ఉక్కు మంత్రిత్వ శాఖ
ఛత్తీస్‌గఢ్.. బస్తర్‌లో రూ.5,427 కోట్ల విలువైన ఇనుప ఖనిజం ప్రాసెసింగ్ ప్లాంటు, స్లర్రీ పైప్‌లైనుతో పాటు పెల్లెట్ ప్లాంటును కూడా ప్రారంభించిన ఎన్ఎమ్‌డీసీ
నాడు పోస్టు చేయడమైనది:
27 SEP 2026 11:48PM by PIB Hyderabad
ఛత్తీస్‌గఢ్‌లోని నగర్‌నార్‌లో 2 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం (ఎమ్‌టీపీఏ) కలిగిన పెల్లెట్ ప్లాంటును ఎన్ఎమ్‌డీసీ ప్రారంభించింది. ఇది ఇనుప ఖనిజం ప్రాసెసింగ్, పైప్‌లైన్, పెలెట్లను తయారు చేసే రూ.5,427 కోట్ల ఏకీకృత ప్రాజెక్టులో ఓ భాగం. ఈ ఏకీకృత ప్రాజెక్టు బచేలీలో ఎన్ఎమ్‌డీసీ ఇనుప ఖనిజ సంబంధిత కార్యకలపాలను నగర్‌నార్‌లో కంపెనీకి ఉన్న ఉక్కు ప్లాంటుతో అనుసంధానిస్తుంది.
ఈ ప్రాజెక్టులో.. బచేలీలో ఒక కొత్త ఇనుప ఖనిజం ప్రాసెసింగ్ ప్లాంటు, 15 ఎమ్‌టీపీఏ స్లర్రీ పైప్‌లైనులతో పాటు నగర్‌నార్‌లోని 2 ఎమ్‌టీపీఏ పెల్లెట్ ప్లాంటు కూడా భాగంగా ఉన్నాయి. ప్రాసెస్ చేసిన ఇనుప ఖనిజాన్ని 135 కిలోమీటర్ల మేర స్లర్రీ పైప్‌లైను బచేలీ నుంచి నగర్‌నార్ వరకు తీసుకుపోతుంది. ఇది రోడ్డు మార్గం గుండా ఈ సామగ్రిని చేరవేయడానికి ఒక ప్రత్యామ్నాయం.
_20260927235521_b83c0e.jpeg)
పెల్లెట్ ప్లాంటులో తొలి ఉత్పాదన ప్రక్రియను ఎన్ఎమ్‌డీసీ ప్రధానకేంద్రం నుంచి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు శ్రీ అమితావ ముఖర్జీతో పాటు కంపెనీలోని ఇతర సీనియర్ నాయకులు పర్యవేక్షించారు. అననుకూల వాతావరణం నెలకొనడంతో వారు ప్రాజెక్టు స్థలం వద్దకు చేరుకోలేకపోయారు.
ఈ సదుపాయాలు ఎన్ఎమ్‌డీసీకి బైలాడీలా గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని పైన్స్ గాను, స్లైమ్స్ గాను కాన్సెంట్రేట్ రూపంలో ప్రాసెస్ చేయడానికి, అటు తరువాత కాన్సెంట్రేటును పెల్లెట్ల రూపంలోకి మార్చడానికి ఉపయోగపడతాయి. ఈ పెల్లెట్ ప్లాంటు.. ఉక్కు తయారీలో ఉపయోగించే పెల్లెట్లను ఉత్పత్తి చేయడానికి స్ట్రెయిట్ గేట్ ఇన్‌డ్యూరేషన్ సాంకేతికతను వినియోగించుకుంటుంది.
ఈ సందర్భంగా ఎన్ఎమ్‌డీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు శ్రీ అమితావ ముఖర్జీ మాట్లాడుతూ, ‘‘ఎన్ఎమ్‌డీసీలో అందరికీ ఈ రోజు ఎంతో ఆనందదాయకమైన రోజు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం అంత సులభంగా ఏమీ నెరవేరలేదు. దీనిలో ప్రాసెసింగ్ సౌకర్యాలు, వాస్తవిక స్లర్రీ పైప్‌లైను, పెల్లెట్ ప్లాంటులు కలిసి ఉన్నాయి. అయితే ఈ రోజు మరో ముఖ్య విషయం ఏమిటంటే, మేం ఈ రోజు కోసం ఎంతో కాలంగా ఎదురుచూపులు చూస్తూవచ్చాం. మేమంతా కన్న కల ఈ రోజు నెరవేరుతోంది’’ అన్నారు.
ఈ కమిషనింగ్ కార్యక్రమం.. గని తవ్వకం మొదలు స్లర్రీ రవాణా, పెల్లెట్ ఉత్పత్తి వరకు చూసుకుంటే.. ఇనుప ఖనిజం విలువను పెంచే వ్యవస్థలో ఎన్ఎమ్‌డీసీకి ఉన్న ఉనికిని బలోపేతం చేస్తుంది. ఇది మరో కొత్తదైన ‘విలువ పెంచిన ఉత్పాదన’ను కంపెనీ పోర్ట్‌ఫోలియోకు జోడిస్తుంది. అంతేకాదు, కంపెనీ బైలాడీలా కార్యకలాపాల ద్వారా వెలికితీస్తున్న ఇనుప ఖనిజం తాలూకు ఫైన్స్, స్లైమ్స్‌ను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకొనేందుకు కూడా ఇది దోహదం చేస్తుంది.
ఎన్ఎమ్‌డీసీకి ఉన్న విస్తృత, వివిధీకరణ వ్యూహాల్లో ఈ ప్రాజెక్టు ఓ భాగం. దీనివల్ల కంపెనీ దీర్ఘ కాలంలో తన ఇనుప ఖనిజ ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 మిలియన్ టన్నుల స్థాయికి పెంచుకొనే దిశగా పయనించగలుగుతుంది.
బస్తర్, దంతెవాడ జిల్లాల్లోని 61 పల్లెల మీదుగా ఈ స్లర్రీ పైప్‌లైను సాగుతుంది. ప్రాసెస్ చేసిన ఇనుప ఖనిజాన్ని రోడ్డు మార్గం గుండా చేరవేయడాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతోను, తరలింపునకు ఒక ప్రత్యామ్నాయ పద్ధతిని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రైల్వేపై ఆధారపడటాన్ని తగ్గించే ఉద్దేశంతోను దీనిని రూపొందించారు. ఎన్ఎమ్‌డీసీ బచేలీ కార్యకలాపాలకు, నగర్‌నార్ ఉక్కు ప్లాంటుకు మధ్య ఓ ప్రత్యేక లింకును ఏర్పరచాలనే దృష్టితో కూడా ఈ ప్రాజెక్టును సంకల్పించారు.
***
(రిలీజ్ ఐడి: 2315985)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3