పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆస్ట్రేలియా లోని హోబార్ట్‌లో ఐడబ్ల్యూసీ-70 నిర్వహణ


తిమింగలాలు, ఇతర సముద్ర ప్రాణుల సంరక్షణ పట్ల నిబద్ధత పునరుద్ఘాటించిన భారత్

సముద్ర ప్రాణులకు ముప్పు కలిగించే సవాళ్లను పరిష్కరించడానికి
సైన్స్ ఆధారిత సంరక్షణ, అంతర్జాతీయ సహకారంతో పాటు
ఆచరణాత్మక చర్యలు ఎంతో అవసరమని స్పష్టం చేసిన భారత్

నాడు పోస్టు చేయడమైనది: 28 SEP 2026 5:10PM by PIB Hyderabad

ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ 70వ సమావేశాన్ని (ఐడబ్ల్యూసీ-70) నేటి నుంచి వచ్చే నెల 2 వరకు ఆస్ట్రేలియా లోని హోబార్ట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిమింగలాలు, డాల్ఫిన్లు, నీరుపందులు తదితర సముద్ర ప్రాణులను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్ నేడు స్పష్టం చేసింది.

 


భారత్ ఐడబ్ల్యూసీ-70 ప్రారంభిక సదస్సులో ఓ ప్రకటనను చేస్తూ, సముద్ర ఆధారిత ప్రజాతులను ప్రభావవంతంగా సంరక్షించడానికి వివిధ దేశాలు, విజ్ఞానశాస్త్ర సంస్థలు, సంబంధిత అంతర్జాతీయ సంస్థల మధ్య నిరంతర సహకారాన్ని ఇక మీదటా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది. సంరక్షణ చర్యలను పటిష్టపరచడానికి, విషయాలను తెలుసుకున్న తరువాతనే నిర్ణయాలను తీసుకోవడానికి సంతతి స్థాయులు, కదలికలు, ప్రజాతులు వృద్ధి చెందడానికి తగిన అనుకూల వాతావరణంతో పాటు ఎదురయ్యే అపాయాల పట్ల మెరుగైన విజ్ఞానశాస్త్ర సమాచారాన్ని సేకరించే వ్యవస్థను బలోపేతం చేసుకోవడం వంటి చర్యలు కీలక పాత్రను పోషిస్తాయని భారత్ పేర్కొంది.
బలమైన విజ్ఞానశాస్త్ర అవగాహన ఆధారంగా తిమింగలాలు, డాల్ఫిన్లు, నీటి పందులు వంటి సముద్ర ప్రాణుల సంరక్షణను, నిర్వహణను కొనసాగించాలని, విజ్ఞానశాస్త్ర అధ్యయనాలు, ఫలితాల ఆధారంగా ముందుకు పోయే పద్ధతులకు మద్దతిస్తానని భారత్ పునరుద్ఘాటించింది. సముద్ర ప్రాణులకు ఎదురు కాగల ముప్పులకు ఎదురొడ్డి వాటిని పరిష్కరించడానికి ఆచరణీయమైన, స్థానికంగా సముచితమైన విధానాలను రూపొందించడంలో ప్రభుత్వాలు, పరిశోధకులు, స్థానిక సమాజాల మధ్య ఇప్పటి కన్న మరింత ఎక్కువ సహకారం నెలకొనాల్సి ఉందని భారత్ సూచించింది.

 


తిమింగలాలను వేటాడడాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ ఒప్పందంపై సంతకాలు జరిగి 80 సంవత్సరాలు పూర్తి అయిన తరుణంలో, ఈ సమావేశాన్ని నిర్వహిస్తుండడంతో దీనికి ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
తిమింగలాలను వేటాడడాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ ఒప్పందంపై 1946 డిసెంబర్ 2న వాషింగ్టన్ డీసీలో సంతకాల  ప్రక్రియను పూర్తి చేసిన తరువాత, ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్‌ (ఐడబ్ల్యూసీ)ని ఏర్పాటు చేశారు. తిమింగలాల వేటను అదుపు చేయడం, తిమింగలాల సంరక్షణ కోసం పూచీ పడే అంతర్జాతీయ సంస్థ ఇది.  దీనిలో 89 ప్రభుత్వాలు సభ్యత్వాన్ని తీసుకున్నాయి. ఇంటర్నేషనల్  వేలింగ్ కమిషన్‌లో భారత్‌కు 1981 నుంచి సభ్యత్వం ఉన్నది. తిమింగలాల సంరక్షణలో భారత్ క్రియాత్మక, ప్రధాన భూమికను నిర్వహిస్తున్నది.
భారతీయ జలాల్లో తిరుగాడే సముద్ర ప్రాణుల్లోని వివిధ ప్రజాతులకు వన్యప్రాణి (పరిరక్షణ) చట్టం-1972 పరిధిలో అత్యున్నత స్థాయి చట్ట సంరక్షణ కవచం లభిస్తోంది. తిమింగలాలు, డాల్ఫిన్లు, సముద్రపు ఆవులు, సొరచేపలు, చిన్న సొరచేపలను పోలి ఉండే ‘రే’ జాతి చేపలు, సముద్రపు తాబేళ్లు, ప్రవాళాలు సహా సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి దేశంలో అనేక సముద్ర సంరక్షిత ప్రాంతాలను ఇప్పటికే నోటిఫై కూడా చేశారు.
డాల్ఫిన్లు, తిమింగలాలు, నీరుపందులు, తదితర జలచర విస్తారిత అనుబంధ వ్యవస్థలను సంరక్షించడానికి సమగ్ర విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. దీనిలో భాగంగా ‘ప్రాజెక్ట్ డాల్ఫిన్‌’ను ప్రారంభించింది. అరేబియా సముద్రంలో సంచరించే హంప్‌బ్యాక్ వేల్ ప్రజాతులను సంరక్షించడానికి భారత్ అమిత ప్రాధాన్యాన్ని కట్టబెడుతోంది. అరేబియన్ సీ హంప్‌బ్యాక్ వేల్ సంతతిలో 25 ప్రజాతులు ఉన్నాయి.
సైన్స్ ఆధారిత సంరక్షణ చర్యలు, అంతర్జాతీయ స్థాయి సహకారం, తిమింగలాలకు, ఇతర సముద్ర క్షీరద ప్రాణులకు ఎదురయ్యే వివిధ అపాయాలను అరికట్టడానికి ప్రయోగాత్మక చర్యలు చేపట్టడం ద్వారా ఐడబ్ల్యూసీ భావి కార్యాచరణకు సరయిన మార్గదర్వకత్వాన్ని అందించాల్సిన అవసరముందని భారత్ పునరుద్ఘాటించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2316514) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Tamil