ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
విశ్వసనీయ డిజిటల్ గుర్తింపుతో పాటు సుపరిపాలనను ప్రోత్సహించడం కోసం ‘ఆధార్ సంవాద్ కోల్‌కతా’లో 5 కొత్త కార్యక్రమాలను ప్రారంభించిన యూఐడీఏఐ
భారత్ అభివృద్ధి ప్రస్థానంలో ‘ఆధార్’ పాత్ర చాలా కీలకమన్న గౌరవ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద..
ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో ఆధార్ ప్రాధాన్యాన్ని వివరించిన మంత్రి
భావి కార్యాచరణపై చర్చించిన 600 మందికి పైగా విధాన రూపకర్తలు, పారిశ్రామిక జగతికి చెందిన ప్రముఖులు, నూతన ఆవిష్కర్తలు
నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2026 8:24PM by PIB Hyderabad
ప్రజలకు అందిస్తున్న సేవల స్థాయిని ఇప్పటి కన్నా మరింత పెంచడానికి, ‘ఆధార్’ను ఉపయోగించడం వల్ల పొందే అవకాశాలను మెరుగుపరచడానికి, అలాగే ప్రజలకు విస్తృత స్థాయి ప్రయోజనాలు కలిగేటట్లు తోడ్పాటును అందించడానికి సంబంధిత వర్గాలతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఓ సమావేశాన్ని ఈ రోజు నిర్వహించింది.
‘ఆధార్ సంవాద్’ పేరుతో కోల్‌కతాలో రోజంతా నిర్వహించిన ఈ సమావేశంలో సీనియర్ విధాన రూపకర్తలు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, వృత్తినిపుణులు 600 కన్న ఎక్కువ మంది పాలుపంచుకున్నారు. ఈ రోజు ‘ఆధార్ 17వ దినోత్సవం’ కూడా.
వాణిజ్య శాఖ సహాయ మంత్రి, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి కూడా అయిన శ్రీ జితిన్ ప్రసాద ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశానికి విశ్వసనీయ డిజిటల్ గుర్తింపును ఇచ్చే ఓ మౌలిక సదుపాయంగా ‘ఆధార్’ను నిరంతర ప్రాతిపదికన అభివృద్ధి చేసే ప్రక్రియలో ఈ సమావేశం ఓ ముఖ్య ఘట్టంగా నిలిచింది.
శ్రీ ప్రసాద ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఆధార్‌ది ఒక గొప్ప విజయ గాథ. భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో చాలా కీలకమైన భూమికను ‘ఆధార్’ నిర్వర్తిస్తోంది’’ అన్నారు.
మంత్రి తన ప్రసంగంలో ‘‘సేవల పరిధిని విస్తరించడంలో, ఆర్థిక ప్రయోజనాలను కాల క్రమంలో చాలా మంది చెంతకు తీసుకుపోవడంలో, ప్రభుత్వ పథకాల లబ్ధిని అర్హులకు చేర్చడంలో ఆధార్ తన వంతు పాత్రను పోషిస్తోంది. ఇది మా డిజిటల్ మాధ్యమ ప్రధాన పరిపాలనకు మూలస్తంభంగా నిలిచింది. ప్రభుత్వ సేవలను పలువురు పొందడంలో, పారదర్శకత్వం, సామర్థ్యం, సమ్మిళితం లక్ష్యాలకు పూచీపడటంలో ఒక క్రాంతిని ఆధార్ తీసుకువచ్చింది’’ అన్నారు. ఎప్పటికప్పుడు కొత్త రూపాలలో మన ముందుకు వస్తున్న సాంకేతికతలను వినియోగించుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సివుందని మంత్రి పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ ప్రజానీకానికి ఆధార్ ఏయే రకాలుగా ప్రయోజనాలను అందించనుందో కూడా మంత్రి వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాల లాభాలు సిసలైన లబ్ధిదారులకు అందితీరుతాయని ఆయన అన్నారు.
యూఐడీఏఐతో పాటు ‘ఆధార్’ విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఆధార్ ఇకోసిస్టమ్) ద్వారా అమలుపరిచే ప్రతి విధానాన్నీ ప్రజల హితాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకు రానున్నట్లు యూఐడీఏఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ సౌరభ్ విజయ్ తెలిపారు. ‘ఆధార్ 17వ దినోత్సవా’న్ని పురస్కరించుకొని ఈ రోజు ప్రారంభిస్తున్న ఉత్పాదనలను కూడా ఈ దృష్టికోణానికి సరిగ్గా సరిపోయే విధంగానే రూపొందించారని ఆయన స్పష్టం చేశారు.
‘‘మరిన్ని పనులకు ‘ఆధార్’ను ఉపయోగించేందుకు ఉన్న అవకాశాలు, సుపరిపాలన నిమిత్తం ప్రమాణీకరణతో ముడిపడ్డ ఇకోసిస్టమ్‌ను ఇప్పటి కన్న మరింతగా పటిష్టపరిచే విధానాలు, ఆధార్ ఇకోసిస్టమ్‌లో కొత్త చేరికలు, నూతన వివరాలను పొందుపరచడానికి ఉన్న పరిధులు, ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకొంటున్న సాంకేతికతల సవాళ్లు, కల్పించగల అవకాశాలపై మేం రోజంతా చర్చించాం’’ అని శ్రీ విజయ్ వివరించారు.
‘‘శరవేగంగా మార్పులకు లోనవుతున్న డిజిటల్ ఇండియాలో కాలంతో పాటే మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా ‘ఆధార్’లో మార్పులను తీసుకువస్తున్న విషయాన్ని గుర్తించాల్సిన సందర్భంగా కూడా ఈ రోజు నిలుస్తున్నది. కొత్త టెక్నాలజీలు, సేవల అందజేతలో కొత్త విధానాలు, గోప్యతకు, భద్రతకు అగ్రతాంబూలాన్ని ఇవ్వడం, నివాసి అనుకూలతను లెక్కలోకి తీసుకోవడం.. ఇవన్నీ ‘ఆధార్’లో చేపట్టాల్సిన తదుపరి మార్పులకు రూపురేఖలను కల్పిస్తున్నాయి’’ అని యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ వివేక్ సి. వర్మ అన్నారు. సమావేశంలో స్వాగతోపన్యాసాన్ని ఆయన ఇచ్చారు.
నివాసి అనుకూలతలను పెంపొందింప చేయడం, భద్రతను బలోపేతం చేయడం, సుపరిపాలనను నిర్ధారించడంతో పాటు డిజిటల్ పరివర్తనకు సంబంధించిన తరువాతి దశను దృష్టిలో పెట్టుకొని ఆధార్ ఇకోసిస్టమ్‌ను ఖరారు చేయాలన్న లక్ష్యాలతో, 5 కొత్త కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రారంభించారు.
శుభారంభం చేసిన అయిదు కార్యక్రమాల్లో.. ‘ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (ఈపీడీఎస్) కోసం ముఖ ప్రమాణీకరణ’ కీలకమైంది. దీనిని యూఐడీఏఐతో పాటు, ఆహార-ప్రజా పంపిణీ విభాగం (డీఎఫ్‌పీడీ), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)లు కలిసి తెర మీదకు తెచ్చాయి. అంగీకారంపై ఆధారపడి ఉండే, చేతితో తాకనక్కర లేకుండానే (కాంటాక్ట్‌లెస్) గుర్తింపునకు వీలు కల్పించే ఈ ఐచ్ఛికం లబ్ధిదారుల గుర్తింపును రుజువుచేసేందుకు మరొక పద్ధతిని అందిస్తోంది. మరీ ముఖ్యంగా వేలిముద్రతో గుర్తింపు ప్రక్రియను అమలుచేయడం కష్టసాధ్యమయ్యే స్థితిలో ఇది పనికొస్తుంది. ఇది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ ఈపీడీఎస్ వ్యవస్థలో ముఖ ప్రమాణీకరణ (ఫేస్ ఆథెంటికేషన్)ను ఓ భాగంగా చేర్చుకోవడంలో సాయపడుతుంది.
‘ఎస్‌డబ్ల్యూఐకే పోర్టల్ 2.0’ను కూడా యూఐడీఏఐ ప్రవేశపెట్టింది. ఇది సుపరిపాలన కోసం ఆధార్ ప్రమాణీకరణ ప్రాథమిక ప్రణాళికలో భాగంగా ఆధార్ ప్రమాణీకరణకు అనుమతిని కోరే ప్రక్రియను సరళతరం చేస్తుంది. అర్హత కలిగిన ప్రభుత్వేతర సంస్థలు ఇక అనుమతిని తీసుకొని మరీ ఉపయోగించాల్సిన వ్యవహారాలకుగాను నేరుగా వెబ్‌సైట్లోకి వెళ్లి సంబంధిత మంత్రిత్వశాఖతో పాటు విభాగానికి ప్రతిపాదనను పంపించగలుగుతాయి. దీంతో అనుమతి ప్రక్రియ సువ్యవస్థితం కావడంతో పాటు, సమన్వయసహితంగా మారుతుంది. ఈ వెబ్‌సైట్ ఇదుగో ఇదీ.. https://swik.meity.gov.in/
ఈ రోజు ప్రారంభించిన సబ్-ఏయూఏ/సబ్-కేయూఏ (ఎల్ఐటీఈ) ప్రాథమిక ప్రణాళిక.. అవసరాలు తక్కువ పరిమాణంలో ఉండే, అర్హత కలిగిన ప్రభుత్వేతర సంస్థల ద్వారా ఆధార్ ప్రమాణీకరణను పెద్ద ఎత్తున అనుమతించడంలో సాయపడుతుంది. అర్హత కలిగిన సంస్థలు ప్రస్తుత ఏయూఏ/కేయూఏ ల ప్రమాణీకరణ సంబంధిత మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. దీంతో అవి యూఐడీఏఐ తాలూకు భద్రత, గోప్యత, నియంత్రణ సంబంధిత అవసరాలను తీరుస్తూనే, ఎలాంటి ప్రమాణీకరణ సంబంధిత మౌలిక సదుపాయాలనూ సొంతగా ఏర్పాటు చేసుకోనక్కరలేకుండానే, వాస్తవ కాల ప్రాతిపదికన (రియల్-టైమ్) సులభంగా, వేగంగా సిస్టమ్‌తో ముడిపడే (ఆన్‌బోర్డింగ్) అవకాశాన్ని పొందొచ్చు.
