సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ సహకార శిక్షణ వ్యవస్థ (ఎన్‌సీటీఎఫ్‌) 2026పై న్యూఢిల్లీలో జాతీయ స్థాయి అజెండా రూపకల్పన సంప్రదింపుల సదస్సు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘సహకార్‌ సే సమృద్ధి’ దార్శనికతకు అనుగుణంగా సహకార రంగ మానవ వనరుల వ్యవస్థను బలోపేతం చేయనున్న ఎన్‌సీటీఎఫ్‌ 2026



కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా నాయకత్వంలో వృత్తిపరమైన, నైపుణ్యవంతమైన, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే సహకార సంస్థల నిర్మాణానికి ప్రాధాన్యం



సహకార శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి సమగ్రమైన, నాణ్యతకు హామీతో, అందరికీ అందుబాటులో ఉండే, ఫలితాల ఆధారిత జాతీయ వ్యవస్థకు విస్తృత దిశానిర్దేశం చేసిన సదస్సు



శిక్షణ కార్యక్రమాల సంఖ్య పెంచడమే కాకుండా నాణ్యత, ఫలితాలపై సహకార శిక్షణ దృష్టి సారించాలి: శ్రీ కృష్ణన్‌ పాల్‌ గుర్జర్



సహకార శిక్షణ, సామర్థ్య నిర్మాణ సంస్థల్లో సమన్వయం, నాణ్యత, సందర్భోచితం, విస్తృతి, నిరంతరతను ప్రోత్సహించనున్న ఎన్‌సీటీఎఫ్‌



జాతీయ స్థాయి సదస్సు అనంతరం ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, ఈశాన్య భారత్‌లో అయిదు ప్రాంతీయ స్థాయి సదస్సులు

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2026 6:44PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ “సహకార్ సే సమృద్ధి” దార్శనికతను ముందుకు తీసుకెళ్తూ.. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో సహకార రంగాన్ని బలోపేతం చేయడం, ఆధునికీకరించడం, వృత్తిపరంగా తీర్చిదిద్దడంతో పాటు సహకార వ్యవస్థ అంతటా పటిష్టమైన సంస్థాగత సామర్థ్యాలను నిర్మించేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కృషిలో భాగంగా సహకార సిబ్బంది, భాగస్వామ్య వర్గాలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య నిర్మాణాన్ని బలోపేతం చేయడం కీలకమైన అంశంగా ఉంది.

 

 

 

ఈ దిశగా జాతీయ సహకార శిక్షణ వ్యవస్థ (ఎన్‌సీటీఎఫ్‌) 2026పై జాతీయ స్థాయి అజెండా రూపకల్పన సంప్రదింపుల సమావేశాన్ని “త్రిభువన్” సహకార విశ్వవిద్యాలయం (టీఎస్‌యూ), కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సహకారంతో 2026 సెప్టెంబర్ 24న న్యూఢిల్లీలోని అటల్ అక్షయ్ ఊర్జా భవన్‌లో నిర్వహించింది.

 

 

 

ఈ సంప్రదింపుల సమావేశాన్ని సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణ పాల్ గుర్జర్ ప్రారంభించారు. ఈ సమావేశంలో సహకార మంత్రిత్వ శాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు, జాతీయ స్థాయి సహకార సమాఖ్యలు, రాష్ట్ర సహకార సంఘాలు, సహకార శిక్షణ సంస్థలు, రంగాల అభివృద్ధి సంస్థలు, విశ్వవిద్యాలయాలు, సహకార రంగంలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య నిర్మాణంలో నిమగ్నమైన ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

 

సంప్రదింపుల సమావేశంలో శ్రీ కృష్ణ పాల్ గుర్జర్ ప్రసంగిస్తూ.. సహకార శిక్షణలో కేవలం శిక్షణ కార్యక్రమాల సంఖ్యను పెంచడంపైనే కాకుండా నాణ్యత, ఫలితాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా సంస్థాగత సామర్థ్యాలు బలోపేతం కావడంతో పాటు, వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడాలని, తద్వారా సహకార సంస్థలు, వాటి సభ్యులకు మెరుగైన ఫలితాలు అందేలా చూడాలని ఆయన పేర్కొన్నారు.

 

 

 

ఈ సందర్భంగా “త్రిభువన్” సహకార విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ (డాక్టర్‌) ఎస్‌పీ సింగ్‌ మాట్లాడుతూ.. “సహకార్‌ సే సమృద్ధి” దార్శనికతను సాకారం చేయడంలో జాతీయ సహకార శిక్షణ వ్యవస్థ కీలకమైన సాధనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

 

 

 

సహకార శిక్షణ, సామర్థ్య నిర్మాణంలో నిమగ్నమైన సంస్థల సామర్థ్యాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేశారు. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల విభిన్న అవసరాలకు అనుగుణంగా స్పందిస్తూనే, మరింత సమన్వయం, నాణ్యత, సందర్భోచితం, విస్తృతి, నిరంతరతను నిర్ధారించేలా సమష్టి, భవిష్యత్తు‌ అవసరాలకు సిద్ధంగా ఉండే వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఎన్‌సీటీఎఫ్‌ ప్రక్రియలో భాగంగా నిర్వహించనున్న రెండు జాతీయ స్థాయి సంప్రదింపుల సమావేశాల్లో అజెండా రూపకల్పన సంప్రదింపుల సమావేశం మొదటిది. దీని అనంతరం ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, ఈశాన్య భారత్‌ ప్రాంతాల పరిధిలో అయిదు ప్రాంతీయ స్థాయి సంప్రదింపుల సమావేశాలు నిర్వహించనున్నారు.

****


(రిలీజ్ ఐడి: 2315368) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi