జాతీయ మానవ హక్కుల కమిషన్
ముగిసిన ఎన్‌హెచ్ఆర్‌సీ సెప్టెంబర్-2026 ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం
1008 మంది దరఖాస్తుదారుల నుంచి ఎంపికై, ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న విభిన్న విద్యా నేపథ్యాలకు చెందిన 95 మంది విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు
ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించిన ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యులు, జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి
ఇంటర్న్‌లు తమ దైనందిన ప్రవర్తనలో మానవ హక్కుల విలువలను ఆచరించి, పంచుకోవాలని సూచన
మానవ హక్కులను జీవన విధానంగా మార్చుకోవాలని ఇంటర్న్‌లకు పిలుపునిచ్చిన కమిషన్ సభ్యురాలు శ్రీమతి విజయ భారతి సయాని
మానవ హక్కుల పరిరక్షకులుగా మారాలని ఇంటర్న్‌లకు సెక్రటరీ జనరల్ శ్రీ పీయూష్ గోయల్ పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2026 6:22PM by PIB Hyderabad
భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నిర్వహించిన రెండు వారాల ఆన్‌లైన్ స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్ కార్యక్రమం (ఓఎస్‌టీఐ) విజయవంతంగా ముగిసింది. 95 మంది విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్నారు. ఈ ఇంటర్న్‌షిప్ ఈ నెల 14న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన 1008 మంది దరఖాస్తుదారులను పరిశీలించి ఈ ఇంటర్న్‌లను ఎంపిక చేశారు.
ముగింపు సమావేశానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు, జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి అధ్యక్షత వహించారు. ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన ఇంటర్న్‌లను ఆయన అభినందించారు. ఈ రెండు వారాల శిక్షణా కార్యక్రమం కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదనీ, ఇది ఒక విలువైన అభ్యసన అనుభవమని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్న్‌లు తమ ప్రయత్నాలు వృధా కాకుండా చూసుకోవాలని కోరుతూ... "బోధించండి, ఆచరించండి, ప్రదర్శించండి" అనే సూత్రాన్ని అనుసరించాల్సిన ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. మానవ హక్కుల గురించి నేర్చుకోవడం జీవితాంతం కొనసాగాలని, పొందిన జ్ఞానాన్ని ఆచరిస్తూ ఇతరులతోనూ పంచుకోవాలని జస్టిస్ సారంగి ఉద్ఘాటించారు.
ఇంటర్న్‌లు తమ దైనందిన ప్రవర్తనలో మానవ హక్కుల విలువలను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. వృద్ధులు, వికలాంగులు సహా ఇతరుల పట్ల కరుణతో ఉండాలని, వారి అవసరాలను తగిన విధంగా పరిగణించాలని జస్టిస్ సారంగి కోరారు. యువకులుగా దేశ, సమాజ అభివృద్ధిపై ఇంటర్న్‌లు గొప్ప ఆశలను కలిగి ఉన్నారని ఆయన అన్నారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలు శ్రీమతి విజయ భారతి సయాని ఇంటర్న్‌లను ఉద్దేశించి ప్రసంగిస్తూ... ఇంటర్న్‌షిప్ ముగింపు అంతం కాదనీ, ఒక కొత్త బాధ్యతకు ఆరంభమని అన్నారు. మానవ హక్కులు అంటే పరస్పర గౌరవం, న్యాయం, కరుణ, బాధ్యత అని పేర్కొన్నారు. వాటిని మన జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు. మానవ హక్కులు, రాజ్యాంగం, దేశం పట్ల నిబద్ధతను ముందుకు తీసుకువెళ్లాలని శ్రీమతి విజయ భారతి కోరారు.
మానవ హక్కులు, దేశభక్తి పరస్పర పూరకాలని వ్యాఖ్యానిస్తూ... రాజ్యాంగాన్ని గౌరవించాలని, మానవ గౌరవాన్ని కాపాడాలని, బలహీనులకు సేవ చేయాలని, న్యాయం కోసం నిలబడాలని శ్రీమతి సయాని ఇంటర్న్‌లకు సూచించారు. 'వసుధైవ కుటుంబం', 'సర్వే భవంతు సుఖినః' సూక్తులను ఉటంకిస్తూ... తమ తమ సమాజాల్లో మానవ హక్కుల రాయబారులుగా మారాలని ఆమె వారికి పిలుపునిచ్చారు. మరింత బలమైన, న్యాయమైన, మానవతాయుతమైన భారత్ కోసం తోడ్పాటునందించడంలో "జ్ఞానం, కరుణ, సేవ" మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయని శ్రీమతి సయాని ప్రముఖంగా ప్రస్తావించారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ సెక్రటరీ జనరల్ శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఇంటర్న్‌లను ప్రత్యేకంగా అభినందించారు. దైనందిన జీవితంలో మానవ గౌరవం పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. విద్యాపరమైన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడే అది అర్థవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. జట్టుగా కృషి చేయడం, సంభాషణ నైపుణ్యాల విలువను ప్రస్తావిస్తూ... బృంద కార్యకలాపాలు జట్టు స్ఫూర్తిని, సహకార నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. సమాజంలో మానవ హక్కుల ఆచరణ గురించి మరింత అవగాహన కల్పించడం ద్వారా మానవ హక్కులకు మార్గదర్శకులుగా మారాలని ఆయన ఇంటర్న్‌లను కోరారు.
అంతకుముందు, ఎన్‌హెచ్‌ఆర్‌సీ సంయుక్త కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమ అవలోకనాన్ని సమర్పించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు, సీనియర్ అధికారులు, ప్రముఖ నిపుణులు, విద్యావేత్తలు, కోర్ గ్రూప్ సభ్యులు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో ఇంటర్న్‌లు సంభాషించేందుకు ఈ కార్యక్రమం ద్వారా గొప్ప అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మానవ హక్కులపై ఇంటర్న్‌ల అవగాహనను సుసంపన్నం చేసిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పుస్తక సమీక్ష, బృంద పరిశోధన ప్రాజెక్ట్ సమర్పణ, ఉపన్యాస పోటీలు సహా పలు పోటీల విజేతలను శ్రీ సమీర్ ప్రకటించారు. శ్రీమతి మోనికా జూన్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
****
(రిలీజ్ ఐడి: 2315133)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10