కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
దివాలా నియమావళి (ఐబీసీ)తో పెరిగిన రుణ క్రమశిక్షణ, మెరుగైన బకాయి వసూళ్లు, సులభతరమైన వ్యాపారం: కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా
ఘనంగా భారతీయ దివాలా నియంత్రణ సంస్థ (ఐబీబీఐ) 10వ వార్షికోత్సవ వేడుకలు
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 10:06PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భారతీయ దివాళా నియంత్రణ సంస్థ (ఐబీబీఐ) 10వ వార్షికోత్సవ వేడుకలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు, రహదారి రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష్ మల్హోత్రా ప్రారంభించారు. ఐబీబీఐ 2016 అక్టోబర్ 1న ఏర్పాటైంది. ఇది విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ హర్ష్ మల్హోత్రా తన ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ... దివాళా నియమావళి-2016 (ఐబీసీ)తో దేశంలో రుణ క్రమశిక్షణ బలోపేతమైందని, బకాయిల వసూళ్లు మెరుగయ్యాయని, సులభతరమైన వ్యాపార నిర్వహణకూ ఇది ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు. ఇటీవలి చట్టపరమైన సవరణల ద్వారా మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని నిరంతరం నవీకరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే దశాబ్దంలో మరింత వేగంగా, గరిష్ట విలువను చేకూర్చేలా దివాలా పరిష్కారాలను సాధించడానికి సంబంధిత భాగస్వాములంతా కలిసికట్టుగా కృషి చేయాలని శ్రీ హర్ష్ మల్హోత్రా పిలుపునిచ్చారు.
ఐబీసీ వ్యవస్థలో కృత్రిమ మేధ సహా సరికొత్తగా అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరముందని కేంద్ర సహాయ మంత్రి శ్రీ హర్ష్ మల్హోత్రా ప్రముఖంగా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో దివాలా సమస్యల వేగవంతమైన పరిష్కారానికి, ఆస్తుల ద్వారా గరిష్ట విలువను రాబట్టడానికి తగిన చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ గౌరవ అధ్యక్షులు జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రెవాల్ మాట్లాడుతూ... ఐబీసీ వ్యవస్థలో వివాదాల పరిష్కార అథారిటీ పాత్రను వివరించారు. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలను, దివాలా పరిష్కార ప్రణాళికల ఆమోదంలో ఇటీవల సాధించిన వేగాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. వీటితో పాటు రాబోయే రోజుల్లో పరిశీలించాల్సిన వివిధ సంస్కరణలనూ ఆయన సూచించారు. అందులో కేసుల స్వీకరణ పరిమితుల సవరణ, మధ్యవర్తిత్వం వినియోగం, నిర్దిష్ట రంగాల కోసం ప్రత్యేక మినహాయింపులు వంటి అంశాలు ఉండాలని జస్టిస్ అనుపిందర్ సింగ్ పేర్కొన్నారు.
నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ గౌరవ సభ్యులు శ్రీ ఇందీవర్ పాండే మాట్లాడుతూ... గత దశాబ్ద కాలంలో దివాలా న్యాయశాస్త్రంలో సాధించిన పురోగతిపై, రాబోయే రోజుల్లో పరిశీలించాల్సిన కీలక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. గత పదేళ్లలో ఐబీసీ చట్టానికి ఏడు సార్లు సవరణలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. చట్టాలను సవరించడంలో ఉండే కొన్ని పరిమితులను ప్రస్తావిస్తూనే, మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ నియమ నిబంధనల్లో సకాలంలో సవరణలు తీసుకురావడాన్ని ఆయన అభినందించారు. ఐబీసీ ద్వారా చేకూరిన సానుకూల ఫలితాలను గుర్తిస్తూనే, నిర్దేశిత కాలపరిమితులను సంబంధిత భాగస్వాములంతా కచ్చితంగా పాటించాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు.
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అంశుమాన్ పట్నాయక్ మాట్లాడుతూ... ఐబీసీ సాధించిన విజయాలను గుర్తిస్తూనే, ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి చేపట్టిన విధానపరమైన సంస్కరణలను, అందులో భాగమైన దివాళా నియమావళి (సవరణ) చట్టం-2026ను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కొత్త సవరణ చట్టంలోని ముఖ్యమైన నిబంధనలను వివరించిన ఆయన, రాబోయే రోజుల్లో ఐబీసీ వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలనే దానిపై తదుపరి దశ ప్రణాళికలనూ స్పష్టంగా వివరించారు.
ఐబీబీఐ చైర్‌పర్సన్ శ్రీ జయంతి ప్రసాద్ అతిథులకు స్వాగతం పలుకుతూ... ఐబీసీ చట్టం, ఈ బోర్డు పదేళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఐబీసీ చట్టం వల్ల రుణదాతలకు భారీగా బకాయిలు వసూలయ్యాయనీ, వివిధ రంగాల్లో నష్టాల్లో ఉన్న వ్యాపారాలు మూతపడకుండా కాపాడగలిగామన్నారు. అప్పులు ఇచ్చే-తీసుకునే వారి ప్రవర్తనలో ఒక శాశ్వతమైన మార్పునూ తీసుకువచ్చామని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ వ్యవస్థలో 4,400 మందికి పైగా దివాలా రంగ నిపుణులు, 6,000 మందికి పైగా రిజిస్టర్డ్ వాల్యూయర్స్ భాగస్వాములుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. నియమ నిబంధనల రూపకల్పనలో ఐబీబీఐ ప్రజల అవసరాలకు స్పందిస్తూ, అందరినీ భాగస్వామ్యం చేస్తూ, పక్కా ఆధారాలతో కూడిన విధానాలను అవలంబిస్తోందని శ్రీ జయంతి ప్రసాద్ స్పష్టం చేశారు.
ఐబీబీఐ 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా "షేపింగ్ ద నెక్స్ట్ డికేడ్ ఆఫ్ ఐబీసీ: ద రోడ్ అహెడ్" అనే ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు. దివాలా చట్టం (ఐబీసీ) అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన '7వ ఆన్‌లైన్ క్విజ్' పోటీల్లో గెలుపొందిన విజేతలను ఈ వేదికపై అధికారులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) గౌరవ అధ్యక్షులు జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రెవాల్, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ గౌరవ సభ్యులు శ్రీ ఇందీవర్ పాండే, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అంశుమాన్ పట్నాయక్, ఐబీబీఐ చైర్‌పర్సన్ శ్రీ జయంతి ప్రసాద్, ఐబీబీఐ పూర్తికాల సభ్యులు శ్రీ సందీప్ గార్గ్, శ్రీ భూషణ్ కుమార్ సిన్హాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివాలా పరిష్కార రంగంలోని ఎంతో మంది ప్రముఖ అధికారులు, కీలక భాగస్వాములూ ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 2318357)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4