సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2 లక్షల కన్న ఎక్కువ మందితో స్వచ్ఛత, సాంస్కృతిక జాగృతి

ప్రజల భాగస్వామ్య సందేశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లిన సేవా హీ సంస్కృతి

నాడు పోస్టు చేయడమైనది: 28 SEP 2026 4:54PM by PIB Hyderabad

‘సేవా సంకల్ప్ అభియాన్-2026’లో ఓ ముఖ్య భాగంగా ‘సేవా హీ సంస్కృతి’ కార్యక్రమాన్ని సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఈ నెల 17 నుంచి 24 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించింది.  సేవ, స్వచ్ఛత, సాంస్కృతిక జాగృతి, దేశ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం వంటి భావనలను ప్రోత్సహించడం ప్రధానోద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

‘సేవా హీ సంస్కృతి’ కార్యక్రమంలో భాగంగా ‘వారసత్వం, అభివృద్ధి’, ‘స్వచ్ఛతతో జతపడిన ఒక కొత్త కథ’ వంటి విషయాల ఆధారంగా అనేక కార్యకలాపాలను నిర్వహించారు. వీటిలో వీధి నాటికలు, కళా ప్రదర్శనలు, ముగ్గులు వేయడం, సామూహిక గానం వంటివి ఉన్నాయి. వీటి ద్వారా స్వచ్ఛత పరిరక్షణ, సామాజిక బాధ్యత అన్న సందేశాలను ప్రజల చెంతకు చేరవేశారు. దీంతో పాటు భారతదేశ సంస్కృతి, విలువలు, నైతిక సిద్ధాంతాలు, దేశ సాంస్కృతిక వారసత్వ రక్షణకు ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సి ఉందన్న అవగాహనను కల్పించారు.

ఈ కార్యక్రమానికి మద్దతును అందించిన సంస్థల్లో సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) తో పాటు దేశంలోని ఏడు జోనల్ సాంస్కృతిక కేంద్రాలైన నార్త్ జోన్ కల్చరల్ సెంటర్ (ఎన్‌జడ్‌సీసీ), నార్త్ ఈస్ట్ జోన్ కల్చరల్ సెంటర్ (ఎన్‌ఈజడ్‌సీసీ), ఈస్ట్ జోన్ కల్చరల్ సెంటర్ (ఈజడ్‌సీసీ), వెస్ట్ జోన్ కల్చరల్ సెంటర్ (డబ్ల్యూజడ్‌సీసీ), సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ (ఎస్‌జడ్‌సీసీ), సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ (ఎస్‌సీజడ్‌సీసీ), నార్త్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ (ఎన్‌‌సీజడ్‌సీసీ) ఉన్నాయి.

ఈ ప్రచార ఉద్యమంలో భాగంగా, దేశంలో వివిధ ప్రాంతాల్లో 270కి పైగా కార్యక్రమాలను నిర్వహించారు. వీటిలో వీధి నాటికలు, ముగ్గులు వేయడం, స్వచ్ఛత పరిరక్షణ, అంతా కలిసికట్టుగా ‘వందే మాతరం’ ఆలపించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో 2 లక్షల మందికి పైగా పాల్గొన్నారు.

ఉమ్మడి భాగస్వామ్యం ద్వారా స్వచ్ఛత, సాంస్కృతిక స్థలాల రక్షణను ధ్యేయంగా ఎంచుకొని ‘సేవా హీ సంస్కృతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయాల్లోనూ, సాంస్కృతిక ప్రదేశాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వచ్ఛత పరిరక్షణ కార్యక్రమాలే కాక వివిధ వారసత్వ ప్రదేశాలలో స్వచ్ఛత ఉద్యమంలో పాలుపంచుకొనేటట్లుగా ప్రజలను ప్రోత్సహించారు.

ప్రజలు తప్పక ప్రభావితం అయ్యే రీతిలో వీధి నాటికలు, భారత సాంస్కృతిక విజయాలను ప్రస్తావించే కథలు, వివిధ కార్యక్రమాలను ప్రదర్శించారు. కళను, సంస్కృతిని, ప్రజల భాగస్వామ్యాన్ని ఏకతాటి మీదకు తీసుకురావడం ద్వారా సామాజిక బాధ్యత భావనను ప్రోత్సహించేలా చూడడం ఈ కార్యక్రమ లక్ష్యం. ప్రత్యేకించి యువతలోనూ, విద్యార్థుల్లోనూ దేశ నిర్మాణం పట్ల సేవ, నిబద్ధత భావాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ధ్యేయం.

ఈ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలు, పార్కులు, బజార్లు, దేవాలయాలు, ఘాట్లతో పాటు ఇతర బహిరంగ స్థలాల్లో నిర్వహించారు.

సేవ, స్వచ్ఛత, సంస్కృతిల విలువలను ‘సేవా హీ సంస్కృతి’ కార్యక్రమం ప్రస్ఫుటం చేసింది. దేశానికి సేవలను అందించడంలో భారత సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, బహిరంగ స్థలాలను శుభ్రంగా ఉంచడం కూడా ప్రాధాన్య అంశమేననే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటింది.

***


(రిలీజ్ ఐడి: 2316108) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी