వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత్ భాగస్వామ్యం విస్తరిస్తోందనీ, అంతర్జాతీయ విలువ వ్యవస్థతో దేశ అనుసంధానం మరింత బలపడుతోందన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్


వచ్చే అయిదేళ్లలో భారతదేశ సెమీకండక్టర్ల డిమాండ్ వార్షికంగా 150 బిలియన్ డాలర్లను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించిన శ్రీ గోయల్

120కి పైగా యూనికార్న్‌లతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా ఆవిర్భించిన భారత్: శ్రీ గోయల్

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 9:17PM by PIB Hyderabad

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో భారత్ భాగస్వామ్యం విస్తరిస్తోందనీ,  ప్రపంచ విలువ, సరఫరా వ్యవస్థల్లో దేశ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన 13వ పీఏఎఫ్ఐ వార్షిక సదస్సు-2026 లీడర్‌షిప్ డైలాగ్‌లో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందనే అంచనాల నేపథ్యంలో ఆ హోదాలోనే వివిధ దేశాలతో వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య చర్చలు చేపడుతోందని ఆయన తెలియజేశారు..

ప్రస్తుతం 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ దేశాలతో భారత్ చర్చలు చేపడుతోందని శ్రీ గోయల్ తెలిపారు. కొనుగోలు శక్తి సమానత్వం ప్రాతిపదికన సుమారు 20 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం నిలిచిందని వివరించారు. భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఈ రెండు ప్రమాణాల మధ్య ఉన్న అంతరం తగ్గుతుందని ఆయన చెప్పారు.

మారుతున్న దేశ ఆర్థిక స్థితిగతులు, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానాన్ని మరింత పటిష్ఠం చేయాలనే లక్ష్యాన్నివాణిజ్య చర్చల్లో భారత్ అనుసరిస్తున్న విధానం ప్రతిబింబిస్తోందని మంత్రి తెలియజేశారు. వస్తువులు, సేవలు, పర్యాటకులు, విద్యా సంస్థలు, క్రీడలకు నిరాటంకంగా రాకపోకలను మరింత సులభతరం చేయడానికి విస్తృత ఆర్థిక భాగస్వామ్యాలకు ఉన్న సామర్థ్యాన్ని ఆయన వివరించారు.

కెనడా, చిలీ, పెరూ, సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ (ఎస్ఏసీయూ), మెక్సికో, మాల్దీవులు, యురేషియా, మధ్య ఆసియా, రష్యా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ), ఇజ్రాయెల్‌ దేశాలతో భాగస్వామ్యాలతో సహా ఆయా దేశాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని శ్రీ గోయల్ అన్నారు. ప్రపంచ విలువ ఆధారిత, సరఫరా వ్యవస్థల్లో భారతదేశానికి ఉన్న భాగస్వామ్య అవకాశాలను విస్తరించడం, వస్తు, సేవల రవాణాను సులభతరం చేయడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని తెలియజేశారు.

వచ్చే అయిదేళ్లలో భారతదేశ సెమీకండక్టర్ వినియోగం వార్షికంగా 150 బిలియన్ డాలర్లను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లు, ఏజెంటిక్ మోడళ్లతో సహా ఏఐ వ్యవస్థల్లో సామర్థ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్నిఆయన వివరించారు.

భారతదేశ అంకురసంస్థల రంగంలో సాధిస్తున్న వృద్ధి గురించి కూడా మంత్రి వివరించారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దేశంలో సుమారుగా 400-500 అంకుర సంస్థలు ఉండేవనీ, అప్పటి నుంచి 120కి పైగా యూనికార్న్‌లతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకురసంస్థల వ్యవస్థగా నిలిచిందని మంత్రి వెల్లడించారు.

డీప్ టెక్ రంగంలో ఆవిష్కరణలనూ, భారతీయ అంకుర సంస్థలనూ ప్రోత్సహించడంపై ప్రస్తుతం దృష్టి సారించామని శ్రీ గోయల్ చెప్పారు. ప్రైవేటు రంగం ద్వారా అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన మూడో దేశంగా భారత్ ఆవిర్భావం గురించి ప్రస్తావించారు.

అంతర్జాతీయ పరిణామాలు, అవకాశాల గురించి భారతీయ యువతకు అవగాహన ఉందనీ, తమ భవిష్యత్తుకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం యువతకు ఉందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

***


(రిలీజ్ ఐడి: 2314742) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Gujarati