రక్షణ మంత్రిత్వ శాఖ
రూ.3,000 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం... అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పట్టుకున్న ఐసీజీ
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 1:27PM by PIB Hyderabad
భారత తీర రక్షక దళం ( ఐసీజీ), గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళంతో (ఏటీఎస్) కలిసి 2026 సెప్టెంబర్ 25న లక్షద్వీప్‌కు పశ్చిమాన అరేబియా సముద్రంలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ దాడుల్లో అంతర్జాతీయ ముఠా రూ.3,000 కోట్లకు పైగా విలువైన భారీ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు చేస్తున్న ప్రయత్నాన్ని భగ్నం చేసింది.
ఈ సంయుక్త ఆపరేషన్‌లో హెరాయిన్, మెథాంఫెటమైన్ సహా సుమారు 526 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను తరలిస్తున్న నౌకలో ఉన్న అయిదుగురు పాకిస్థాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు.
పక్కా సమాచారం ఆధారంగా... ఐసీజీ బలగాలు సముద్రం, గగనతలం నుంచి అనుమానిత నౌకపై నిఘా పెట్టారు. నౌక కదలికలను నిరంతరం గమనిస్తూ, సమన్వయంతో ఒకేసారి దాడికి దిగారు. ఈ ఆపరేషన్ ఫలితంగా అంతర్జాతీయ జలాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇరాన్‌కు చెందిన సంప్రదాయ నౌకను అడ్డుకుని తనిఖీ చేశారు.
అడ్డుకున్న నౌకను, అందులోని సిబ్బందిని, స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను తదుపరి దర్యాప్తు కోసం సాయుధ భద్రత నడుమ ముంబైకి తరలించారు. అక్కడ సంయుక్త విచారణ చేపట్టడం తో పాటు వివిధ దర్యాప్తు సంస్థల సమన్వయంతో చట్టపరమైన ప్రక్రియను చేపట్టారు.
ఈ విజయవంతమైన ఆపరేషన్ ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యానికి గణనీయమైన సహకారంగా నిలిచిందని ఐసీజీ పేర్కొంది. భారత సముద్ర జలాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం, అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, తమ నిబద్ధతను ఈ చర్య మరోసారి చాటిందని తెలిపింది.
(రిలీజ్ ఐడి: 2317065)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6