బొగ్గు మంత్రిత్వ శాఖ
'స్వచ్ఛతా హీ సేవా 2026', 'స్పెషల్ క్యాంపెయిన్ 6' లో భాగంగా... పరిశుభ్రత, ఇ-వ్యర్థాల నిర్వహణ, రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న బొగ్గు మంత్రిత్వశాఖ
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 4:53PM by PIB Hyderabad
'స్వచ్ఛతా హీ సేవా 2026', 'స్పెషల్ క్యాంపెయిన్ 6'లో భాగంగా... పరిశుభ్రత, పర్యావరణ బాధ్యత, సామాజిక సంక్షేమం వంటి అంశాలను మేళవిస్తూ బొగ్గు మంత్రిత్వశాఖ ఈ రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్, అదనపు కార్యదర్శులు శ్రీ సనోజ్ కుమార్ ఝా, శ్రీమతి రూపీందర్ బ్రార్‌లతో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ జీపీవోఏ-3 ప్రధాన ప్రవేశ లాబీలో ఇ-వ్యర్థాల కియోస్క్‌ను ప్రారంభించడంతో ఈ రోజు కార్యక్రమం మొదలైంది. ఈ కియోస్క్ ఇ-వ్యర్థాల సేకరణకు సౌకర్యం కల్పిస్తుంది. ఈ నెల 31 వరకు ఇది పనిచేస్తుంది. ఇది ఎలక్ట్రానిక్ వ్యర్థాలను బాధ్యతాయుతంగా డిస్పోజ్ చేయడాన్ని ప్రోత్సహించడంతో పాటు, వ్యర్థాల నిర్వహణలో సుస్థిర పద్ధతులను గురించి అవగాహనను పెంపొందిస్తుంది.
ఈ కియోస్క్ ప్రారంభోత్సవ అనంతరం... మెట్రో నిష్క్రమణ ద్వారం, జీపీవోఏ-3 ప్రవేశ ద్వారం సమీపంలోని సర్వీస్ రోడ్డు వెంబడి “ఏక్ దిన్, ఏక్ సాథ్, ఏక్ ఘంటా” పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. పారిశుధ్యం ఒక సామూహిక బాధ్యత అని, దానికి నిరంతర భాగస్వామ్యం అవసరమనే సందేశాన్ని పునరుద్ఘాటిస్తూ... సీనియర్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకున్నారు.
ఈ రోజు నిర్వహించిన కార్యక్రమాలకు మానవీయ కోణాన్ని జోడిస్తూ... జీపీవోఏ-3 ప్రవేశ ద్వారం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. కరుణ, సామాజిక సేవ, సామాజిక బాధ్యత స్ఫూర్తిని చాటుతూ... అధికారులు ఈ శిబిరంలో పాల్గొని రక్తదాన కార్యక్రమం కోసం తమవంతు సహకారం అందించారు.
మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది చురుకైన భాగస్వామ్యం 'స్వచ్ఛతా హీ సేవా 2026', 'స్పెషల్ క్యాంపెయిన్ 6' లక్ష్యాలకు మరింత ఊతమిచ్చింది. పర్యావరణ స్పృహ, పరిశుభ్రత, సామాజిక సంక్షేమాలను మేళవించిన ఈ కార్యక్రమాలు... సామూహిక బాధ్యత స్ఫూర్తిని అర్థవంతమైన ఆచరణగా మార్చాయి.
పరిశుభ్రత, పర్యావరణ సుస్థిరత, సమాజ సంక్షేమానికి దోహదపడేందుకు అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా పాలుపంచుకోవడంతో ఈనాటి కార్యక్రమాలు సామూహిక భాగస్వామ్యం, బాధ్యతాయుతమైన పౌరసత్వ స్ఫూర్తిని ప్రతిబింబించాయి. స్వచ్ఛతా హీ సేవా 2026, స్పెషల్ క్యాంపెయిన్ 6 కింద చేపట్టిన ఈ కార్యక్రమాలు... పరిశుభ్రత, సుస్థిరత, సామాజిక బాధ్యత సంస్కృతిని పెంపొందించడం పట్ల బొగ్గు మంత్రిత్వశాఖ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయి. తద్వారా పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ కోసం నిరంతర కార్యాచరణకు స్ఫూర్తినిస్తున్నాయి.
****
(రిలీజ్ ఐడి: 2318315)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3