వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖరీఫ్ 2026-27 కోసం పీఎస్ఎస్ కింద రూ.5,547.99 కోట్ల రూపాయలతో పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుకు శ్రీ చౌహాన్ ఆమోదం

రైతు కేంద్రిత కీలక నిర్ణయం: ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల రైతుల నుంచి కనీస మద్దతు ధరతో రూ.5,547.99 కోట్ల విలువైన పంట ఉత్పత్తుల సేకరణకు ఆమోదం

పీఎస్ఎస్ సేకరణతో మూడు రాష్ట్రాల్లోని రైతులకు ప్రయోజనం

కనీస మద్దతు ధరతో 7.06 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజలను సేకరణ

కనీస మద్దతు ధరతో ఉత్తరప్రదేశ్‌లో కంది, పెసలు... కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సోయాబీన్, పెసలు, పొద్దుతిరుగుడు గింజల సేకరణకు శ్రీ చౌహాన్ ఆమోదం

యూపీ రైతుల నుంచి రూ.3,992.57 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లకు ఆమోదం

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వరుసగా రూ.1,107 కోట్లు, రూ.448.42 కోట్లు

మార్కెట్ ధరల పతనం నుంచి పప్పుధాన్యాలు, నూనెగింజల రైతులను కాపాడటానికి కనీస మద్దతు ధరతో కొనుగోళ్లను ముమ్మరం చేసిన కేంద్ర ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2026 3:05PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల రైతుల నుంచి 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్) కింద కనీస మద్దతు ధరతో రూ.5,547.99 కోట్ల విలువైన పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపారు. మార్కెట్ ధరల పతనం నుంచి రైతులను రక్షించడం, ముఖ్యంగా పప్పుధాన్యాలు, నూనెగింజల రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన రాబడిని అందించడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతుల సంక్షేమం, వారి ఆదాయాలను పెంచడం, వ్యవసాయంలో స్వయం-సమృద్ధిని బలోపేతం చేయడం ప్రభుత్వ కీలక ప్రాధాన్యాలుగా ఉన్నాయని శ్రీ చౌహాన్ అన్నారు. రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలు పొందేలా, కొనుగోలు యంత్రాంగాలను మరింత పారదర్శకంగా, మరింత అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఆమోదించిన కొనుగోలు ప్రణాళిక ప్రకారం... కనీస మద్దతు ధరతో కీలకమైన పప్పుధాన్యాలు, నూనెగింజల భారీస్థాయి కొనుగోలు ద్వారా మూడు రాష్ట్రాల్లోని రైతులు లబ్ధి పొందుతారు.

ఆమోదించిన కొనుగోళ్లలో అతిపెద్ద వాటాగా, ఉత్తరప్రదేశ్‌ రైతుల నుంచి రూ.3,992.57 కోట్ల విలువైన కొనుగోళ్లకు మంజూరు లభించింది. కనీస మద్దతు ధరతో రూ.3,937.70 కోట్ల విలువైన 4,66,000 మెట్రిక్ టన్నుల కందిపప్పు, రూ.54.87 కోట్ల విలువైన 6,250 మెట్రిక్ టన్నుల పెసరపప్పు కొనుగోళ్లు ఇందులో భాగంగా ఉన్నాయి.

కర్ణాటక రైతుల నుంచి పీఎస్ఎస్ కింద రూ.1,107 కోట్ల విలువైన పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోళ్ల కోసం ఆమోదం లభించింది. రూ.659.27 కోట్ల విలువైన 1,15,500 మెట్రిక్ టన్నుల సోయాబీన్, రూ.335.83 కోట్ల విలువైన 38,250 మెట్రిక్ టన్నుల పెసరపప్పు, రూ.111.90 కోట్ల విలువైన 13,413 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు గింజలు ఉన్నాయి.

తెలంగాణలో రైతుల నుంచి రూ.448.42 కోట్ల విలువైన పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఆమోదం లభించింది. ఇందులో ధరల మద్దతు పథకం కింద కనీస మద్దతు ధరతో రూ.353.90 కోట్ల విలువైన 62,000 మెట్రిక్ టన్నుల సోయాబీన్, రూ.94.52 కోట్ల విలువైన 10,766 మెట్రిక్ టన్నుల పెసరపప్పు కొనుగోలు చేయనున్నారు.

ఈ నిర్ణయం రైతులకు మరింత ఆర్థిక భద్రతను కల్పిస్తుందని... దేశంలో పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని... పప్పుధాన్యాలు, వంట నూనెల రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నాలకూ ఇది దోహదపడుతుందని శ్రీ చౌహాన్ అన్నారు. నిర్దేశిత కేంద్రాలన్నింటిలో కొనుగోలు కోసం పారదర్శకంగా ఏర్పాట్లు ఉంటాయనీ, రైతులకు వారి పంటకు సంబంధించిన చెల్లింపులు సకాలంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయని ఆయన హామీ ఇచ్చారు.


(రిలీజ్ ఐడి: 2317067) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Kannada