ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఎన్‌ఎల్‌ఎమ్‌సీ మూడు నగరాల్లో నిర్వహించిన పెట్టుబడిదారుల అవగాహన సదస్సులు విజయవంతం
ఆర్‌ఐఎన్‌ఎల్ భూముల ఈ-వేలానికి రంగం సిద్ధం
అక్టోబరులో నిర్వహించనున్న ఈ-వేలానికి ముందు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాల సదస్సులకు పెట్టుబడిదారుల నుంచి అనూహ్య స్పందన
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2026 8:05PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (డీపీఈ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎమ్‌సీ)... మూడు నగరాల్లో పెట్టుబడిదారుల అవగాహన సదస్సులను విజయవంతంగా నిర్వహించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ సంస్థ రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) కి చెందిన 459 భూముల ఈ-వేలానికి ముందు ఈ సదస్సులను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, ఈ నెల 23న విశాఖపట్నంలో, 24న విజయవాడలో, 25న హైదరాబాద్‌లో పెట్టుబడిదారుల సమావేశాలను నిర్వహించారు. అక్టోబరులో జరగనున్న వేలానికి ముందు... సంభావ్య కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఇతర భాగస్వాములకు భూమి పోర్ట్‌ఫోలియో, ఇ-వేలం ప్రక్రియ గురించి సవివరమైన సమాచారాన్ని అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో 150 మందికి పైగా సంభావ్య కొనుగోలుదారులు, ఇతర భాగస్వాములు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వీరికి అదనంగా 50 మందికి పైగా వీడియో అనుసంధానం ద్వారా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వీడియో అనుసంధానం ద్వారా పాల్గొన్న వారిలో ప్రవాస భారతీయులు, విదేశాల్లో నివసిస్తున్న సంభావ్య కొనుగోలుదారులూ ఉన్నారు. ఈ సమావేశంలో... ఆస్తులు, అర్హత, వేలం ప్రక్రియ, లావాదేవీకి సంబంధించిన ఇతర అంశాలపై వారి సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు.
ఆ తరువాత విజయవాడ, హైదరాబాద్‌లలో నిర్వహించిన పెట్టుబడిదారుల సమావేశాలకు... ఆస్తులు, వేలం ప్రక్రియ గురించి సమాచారం కోరుతున్న 50-60 మంది సంభావ్య కొనుగోలుదారులు, వాటాదారులు హాజరయ్యారు.
మూడు నగరాల్లో జరిగిన సమావేశాల్లో భూములు ఉన్న ప్రదేశాలు, వాటి ప్రత్యేకతలు, ప్లాట్ల పరిమాణాలు, వర్తించే నిబంధనలు, షరతుల గురించి నిర్వాహకులు సమగ్రంగా వివరించారు. వీటితో పాటు ఈ-వేలంలో పాల్గొనేందుకు కావలసిన అర్హతలు, రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) వివరాలు, బిడ్డింగ్ ప్రక్రియ, ఈ-వేలానికి సంబంధించిన అన్ని కీలక అంశాలపై కొనుగోలుదారులతో విస్తృతంగా చర్చించారు.
ఈ పెట్టుబడిదారుల సదస్సులలో ఎన్‌ఎల్‌ఎమ్‌సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్, జనరల్ మేనేజర్ శ్రీ సునీల్ సాహు, ఆర్‌ఐఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) శ్రీ బినయ్ ప్రసాద్‌లు పాల్గొని ప్రసంగించారు. భూములు, వేలం ప్రక్రియ, దానికి సంబంధించిన నిబంధనలపై సంభావ్య కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు గల పలు అనుమానాలను వారు నివృత్తి చేశారు. విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో వీడియో అనుసంధానం ద్వారా పాల్గొన్న ప్రవాస భారతీయులు, విదేశాల్లోని కొనుగోలుదారులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు.
