సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘పీఎం మెమెంటోస్‌ ఈ వేలం-2026’లో వేలానికి కేరళ సాంస్కృతిక జ్ఞాపికలు


సాంప్రదాయ హస్తకళలు, ప్రదర్శన కళలు, నౌకా వాణిజ్య సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే విశిష్ట సేకరణ

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 6:13PM by PIB Hyderabad

 

కేరళకు చెందిన కళలు, హస్తకళలు, ప్రదర్శన సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే 32 విభిన్న స్మారక చిహ్నాలు పీఎం మెమెంటోస్ ఈ వేలం 2026లో వేలానికి అందుబాటులో ఉంచారు. ఈ సేకరణలో సంప్రదాయ నెట్టూర్‌ పెట్టి, చుండన్‌ వల్లం సూక్ష్మ నమూనా, కథకళి, తెయ్యం కళాఖండాలు, కేరళ కుడ్యచిత్ర కళ, చారిత్రక బేపూర్‌ ఉరుకు చెందిన హస్తకళతో రూపొందించిన నమూనా వంటి ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయి.

 

ఆరెంజ్‌ నెట్టూర్‌ పెట్టి- కేరళ సంప్రదాయ ఆభరణాల పెట్టె. కుడ్య చిత్రకళ, ఇత్తడి అలంకరణలతో కూడిన అభరణాల పెట్టె. నెట్టూర్‌ పెట్టిని పూర్వకాలంలో సంపన్న కుటుంబాల్లో ఆభరణాలు, పవిత్ర వస్తువులను భద్రపరచడానికి ఉపయోగించేవారు. ఈ రూపంలోని పెట్టెలు కేరళకు చెందిన సంప్రదాయ హస్తకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి.

 

కేరళ నౌకా వాణిజ్య సంప్రదాయాలకు ప్రతీకగా చుండన్‌ వల్లం కూడా ఈ సేకరణలో ఉంది. ఇది కేరళ బ్యాక్‌వాటర్స్‌తో పాటు ఓనం పండుగ సందర్భంగా నిర్వహించే పడవ పోటీలతో అనుబంధం కలిగిన సంప్రదాయ సర్పాకార పడవ. మరో ప్రత్యేకమైన జ్ఞాపిక సూక్ష్మ బేపూర్‌ ఉరు నమూనా. ఇది సంప్రదాయ చెక్కతో రూపొందించే సముద్ర నౌక. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కాలికట్‌ జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (ఎన్‌ఎస్‌టీఐ) ఈ నమూనాను హస్తకళా పద్ధతిలో తయారు చేశారు. బేపూర్‌ ప్రాంతానికి చెందిన నిపుణులైన వడ్రంగులు సంప్రదాయంగా నిర్మించే చెక్క నౌకలను ఈ నమూనా ప్రతిబింబిస్తుంది.

 

ఈ సేకరణలో కేరళ ప్రదర్శన కళలకు సంబంధించిన పలు కళాఖండాలు ఉన్నాయి. కథకళి నర్తకి ప్రదర్శన బొమ్మ, కథకళి కళాకారుడి చిత్రపటం. ఈ శాస్త్రీయ నృత్య నాటక కళారూపంలోని ప్రత్యేక అంశాలైన విస్తృత అలంకరణతో కూడిన మేకప్‌, వస్త్రధారణ, ఆభరణాలు, విశిష్టమైన కిరీటం వంటి అంశాలను స్పష్టంగా ప్రదర్శిస్తాయి.

 

మరో విశిష్టమైన కళాఖండం భైరవన్‌ తెయ్యం పూజా కళా శిల్పం. ఉత్తర కేరళలోని ఆచారబద్ధమైన నృత్య-కళా సంప్రదాయానికి చెందిన భైరవన్‌ తెయ్యాన్ని ఈ శిల్పం ప్రతిబింబిస్తుంది. ఈ రూపం పరమశివుడి ప్రతిరూపంగా ప్రసిద్ధి చెందినదిగా సేకరణలో పేర్కొన్నారు. ఇందులో భైరవన్‌ తెయ్యానికి ప్రత్యేకమైన కిరీటం, ముఖ అలంకరణ, కవచాలు, సంప్రదాయ వస్త్రధారణ వంటి అంశాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి

 

ఇక కేరళ కూడ్య చిత్రకళా సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ గురువాయూర్ దేవస్థానంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మురల్ పెయింటింగ్ కళాకారులు గీసిన రాధ, కృష్ణుడు,  గోపికలను ఫ్రేమ్ చేసిన పెయింటింగ్ ఈ సేకరణలో ఉంది. మర్రిచెట్టు కింద శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుండగా, ఆయన పక్కన రాధ, ఒక గోపిక ఉన్న దృశ్యాన్ని ఈ చిత్రంలో చూపించారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన సిమెంట్‌ షీట్‌పై సంప్రదాయ అయిదు రంగుల పంచవర్ణ పద్ధతిని ఉపయోగించి ఈ కళాఖండాన్ని రూపొందించారు.

 

ఈ సేకరణలో కేరళ ఆధ్యాత్మిక, సామాజిక వారసత్వానికి సంబంధించిన కళాఖండాలు కూడా ఉన్నాయి. వీటిలో ఆది శంకరాచార్యుల భక్తిపూర్వక చిత్రపటం, శివగిరి మఠం స్మారక చెక్క దేవాలయాన్ని ప్రతిబింబించే చెక్కిన చెక్క పలక, పోయకైల్‌కయిల్‌ శ్రీ కుమార గురుదేవన్‌ ఫోటో. శ్రీ విద్యాధిరాజ చట్టంబి స్వామికల్‌ ఫోటో వంటివి ఉన్నాయి.

 

వైకోమ్‌ సత్యాగ్రహం 100 సంవత్సరాల స్మారక కళాఖండం కూడా ఈ సేకరణలో భాగంగా ఉంది. ఇతర కళాఖండాల్లో సంప్రదాయ నెట్టిపట్టం, కేరళకు చెందిన ఇత్తడి వాస్తు దీపం, శ్రీ గురువాయూరప్పన్‌ స్వామి చెక్కిన చెక్క విగ్రహం, సంప్రదాయ శంఖం స్మారక చిహ్నం, తదితరాలు ఉన్నాయి.

 

2026 అక్టోబర్‌ 2 వరకు కొనసాగనున్న పీఎం మెమెంటోస్ ఈ వేలం 2026 8వ ఎడిషన్‌.. కేరళ గొప్ప సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలను ప్రతిబింబించే స్మారక చిహ్నాలను ఒకచోట చేర్చింది. వేలం తేదీలు, పాల్గొనే వివరాలు, పూర్తి జాబితా కోసం అధికారిక పీఎం మెమెంటోస్ ఈ వేలం వేదిక: pmmementos.gov.inను సందర్శించండి.

 

***


(రిలీజ్ ఐడి: 2314724) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी