీఏ’... భారతీయ వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానాన్ని, ఎగుమతి అవకాశాలను నిరంతరం సులభతరం చేస్తోంది. ప్రపంచ వాణిజ్య వ్యవస్థల్లో మన రైతు సమూహాల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికీ నిరంతరం మద్దతునిస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2318361) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Punjabi , Urdu , हिन्दी