విశాఖపట్నంలోని ప్రధాన ప్రాంతాల్లో 459 ప్లాట్లు
ఈ-వేలం ద్వారా విక్రయించనున్న రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ భూముల పోర్ట్‌ఫోలియోలో మొత్తం 93,572.21 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 459 ప్లాట్లు ఉన్నాయి. విశాఖపట్నంలోని మద్దిలపాలెం ప్రాంతంలో హెచ్‌బీ కాలనీ, గాజువాక ప్రాంతంలోని ఆటోనగర్ పరిధిలో గల ప్రధాన ప్రాంతాల్లో ఈ స్థలాలు ఉన్నాయి. ఇందులో ఒక్కో ప్లాట్ పరిమాణం సుమారు 128.94 చదరపు గజాల నుంచి 2,728 చదరపు గజాల వరకు ఉన్నాయి.
ఈ భూముల పోర్ట్‌ఫోలియోలో భాగంగా విశాఖపట్నంలోని మద్దిలపాలెం ప్రాంతంలో గల హెచ్‌బీ కాలనీలో సుమారు 87,949.77 చదరపు గజాల విస్తీర్ణంలో గల 456 నివాస ప్లాట్లను విక్రయించనున్నారు. గాజువాకలోని ఆటోనగర్‌లో మొత్తం 5,622.44 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన మూడు ప్లాట్లను వేలానికి ఉంచారు.
హెచ్‌బీ కాలనీ పరిధిలోని ప్లాట్లు విశాఖపట్నంలోని అన్ని వసతులు కలిగిన నివాస ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే రహదారులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఆటోనగర్ భూములు వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి.
గాజువాక ఆటోనగర్‌లోని బ్లాక్ 2లో 2,728 చదరపు గజాల ఒకే ప్రహరీ గల స్థలంతో పాటు, బ్లాక్ 3లోని మొత్తం 2,894.44 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన రెండు నివాస ప్లాట్లు ఈ పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఉన్నాయి.
ఈ-వేలం ప్రక్రియ కోసం ట్రాన్సాక్షన్ కన్సల్టెంట్‌గా క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (క్యూఐపీఎల్) ను నియమించారు.
రెండు విడతల్లో ఈ-వేలం నిర్వహణ
ఈ-వేలంను రైల్‌టెల్ ఈ-నివిడా ఈ-ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారా రెండు విడతల్లో నిర్వహిస్తారు. మొదటి రోజైన అక్టోబరు 12న ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు 243 ప్లాట్ల కోసం వేలం నిర్వహిస్తారు. మొదటి రోజు కోసం రిజిస్ట్రేషన్, ఈఎండీ సమర్పించడానికి అక్టోబరు 8, సాయంత్రం 5:00 గంటల వరకు గడువు ఉంది.
రెండో రోజైన అక్టోబరు 16న ఉదయం 11:00 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు ఈ-వేలం నిర్వహిస్తారు. ఇందులో 216 ప్లాట్లను వేలానికి ఉంచగా, ఒక్కో వేలానికి ఈఎండీ రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్, ఈఎండీ సమర్పణకు అక్టోబర్ 14న, సాయంత్రం 5:00 గంటల వరకు గడువు ఉంది.
ఆసక్తి గల బిడ్డర్లు అధికారిక ఈ-వేలం పోర్టల్ https://eauction.enivida.com ద్వారా వేలం వివరాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ప్లాట్ల సమాచారం, వర్తించే నిబంధనలు, షరతులను తెలుసుకోవచ్చు.
ఎన్‌ఎల్‌ఎమ్‌సీ సంస్థ సీఈవో శ్రీ రోహన్ చంద్ ఠాకూర్ మాట్లాడుతూ... “ఆర్‌ఐఎన్‌ఎల్ భూముల ఈ-వేలానికి ముందు ఈ మూడు నగరాల్లో పెట్టుబడిదారుల అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించడం కీలక ముందడుగు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో నిర్వహించిన ఈ సమావేశాల ద్వారా కొనుగోలుదారులతో మేం నేరుగా మాట్లాడగలిగాం. భూముల వివరాలు, వేలం ప్రక్రియ, నిబంధనల గురించి వారికి పూర్తి అవగాహన కల్పించాం. ఈ మూడు నగరాల సదస్సులకు పెట్టుబడిదారులతో పాటు వీడియో అనుసంధానం ద్వారా విదేశాల్లోని ప్రవాస భారతయులూ హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈల) ఆధీనంలో ఉన్న భూములను అత్యంత పారదర్శకంగా, నిర్మాణాత్మక విధానంలో వేలం వేయడానికి ఎన్‌ఎల్‌ఎమ్‌సీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది” అని పేర్కొన్నారు.
