గనుల మంత్రిత్వ శాఖ
అండమాన్ సముద్రంలో ఆఫ్‌షోర్ ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభించనున్న కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 6:15PM by PIB Hyderabad
అండమాన్ సముద్రంలో ఆఫ్‌షోర్ ఖనిజ బ్లాకుల వేలాన్ని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ రేపు ప్రారంభించనుంది. భారతదేశ ఆఫ్‌షోర్ ఖనిజ సంపద సామర్థ్యాన్ని వెలికితీసే దిశగా దేశ దీర్ఘకాలిక ఖనిజ వనరుల భద్రతను బలోపేతం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుంది.
సాంకేతిక పురోగతి, స్వచ్ఛమైన ఇంధనం దిశగా పరివర్తన, పటిష్టమైన సరఫరా గొలుసుల విషయంలో ఆఫ్‌షోర్ ఖనిజ వనరులు అత్యంత కీలకమైనవి. ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక శక్తి వ్యవస్థలు, అధునాతన ఎలక్ట్రానిక్స్, వ్యూహాత్మక పరిశ్రమలకు కోబాల్ట్, నికెల్, మాంగనీస్, రాగి, అరుదైన భూ మూలకాలు వంటి ఖనిజాలు ముఖ్యమైన ముడి పదార్థాలుగా ఉపయోగపడతాయి. అందువల్ల దేశీయ ఆఫ్‌షోర్ ఖనిజ వనరుల అభివృద్ధి భారత ఆత్మనిర్భరత, వనరుల భద్రత, సుస్థిర ఆర్థిక వృద్ధి లక్ష్యాలకు ఎంతగానో దోహదపడుతుంది.
ఎప్పటికప్పుడు సవరించిన ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం-2002, ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ (వేలం) నిబంధనలు- 2024 ప్రకారం ఈ వేలం నిర్వహించనున్నారు. 2023లో ఓఏఎండీఆర్ చట్టానికి చేసిన సవరణల తర్వాత ఆఫ్‌షోర్ ఖనిజ బ్లాకుల వేలాన్ని నిర్వహించే అధికారాలను గనుల మంత్రిత్వ శాఖ పొందింది. ఇది ఆఫ్‌షోర్ ఖనిజ వనరుల పారదర్శక, పోటీ కేటాయింపునకు వీలు కల్పిస్తుంది.
ఈ వేలంలో అండమాన్ సముద్ర ప్రాంతంలోని రెండు ఆఫ్‌షోర్ ఖనిజ బ్లాకులు ఉన్నాయి. వీటిని కాంపోజిట్ లైసెన్స్ మంజూరు కోసం అందిస్తున్నారు. ఇది పద్ధతి ప్రకారం జరిగే అన్వేషణకు ఊతమివ్వడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడానికి, ఆఫ్‌షోర్ ఖనిజాల అన్వేషణ, అభివృద్ధికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
పద్ధతి ప్రకారం అన్వేషణ, ఆఫ్‌షోర్ వనరుల బాధ్యతాయుతమైన అభివృద్ధి ద్వారా భారత ఖనిజ వనరులను విస్తరించడానికి ప్రభుత్వానికున్న నిబద్ధతను ఈ వేలం తెలియజేస్తోంది. భవిష్యత్తులో పారిశ్రామిక, వ్యూహాత్మక అవసరాలను తీర్చడానికి గణనీయమైన సంభావ్యత కలిగిన ఈ వర్ధమాన రంగంలో మరింత ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని, సాంకేతిక నూతన ఆవిష్కరణలను ఇది సులభతరం చేస్తుందని ఆశించొచ్చు.
భారత ఆఫ్‌షోర్ ఖనిజ సంపదను ఉపయోగించుకోవడం, వర్ధమాన సాంకేతికతలు, పారిశ్రామిక అభివృద్ధి, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి కోసం దేశ ఖనిజ భద్రతను బలోపేతం చేయడంలో ఈ వేలం ప్రారంభం మరో ఘట్టంగా నిలుస్తుంది
****.
(రిలీజ్ ఐడి: 2317344)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9