సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
‘ప్రధానమంత్రి జ్ఞాపికల ఇ-వేలం 2026’లో ఒడిషా సుసంపన్న సాంస్కృతిక వారసత్వ వైభవం
జగన్నాథ స్వామి ప్రతిరూపాల నుంచి పట్టచిత్ర.. తారకాసి.. సంబల్‌పురి చిత్రకళల దాకా రాష్ట్ర సాంస్కృతిక విశిష్ట కళారూపాలతో కనువిందు
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2026 4:34PM by PIB Hyderabad
ప్రధానమంత్రి జ్ఞాపికల ఇ-వేలం 2026 ఈసారి ఒడిషా వైవిధ్యభరిత సాంస్కృతిక వారసత్వం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో భక్తి, హస్తకళలు, చిత్రలేఖనం, వస్త్రాలు, సాహిత్యం తదితర రాష్ట్ర సంప్రదాయాలను చాటిచెప్పే కళాఖండాలున్నాయి. ఈ వేలం వస్తువుల జాబితాలో జగన్నాథ, బలభద్ర, సుభద్రా దేవి ప్రతీకలైన రకరకాల కళాఖండాలు సహా ప్రాంతీయ దేవతలు, సంప్రదాయ కళారూపాలు, వస్త్రాలు, పండుగలు, ప్రముఖ సాంస్కృతిక మహనీయుల ప్రతిరూపాలు కూడా ఉన్నాయి.
ఈ కళాఖండాల్లో ‘జగన్నాథ పరివారం రథంపై ఊరేగే’ చిత్రం అత్యంత ఆకర్షణీయమైనదిగా నిలిచింది. ఈ చిత్రంలో జగన్నాథుడు, బలభద్రుదు, సుభద్రా దేవి అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన రథంపై ఆసీనులై ఉంటారు. ఈ రథాన్ని నాలుగు గుర్రాలు లాగుతున్నట్లుగా చిత్రించారు. ఇది జగన్నాథ రథయాత్ర సాంస్కృతిక-ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని చాటే చిత్రం.
వీటిలో పూరీ రథయాత్రను వర్ణించే ఒక పట్టచిత్ర పెయింటింగ్ కూడా ఉంది. ఇది సంగీత-నృత్యోత్సవాల నడుమ రథంలో ఉన్న దేవతలను ప్రతిబింబిస్తుంది. ఒడిషా భక్తి-కళా సంప్రదాయాలు ముడిపడిన తీరును ఈ చిత్రంలోని సంక్లిష్ట అంశాలు, ఉజ్వల వర్ణాలు అద్భుతంగా కళ్లకు కడతాయి.
వేలం వేసే వస్తువుల జాబితాలో రాష్ట్రానికి సంబంధించిన అనేక సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులు కూడా ఉన్నాయి. సున్నితమైన వెండి తీగలతో కూడిన సంక్లిష్ట కటక్ వెండి ఫిలిగ్రీ లేదా తారకాసి, సంబల్పరి వస్త్రాలు, ఇకాట్ వంటివి ఉన్నాయి.
సంబల్పూరి ఇకాట్‌తో రూపొందించిన సమాలేశ్వరి మాత కళాఖండం భక్తికి చిహ్నంగా నిలుస్తుంది. ఈ కళాకృతిని పూర్తి సంప్రదాయ బంధా పద్ధతిలో చేతితో నేశారు.
జగన్నాథుని ఇతివృత్త కళాఖండాలతో పాటు ఒడిషా రాష్ట్ర ఉజ్వల పండుగల సంప్రదాయాలను కూడా ఇ-వేలం ప్రతిబింబించింది. ఫ్రేమ్ కట్టిన ఒక ప్రింట్ పంచూ డోలా మేళాను ప్రదర్శిస్తుంది. ఇందులో రంగురంగుల చిన్న ఆలయ రూపాలను మోసుకెళ్లే భక్తులు కనిపిస్తారు. మరో ఫొటో చిలికా సరస్సు వద్ద వేడుకలను వివరిస్తుంది. ఇందులో వార్షిక సమావేశం కోసం గ్రామ దేవతలను తీసుకెళ్లే పడవలు కనిపిస్తాయి.
మొత్తం 62 జ్ఞాపికలు జగన్నాథ పూజ, రథయాత్ర వంటి శాశ్వత సంప్రదాయాలు సహా పట్టచిత్ర, తారకాసి, సంబల్పూరి ఇకాట్, ప్రాంతీయ పండుగలు, సాహితీ వారసత్వం దాకా ఒడిషా విస్తృత కథనాన్ని కనులముందు నిలుపుతాయి. కేవలం ఒకే కళా సంప్రదాయం కాకుండా రాష్ట్ర సజీవ సాంస్కృతిక వారసత్వాన్ని చాటే దిన బహుళ వ్యక్తీకరణల ప్రతీకలను ఈ జాబితా మన ముందుంచుతుంది.
ప్రస్తుతం 8వ సారి నిర్వహిస్తున్న ‘ప్రధానమంత్రి జ్ఞాపికల ఇ-వేలం’లో అక్టోబరు 2 వరకూ పాల్గొనే అవకాశం ఉంటుంది. వేలం విధానం, తేదీలు, ఇతర వివరాలు, వస్తువుల జాబితా కోసం అధికారిక పోర్టల్ pmmementos.gov.in ను సందర్శించవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2315117)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12