బొగ్గు మంత్రిత్వ శాఖ
అక్టోబరు 2 నుంచి 31వరకు ‘స్పెషల్ క్యాంపెయిన్-6’ నిర్వహణకు సిద్ధమైన బొగ్గు మంత్రిత్వశాఖ
నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2026 5:25PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ అక్టోబరు 2 నుంచి 31 వరకు అన్ని పరిపాలనా కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో స్పెషల్ క్యాంపెయిన్-6ను నిర్వహించనుంది. "వ్యర్థాల నుంచి సంపద" అనే జాతీయ దార్శనికతకు అనుగుణంగా, నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం శాస్త్రీయ పద్ధతిలో ఇ-వ్యర్థాలను తొలగించడం, స్క్రాప్ తొలగింపు, కార్యాలయ స్థలాల ఆప్టిమైజేషన్, కార్యాలయాల డిజిటలైజేషన్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. తద్వారా సుస్థిరమైన, సమర్థమైన, పౌరులకు ప్రాధాన్యమిచ్చే పాలనను ప్రోత్సహిస్తుంది.
సమగ్ర అమలు, సంసిద్ధతను నిర్ధారించడం కోసం కీలక సమీక్షా సమావేశాలు నిర్వహించిన మంత్రిత్వశాఖ:
మంత్రిత్వ శాఖ స్థాయి సమీక్ష: కార్యాచరణ వ్యూహం, లక్ష్య ప్రమాణాలను నిర్దేశించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపీందర్ బ్రార్ అధ్యక్షతన ఈ నెల 28న మంత్రిత్వ శాఖలోని అన్ని విభాగాల సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
పీఎస్‌యూ, అనుబంధ కార్యాలయాలతో సమావేశం: బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ కాస్సీ ఈ నెల 29న కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), దాని అనుబంధ సంస్థలు, ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, కోల్ కంట్రోలర్స్ ఆర్గనైజేషన్ (సీసీవో), కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్‌వో)లకు చెందిన నోడల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ముఖ్యాంశాలు, సన్నాహక కార్యక్రమాలు
గుర్తింపు, విభజన కార్యక్రమం: పరిశుభ్రమైన కార్యాలయాలను, సమర్థమైన అసెట్ నిర్వహణను ప్రోత్సహించేందుకు గానూ మంత్రిత్వశాఖ తన సీపీఎస్ఈలు, సీసీవో, సీఎంపీఎఫ్‌వోలతో కలిసి... క్రమబద్ధమైన సమీక్ష, విభజన, శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్ చేయడం కోసం వాడుకలో లేని వస్తువులు, స్క్రాప్, ఇ-వ్యర్థాలను చురుగ్గా గుర్తిస్తోంది.
యువత ఆవిష్కరణల కార్యశాల: వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్) ఉద్యోగుల పిల్లల కోసం డబ్ల్యూసీఎల్ కోయ్లా విహార్‌లో "వ్యర్థాల నుంచి సంపద కార్యశాల"ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులు... డిస్పోజ్ చేసిన వ్యర్థ పదార్థాలతో అంతరిక్ష నౌకలు, రోబోలు, కార్లు, కోటలు వంటి సృజనాత్మక నమూనాలు రూపొందించారు. తద్వారా యువత భాగస్వామ్యంతో గల సుస్థిర పద్ధతులను వారు ప్రదర్శించారు.
పరిశుభ్రతపై అవగాహన కల్పించడం: పరిశుభ్రత, అభివృద్ధి చెందిన భారత్ దార్శనికత అనే ఇతివృత్తంపై కోల్ కంట్రోలర్స్ ఆర్గనైజేషన్ చర్చా పోటీని నిర్వహించింది. ఇది అధికారుల్లో చురుకైన సంభాషణను, పర్యావరణ అవగాహనను పెంపొందించింది.
ఈ సమష్టి ప్రయత్నాల ద్వారా, పటిష్ఠమైన సంస్థాగత యంత్రాంగాలను బలోపేతం చేయడానికి, పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడానికి, మరింత పరిశుభ్రమైన, హరిత భారత్‌ను ముందుకు తీసుకెళ్లడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ నిరంతరం కట్టుబడి ఉంది.
****
(రిలీజ్ ఐడి: 2316728)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8