జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్, నెదర్లాండ్స్ మధ్య జల రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్న ఐఐడబ్ల్యూడబ్ల్యూ- 2026


కల్పసర్ ప్రాజెక్ట్‌ విషయంలో సాంకేతిక సహకారం, సామర్థ్య పెంపుదలకు సంబంధించిన కుదిరిన రెండు అవగాహన ఒప్పందాలు

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 6:04PM by PIB Hyderabad

ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 9వ భారతదేశ అంతర్జాతీయ జల వారోత్సవాలు-2026 (ఐఐడబ్ల్యూడబ్ల్యూ) సందర్భంగా.. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ సీ.ఆర్. పాటిల్, నెదర్లాండ్స్ మౌలిక సదుపాయాలు- జల నిర్వహణ శాఖ సహాయ మంత్రి(వైస్ మినిస్టర్) శ్రీ జాప్ స్లూట్‌మేకర్ ఆధ్వర్యంలో జల రంగ వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సమావేశం జరిగింది.

కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్ భూషణ్ చౌదరి, గుజరాత్ ప్రభుత్వ జల వనరులు- నీటి సరఫరా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ఈశ్వర్‌సింగ్ పటేల్, కేంద్ర తాగునీరు- పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి శ్రీ అశోక్ కేకే. మీనా, జల వనరులు- నదీ అభివృద్ధి- గంగా పునరుజ్జీవన శాఖ కార్యదర్శి శ్రీమతి అర్చన వర్మ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్ శ్రీ అనుపమ్ ప్రసాద్, నెదర్లాండ్స్ రాయబారి మారిసా గెరార్డ్స్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

గుజరాత్‌లోని కల్పసర్ ప్రాజెక్ట్ విషయంలో సాంకేతిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జల రంగంలో భారత-నెదర్లాండ్స్ సహకారాన్ని సమీక్షించడానికి, మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. ఈ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), గుజరాత్ ప్రభుత్వ కల్పసర్ విభాగం.. డచ్ విజ్ఞాన సంస్థలైన డెల్టాసెస్, టియు డెల్ఫ్‌ట్ మధ్య కల్పసర్ ప్రాజెక్ట్ విషయంలో సహకారాన్ని పెంచేందుకు రెండు త్రైపాక్షిక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదిరాయి.

ఈ సందర్భంగా కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ సీ.ఆర్. పాటిల్ మాట్లాడుతూ.. కల్పసర్ ప్రాజెక్ట్ నిర్మాణం, సామర్థ్య పెంపు విషయంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి డెల్టాసెస్, టియు డెల్ఫ్‌ట్ సంస్థలకు చెందిన ఆయా భారతీయ భాగస్వాములతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆనందదాయకమని అన్నారు. ప్రాజెక్ట్‌ను విజయవంతంగా చేపట్టేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి ఈ ఒప్పందాలు బలమైన ప్రాతిపదికను అందిస్తాయన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మే నెలలో చేపట్టిన నెదర్లాండ్స్‌ పర్యటన సందర్భంగా కల్పసర్ ప్రాజెక్ట్‌పై చర్చ జరిగిందని.. ఆ తర్వాత 2026 మే 16న సాంకేతిక సహకారం కోసం ఒక ఉద్దేశ లేఖపై (లెటర్ ఆఫ్ ఇంటెంట్) సంతకం చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. నర్మదా నది నుంచి వచ్చే నీటితో పాటు సబర్మతి, మహీ, ధధర్ నదుల ప్రవాహాన్ని ఉపయోగించి మంచినీటి రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.

2026 జూలైలో భారత ప్రతినిధి బృందం నెదర్లాండ్స్‌లో పర్యటించిన సమయంలో వరద రక్షణ, తీర ప్రాంత మౌలిక సదుపాయాలు, హైడ్రాలిక్ మోడలింగ్, స్లూయిస్- పంపింగ్ వ్యవస్థలు, డైక్ సాంకేతికతలు, పర్యావరణ పరిష్కారాల రంగాల్లో విలువైన అంశాలను తెలుసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, జల నిర్వహణ, తీర ప్రాంత మౌలిక సదుపాయాల పరంగా నెదర్లాండ్స్‌లోని ఆఫ్స్లూయిట్‌డైక్ ప్రాజెక్ట్‌తో ఎంతో ఉపయోగకరమైన పోలికలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

నెదర్లాండ్స్ మౌలిక సదుపాయాలు, జల నిర్వహణ శాఖ సహాయ మంత్రి శ్రీ జాప్ స్లూట్‌మేకర్ మాట్లాడుతూ..  కల్పసర్ ప్రాజెక్ట్‌పై సాంకేతిక సహకారానికి సంబంధించిన ఉద్దేశ లేఖకు ఉన్న ప్రాముఖ్యతను, భారతదేశం-నెదర్లాండ్స్ సహకారానికి అది కల్పిస్తున్న అవకాశాలను ప్రధానంగా పేర్కొన్నారు. ఆఫ్స్లూయిట్‌డైక్ గురించి ప్రస్తావిస్తూ దాదాపు 100 సంవత్సరాల నాటి ఆ నిర్మాణాన్ని ప్రస్తుతం పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. గత శతాబ్దంలో కూడగట్టుకున్న అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి నెదర్లాండ్స్‌కు ఇది ఒక మంచి అవకాశాన్ని ఇస్తోందని అన్నారు. ఈ అవగాహన ఒప్పందాల ద్వారా డెల్టాసెస్, డెల్ఫ్‌ట్ వంటి డచ్ సంస్థలు తమ నైపుణ్యాన్ని అందిస్తాయని.. జల రంగంలో మరింత సహకారానికి ఇవి పునాది వేస్తాయని ఆయన తెలిపారు. పర్యావరణం, చేపల వలస వంటి అంశాల్లో నేర్చుకున్న పాఠాలను పంచుకోవటానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా ఆయన ప్రముఖంగా చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణం కోసం డచ్ నైపుణ్యం, అధునాతన ఇంజనీరింగ్ పద్ధతులను పంచుకోవడం ద్వారా ఈ అవగాహన ఒప్పందాలు సాంకేతిక సహకారాన్ని సులభతరం చేస్తాయి. డెల్టాసెస్‌తో కుదిరిన ఈ సహకారంలో సాంకేతిక సమీక్ష, హైడ్రాలిక్- హైడ్రోలాజికల్ మోడలింగ్, తీర ప్రాంత- నిర్మాణ ఇంజనీరింగ్, వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యం, సామర్థ్య పెంపుదల, పరిజ్ఞాన బదిలీ, డిజిటల్ అనువర్తనాలు వంటి అంశాలు అంతర్భాగంగా ఉంటాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2314720) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी