రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

క్వాంటమ్ అప్లికేషన్ల కోసం 20 ఎంకే డైల్యూషన్ రిఫ్రిజిరేటర్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడానికి 'టీడీఎఫ్' పథకం కింద ఒక అంకురంతో తన మొట్టమొదటి అధిక విలువైన డీప్ టెక్ ప్రాజెక్ట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న డీఆర్‌డీఓ

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 7:15PM by PIB Hyderabad

టీడీఎఫ్ (టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్) పథకం కింద క్వాంటమ్ అప్లికేషన్ల కోసం 20 ఎంకే డైల్యూషన్ రిఫ్రిజిరేటర్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు రక్షణ పరిశోధన- అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) 'జీరో ఎంకే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థతో (అంకుర సంస్థ) మొదటి అధిక విలువైన డీప్ టెక్ ప్రాజెక్ట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన జీరో ఎంకే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, టీడీఎఫ్ డైరెక్టర్‌ ఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. డీప్-టెక్, అత్యాధునిక ప్రాజెక్ట్‌ల కోసం రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ గతంలో ఆమోదించిన రూ. 500 కోట్ల కార్పస్ నిధి కింద కుదిరిన మొట్టమొదటి అధిక విలువైన ఒప్పందం ఇది.

మిల్లికెల్విన్ పరిధిలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలను సాధించగల ప్రత్యేక క్రయోజనిక్ వ్యవస్థలే డైల్యూషన్ రిఫ్రిజిరేటర్లు. క్వాంటమ్ కంప్యూటింగ్ వేదికలు, సంబంధిత క్వాంటమ్‌ సాంకేతికతల నిర్వహణ, పరీక్షల కోసం ఇటువంటి అతి తక్కువ ఉష్ణోగ్రత వాతావరణం ఎంతో కీలకం.

20 ఎంకే స్థాయి డైల్యూషన్ రిఫ్రిజిరేటర్‌ స్వదేశీ అభివృద్ధి నేషనల్ క్వాంటమ్‌ మిషన్‌కు అనుగుణంగా ఉంది. ఇది క్వాంటమ్ సాంకేతికత, అధునాతన క్రయోజనిక్ వ్యవస్థలు, వ్యూహాత్మక సాంకేతికతలలో భారత్ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు ఆత్మనిర్భరత కలిగిన క్వాంటమ్‌కు సిద్ధంగా ఉన్న వ్యవస్థకు దోహదపడుతుంది. ఇది దిగుమతి చేసుకున్న క్రయోజనిక్ మౌలిక సదుపాయాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, దేశీయ క్వాంటమ్ సాంకేతికత వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది.

ఈ కీలకమైన ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న డీఆర్‌డీఓ, పరిశ్రమ వర్గాలు, ఇతర భాగస్వాములందరినీ రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. వర్ధమాన సాంకేతిక రంగాల్లో భవిష్యత్తులో జరిగే డీఆర్‌డీఓ-పరిశ్రమ సహకారాలకు ఈ భాగస్వామ్యం ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దీనితో సంబంధం ఉన్న అందరినీ రక్షణ కార్యదర్శి, రక్షణ అర్‌-డీ శాఖ కార్యదర్శి, డీఆర్‌డీఓ ఛైర్మన్ శ్రీ రాజేష్ కుమార్ సింగ్ అభినందించారు. ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధించడంలో వారు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఎంసీసీ (మైక్రో ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ కంప్యూటేషనల్ సిస్టమ్ అండ్ సైబర్ సెక్యూరిటీ) డైరెక్టర్ జనరల్, టీఎం (టెక్నాలజీ మేనేజ్‌మెంట్) డైరెక్టర్ జనరల్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ (ఎస్ఎస్‌పీఎల్) డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్ఎస్‌పీఎల్ డైరెక్టర్, ఆయన బృందం ఈ ప్రాజెక్ట్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశం చేస్తూ మద్దతునందిస్తున్నారు.

 

****


(రిలీజ్ ఐడి: 2314735) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी