జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

తెలంగాణలోని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని ఒక నిర్మాణ ప్రదేశంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 12 మంది కుటుంబ సభ్యులను దాదాపు ఏడాది పాటు వెట్టిచాకిరీ చేయించినట్లు వచ్చిన మీడియా కథనాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్

బాధిత కార్మికులు ప్రమాదకరమైన, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో జీవించినట్లు.. సరైన వేతనాలు ఇవ్వకుండా వారిని వేధింపులకు గురిచేసినట్లు, వారి కదలికలపై ఆంక్షలు విధించినట్లు పేర్కొన్న మీడియా కథనం

ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ లేదా మేజిస్ట్రేట్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసిన కమిషన్

12 మంది బాధితుల ప్రస్తుత పరిస్థితి, దర్యాప్తు వివరాలు, వెట్టిచాకిరీ విముక్తి ధ్రువపత్రాలు, ఆర్థిక సహాయం, దీర్ఘకాలిక పునరావాస ప్రణాళికపై నివేదిక కోరిన కమిషన్‌

బాధితుల కేంద్రంగా నిర్దిష్ట కాలపరిమితిలో తగిన చర్యలు తీసుకోవాలని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించిన కమిషన్‌

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2026 7:32PM by PIB Hyderabad

తెలంగాణలోని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లిలోని ఒక నిర్మాణ ప్రదేశంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 12 మంది కుటుంబ సభ్యులను దాదాపు ఏడాది పాటు అక్రమంగా బంధించి వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారనే మీడియా కథనాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) సుమోటోగా స్వీకరించింది. వారికి అతి తక్కువ వేతనాలు ఇస్తూ వారానికి ఏడు రోజులు పనిచేయిస్తున్నట్లు.. ప్రమాదకరమైన, అపరిశుభ్రమైన పరిస్థితులలో ఉంచుతూ శారీరకంగా, మానసికంగా హింసకు గురిచేస్తున్నట్లు బాధితులను కాపాడిన సమయంలో వెల్లడైంది.

 

వార్తా కథనంలోని అంశాలు నిజమైతే అది కార్మికుల మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించినట్లే అవుతుందని కమిషన్ పేర్కొంది. ఈ విషయమై నాలుగు వారాలలోగా సమగ్ర నివేదికను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ లేదా మేజిస్ట్రేట్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌లకు కమిషన్ నోటీసులు జారీ చేసింది.

 

12 మంది బాధితుల ప్రస్తుత స్థితిగతులు- ఆచూకీ.. వారి తక్షణ భద్రత, ఆశ్రయం, ఆహారం, వైద్య సంరక్షణ కోసం తీసుకున్న చర్యల వివరాలు ఈ నివేదికలో ఉండాలని కమిషన్ ఆదేశించింది. యజమానితో సహా బాధ్యులైన ఇతర వ్యక్తులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలతో పాటు దర్యాప్తు పురోగతిని కూడా దీనిలో పొందుపరచాలి. విముక్తి, పునరావాస ప్రక్రియ మొత్తం కూడా కాలపరిమితితో కూడిన బాధితుల కేంద్రీకృత విధానంలో జరిగేలా చూడాలని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మేజిస్ట్రేట్‌ను కమిషన్ ఆదేశించింది.

 

అధికారుల నుంచి కోరిన నివేదికలో అర్హులైన బాధితులందరికీ వెట్టిచాకిరీ విముక్తి ధ్రువపత్రాలు జారీ చేసినట్లు నిర్ధారణ ఉండాలి. వెట్టిచాకిరీ కార్మికుల పునరావాస కేంద్ర రంగ పథకం-2021 కింద ప్రతి బాధితుడికి చెల్లించిన రూ. 30,000 వరకు తక్షణ ఆర్థిక సహాయం తాలూకు వివరాలను కూడా ఇందులో పొందుపరచాలి. ఉత్తరప్రదేశ్‌లోని అధికారులతో సమన్వయం చేసుకొని బాధితులు కోరినట్లయితే వారిని సొంత రాష్ట్రానికి తిరిగి పంపడంతో సహా వారి దీర్ఘకాలిక పునరావాసం కోసం ఒక సమగ్ర ప్రణాళికను కూడా ఈ నివేదిక కలిగి ఉండాలి. 

2026 సెప్టెంబర్ 30న ప్రచురితమైన మీడియా నివేదిక ప్రకారం ఈ వెట్టిచాకిరీ కార్మికుల కదలికలపై ఆంక్షలు ఉండేవి… ఒక సూపర్‌వైజర్ వారి సామాగ్రిని తాళం వేసి ఉంచాడని తెలిసింది. సామాజిక కార్యకర్తల ఫిర్యాదు మేరకు రెవెన్యూ, కార్మిక శాఖ అధికారులు వీరిని రక్షించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2318344) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी