సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చెత్త ఏరుకోవడం నుంచి మెరుగైన ఆర్థిక భద్రత దాకా


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చేవూరి ఆంజనేయులు విజయ గాథ

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 6:15PM by PIB Hyderabad

నమస్తే పథకంలోని 'స్వచ్ఛతా ఉద్యమి యోజన' విభాగం కింద అందిన సహాయం... ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన వ్యర్థాలు సేకరించే కార్మికుడైన శ్రీ చేవూరి ఆంజనేయులుకు అదనపు ఆదాయాన్ని ఆర్జించడంలోనూ, తన కుటుంబ ఆర్థిక భద్రతను మెరుగుపరచుకోవడంలోనూ ఎంతగానో తోడ్పడింది. ఆయన తన భార్య, ఇద్దరు పిల్లల పోషణ కోసం ఏడేళ్లపాటు శ్రమించారు.

షెడ్యూల్డ్ తెగకు చెందిన 25 ఏళ్ల శ్రీ ఆంజనేయులు చిన్న వయసులోనే తన తల్లిదండ్రులతో కలిసి చెత్త ఏరే పనికి వెళ్లడం ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన బడికి వెళ్లలేకపోయారు. ఆయన సామాజిక వివక్షను ఎదుర్కోవడంతో పాటు... కనీస సదుపాయాలు, సేవల లభ్యత పరిమితంగా ఉన్న పరిస్థితుల్లో జీవించారు.

ఈ సహాయం అందకముందు, వ్యర్థాలను ఏరుకోవడం ద్వారా వచ్చే ఆదాయంతో ఇంటి ఖర్చులను భరించడం, తన పిల్లల భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడం అతనికి కష్టంగా ఉండేది. తన కుటుంబ జీవన పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని, తన పిల్లలకు మంచి విద్యను అందించాలని ఆయన ఆశించేవారు.

'నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' ద్వారా 'ఎస్‌యూవై' పథకం కింద శ్రీ ఆంజనేయులు, మరో ముగ్గురు సభ్యులు 19 జూన్ 2023న ఒక సమూహ ప్రాజెక్టు కోసం ఆర్థిక సహాయాన్ని పొందారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 35 లక్షలు కాగా... ఇందులో రూ. 17.5 లక్షల రుణం, రూ. 17.5 లక్షల ముందస్తు మూలధన రాయితీ ఉన్నాయి.

ఈ సహాయం అతని జీవనోపాధి బలోపేతానికి ఎంతగానో దోహదపడింది. ఇప్పుడు ఈ పథకం ద్వారా ఆయన నెలకు సుమారు రూ. 10,000 అదనంగా సంపాదిస్తున్నారు. దీనివల్ల ఆ కుటుంబం తమ ఖర్చులను మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకోగలుగుతోంది.

ఆయన పిల్లలు ఇద్దరూ ఆంగ్ల మాధ్యమ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఈ అదనపు ఆదాయం వారి చదువుకు సహాయపడటమే కాకుండా, తాను ఎంతోకాలంగా అందించాలని ఆశించిన మెరుగైన అవకాశాల దిశగా కృషి చేయడానికీ తోడ్పడింది.

ఈ మద్దతు శ్రీ ఆంజనేయులు కుటుంబానికి మరింత ఆర్థిక స్థిరత్వాన్ని, సురక్షితమైన భవిష్యత్తును అందించింది. జీవనోపాధి సహాయం అందుబాటులో ఉండటం వల్ల చెత్త ఏరుకునేవారు తమ ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి, తమ ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఎలా వీలవుతుందో ఆయన అనుభవం తెలియజేస్తుంది.

 

***

 

(రిలీజ్ ఐడి: 2314710) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी