సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
జాతీయ కళా ప్రదర్శనలో పురస్కార గ్రహీతలైన 20 మంది కళాకారులను సత్కరించిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్
65వ జాతీయ కళా ప్రదర్శనకు 6,000కు పైగా దరఖాస్తులు రెండంచెల జ్యూరీ ప్రక్రియ ద్వారా 270 మంది కళాకారుల ఎంపిక
నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2026 9:42PM by PIB Hyderabad
లలిత్ కళా అకాడమీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ వేదికగా ఈ రోజు 65వ జాతీయ కళా ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (అకడెమిక్స్) శ్రీ కె.కె. మిశ్రా, లలిత్ కళా అకాడమీ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్‌లతో పాటు... పద్మశ్రీ పురస్కార గ్రహీతలు శ్రీ సుధాకర్ ఓల్వే, శ్రీ సుదర్శన్ పట్నాయక్, శ్రీ అశోక్ కుమార్ విశ్వాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, లలిత్ కళా అకాడమీకి చెందిన వివిధ కేంద్రాల్లో నిర్వహించిన ‘సేవా హి సంస్కృతి’ కార్యశాలల్లో వ్యర్థ పదార్థాలతో రూపొందించిన కళాకృతులను శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్, ఇతర ప్రముఖులు వీక్షించారు.
శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ సభనుద్దేశించి ప్రసంగిస్తూ... సృజనాత్మకత, సుస్థిరతలను ఏకం చేయడంలోని ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినోత్సవ సందర్భంగా నిర్వహించిన ‘సేవా హి సంస్కృతి’ కార్యక్రమం... సృజనాత్మకత, సేవా స్ఫూర్తిని అర్థవంతంగా ఏకం చేయగల తీరును ప్రదర్శించిందని ఆయన అన్నారు. పనికిరాని వస్తువులకు కొత్త కళాత్మక రూపాన్ని ఇస్తూ, సుస్థిరతను ప్రోత్సహించడంలో కళల పాత్రను చాటిచెప్పిన ‘వేస్ట్ టు వండర్’ కార్యక్రమం నిర్వహించడం సహా, లలిత్ కళా అకాడమీ వివిధ విభాగాల్లో చేస్తున్న కృషినీ ఆయన అభినందించారు.
సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ... కళాకారులకు, సమకాలీన భారతీయ కళలకు విస్తృత అవకాశాలు, మరింత గుర్తింపు కల్పించాల్సిన ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్‌లో నిర్వహిస్తున్న 65వ జాతీయ కళా ప్రదర్శనను 2026, అక్టోబర్ 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనను వీక్షించాల్సిందిగా ఆయన ప్రజలను, కళాభిమానులను, సందర్శకులను ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు ప్రదర్శించే విభిన్న కళా రూపాలు, సమకాలీన పోకడలను వీక్షించేందుకు ఈ ప్రదర్శనను సందర్శించాలని ఆయన ప్రజలను ప్రోత్సహించారు.
లలిత్ కళా అకాడమీ కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ... ఈ కళా ప్రదర్శన జాతీయ స్థాయి విస్తరణ, పరిణామాన్ని వివరించారు. 65వ ఎడిషన్‌కు 6,000కు పైగా ఎంట్రీలు అందాయనీ, వాటిలో రెండంచెల జ్యూరీ ప్రక్రియ ద్వారా 270 మంది కళాకారులను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనలో భాగంగా పురస్కారాలను అందించడం, దేశవ్యాప్తంగా ఉన్న కళా ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడం కోసం అకాడమీ చేస్తున్న నిరంతర ప్రయత్నాలనూ ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ సందర్భంగా శ్రీ రామ్ గోపాల్ ఖదిల్కర్ సంపాదకత్వంలో అబ్దుల్ అజీజ్ రైబాపై రూపొందించిన మోనోగ్రాఫ్‌ను విడుదల చేశారు. ప్రముఖ ఆధునిక భారతీయ చిత్రకారుడైన రైబా... తన ధృడమైన భావాలను ప్రతిబింబించే చిత్రాలు, ఉజ్వలమైన రంగులు, భారతీయ సాంప్రదాయం, ఆధునిక కళల విలక్షణమైన సమ్మేళనానికి ప్రసిద్ధి చెందారు.
ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతలైన 20 మంది కళాకారులను కేంద్ర మంత్రి సత్కరించారు. భారతీయ దృశ్య కళా రంగంలో వారు చేసిన సృజనాత్మక కృషికి, అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు అందజేస్తున్నారు.
కార్యక్రమానంతరం... ముఖ్య అతిథి, ఇతర ప్రముఖులు లలిత్ కళా గ్యాలరీలోని జాతీయ కళా ప్రదర్శనను సందర్శించారు. దేశంలోని వివిధ ప్రాంతాల కళా ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించి, విస్తృత ప్రచారం కల్పించేందుకు లలిత్ కళా అకాడమీ చేస్తున్న నిరంతర కృషిని ఈ ప్రదర్శన ప్రతిబింబిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2316831)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11