యూఐడీఏఐ మరొక కొత్త ‘టోకెన్ నిర్వహణ వ్యవస్థ’ను కూడా ఆవిష్కరించింది. దీంతో ప్రజలు ఇది ఎక్కడ వర్తింపులో ఉంటే అక్కడ సేవలను పొందడం కోసం యూఐడీఏఐ రాష్ట్ర కార్యాలయాలకు గాని, ప్రాంతీయ కార్యాలయాలకు గాని వెళ్లడాన్ని సులభమైతరం చేస్తుంది.
సరికొత్త రూపంలో యూఐడీఏఐ వెబ్‌సైట్:
మార్పుచేర్పులతో కూడిన యూఐడీఏఐ కొత్త వెబ్‌సైట్‌ను మంత్రి శ్రీ జితిన్ ప్రసాద ప్రారంభించారు. దీనిలో సమాచారాన్ని రియల్-టైంలో పొందొచ్చు. నివాసులు నాలుగు ముఖ్య కారణాలతో యూఐడీఏఐ దగ్గరకు వస్తారు: వారు.. ఆధార్ గురించి తెలుసుకోవడానికి, ఏ సేవనైనా ఉపయోగించుకోవడానికి, ఏదైనా డాక్యుమెంటును వెతకడానికి గాని, లేదా సాయాన్ని పొందడానికి గాని వస్తారు. ఈ పనులన్నింటినీ, కొత్త రూపురేఖలను కల్పించిన వెబ్‌సైట్ స్పష్టంగానూ, సరళతర విధానంలోనూ పూర్తి చేసి పెడుతుంది.
ఆధార్ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ఈ వెబ్‌సైటును తీర్చిదిద్దారు. దీంతో యూఐడీఏఐ వెబ్‌సైట్, మైఆధార్ (myAadhaar) పోర్టల్‌తో పాటు ఆధార్ యాప్‌లో ఒకే మాదిరి దృశ్యాత్మక గుర్తింపు లభించినట్లు అయింది.
మార్పుచేర్పులతో కూడిన వెబ్‌సైట్‌లో, సౌలభ్యం విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. దీనిని అందరూ తేలికగా ఉపయోగించుకోనేలా తీర్చిదిద్దారు. స్క్రీన్-రీడర్ అనుకూలత, ఫాంట్ సైజులు మార్చుకునే వెసులుబాటు, మెరుగైన కలర్ కాంట్రాస్ట్, కీబోర్డు మార్గదర్శనం, లభ్యతతో ముడిపడిన ఇతర దిద్దుబాటు చర్యలను దీనికి జతచేశారు. ఫలితంగా, ఆధార్‌తో ముడిపడిన సమాచారంతో పాటు సేవల చెంతకు చేరుకోవడం దివ్యాంగ జనులు సహా పౌరులందరికీ సులభతరంగా మారుతుంది.
భాషిణి (BHASHINI)ని ఏకీకరించడంతో, ఈ వెబ్‌సైట్ ఇంగ్లిషు, హిందీ సహా 13 భాషలలో అందుబాటులోకి వచ్చింది. మేం త్వరలోనే ఈ వెబ్‌సైటును 23 భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇది 13 భాషల్లో లభ్యమవుతుంది.
కొత్త రూపాన్ని సంతరించిన వెబ్‌సైట్‌లో యూఐడీఏఐ కెరియర్ పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. దీంతో డిప్యుటేషన్ అవకాశాల కోసం ఆన్‌లైన్లో దరఖాస్తులు పెట్టుకొనేందుకు కూడా వీలు చిక్కుతుంది. ఆసక్తి కలిగిన దరఖాస్తుదారుల కోసం తేలికైన, పారదర్శకమైన ప్రక్రియను అందుబాటులోకి తీసుకువచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2317040)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10