మూడు నగరాల్లో పెట్టుబడిదారుల అవగాహన సదస్సు ముగిసిన నేపథ్యంలో... కొనుగోలుదారులకు సహాయం చేయడం కోసం వేలం ముగిసే దాకా ప్రాజెక్ట్ సైట్ వద్ద ట్రాన్సాక్షన్ కన్సల్టెంట్ అయిన క్యూఐపీఎల్, ఆర్‌ఐఎన్‌ఎల్ బృందం ప్రతిరోజూ అందుబాటులో ఉంటారు. స్థలాల వివరాలు, ఈ-వేలం ప్రక్రియకు సంబంధించి కొనుగోలుదారులకు వచ్చే ఎలాంటి సందేహాలనైనా వారు అక్కడికక్కడే నివృత్తి చేస్తారు.
ఈ బృందాలు ఆసక్తి గల కొనుగోలుదారులకు ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి. కొనుగోలుదారులకు భూములు, వేలం విధానం, రిజిస్ట్రేషన్ నిబంధనలు, ఈఎండీ, వర్తించే ఇతర షరతుల గురించి ఎలాంటి సందేహాలున్నా వాటిని నివృత్తి చేస్తాయి.
అక్టోబరులో జరగబోయే ఈ-వేలం... ఆర్‌ఐఎన్‌ఎల్‌కు చెందిన నాన్-కోర్ భూముల విక్రయ ప్రక్రియలో తదుపరి కీలక దశను సూచిస్తుంది. ఈ అవగాహన సదస్సు ద్వారా ఈ ప్రాంతంలోని కొనుగోలుదారులు, పెట్టుబడిదారులతో పాటు విదేశాల నుంచి ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్న వారికీ బిడ్డింగ్ తేదీల కంటే ముందే భూముల వివరాలు, వేలం విధానంపై పూర్తి అవగాహన పొందే అవకాశం లభించింది.
ఎన్ఎల్ఎమ్‌సీ గురించి
ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన 'ప్రభుత్వ రంగ సంస్థల విభాగం' పరిపాలనా నియంత్రణలో ఉన్న నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎమ్‌సీ)... భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈలు), ఇతర ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న అదనపు భూమి, ప్రధాన కార్యకలాపాలతో సంబంధం లేని ఆస్తుల నగదీకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి వీలుగా దీనిని ఏర్పాటు చేశారు. అటువంటి ఆస్తులను గుర్తించడం, వాటి నగదీకరణకు తగిన విధానాన్ని రూపొందించడం, ఆ ప్రక్రియను పూర్తి చేయడం కోసం ఎన్ఎల్ఎమ్‌సీ... సంబంధిత సీపీఎస్ఈలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేస్తుంది.
ప్రభుత్వ ఆస్తుల నగదీకరణకు పారదర్శకమైన, నిర్మాణాత్మకమైన విధానాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో... నిర్మాణాత్మక ఆస్తి మదింపు, లావాదేవీల సౌలభ్యం, మార్కెట్ విస్తరణ, సంబంధిత భాగస్వాములతో సమన్వయం ద్వారా ఎన్ఎల్ఎమ్‌సీ ఈ ప్రక్రియకు మద్దతునిస్తుంది.
ఆర్ఐఎన్ఎల్ గురించి
విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన కార్పొరేట్ సంస్థ 'రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్' (ఆర్ఐఎన్ఎల్)... భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక 'నవరత్న' కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నంలోని సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలో ఉక్కు రంగం, పారిశ్రామిక వ్యవస్థ అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది.
కంపెనీ తన కార్యకలాపాలకు సంబంధించి గణనీయమైన భూములు, ఆస్తులను కలిగి ఉంది. ఎన్ఎల్ఎమ్‌సీ సహకారంతో... గుర్తించిన నాన్-కోర్ భూముల నిర్మాణాత్మక నగదీకరణను ఆర్ఐఎన్ఎల్ ఒక పారదర్శకమైన, పోటీతత్వంతో కూడిన ఈ-వేలం ప్రక్రియ ద్వారా సులభతరం చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2315198)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8