సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రికి వచ్చిన జ్ఞాపికల ఈ - వేలం : 65 జ్ఞాపికల్లో ప్రతిబింబించిన బిహార్‌ వారసత్వం, జానపద సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవం


మధుబని, మంజూషా కళారూపాలు, సిక్కీ హస్తకళలు, చారిత్రక ప్రముఖులు, స్మారక కళాఖండాల సమాహారం

నాడు పోస్టు చేయడమైనది: 23 SEP 2026 7:47PM by PIB Hyderabad

వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రికి వచ్చిన జ్ఞాపికల ఈ - వేలం (2026)లో ప్రదర్శించిన 65 జ్ఞాపికల సేకరణలో బిహార్‌ సాంస్కృతిక వైభవం ప్రతిబింబించింది. జానపద కళలు, హస్తకళలు, ఆధ్యాత్మికత, చరిత్ర, వారసత్వానికి సంబంధించిన రాష్ట్ర వైవిధ్యభరిత సంప్రదాయాలను ఈ సేకరణలో పొందుపరిచారు. సున్నితమైన కళాత్మకతతో రూపొందించిన మధుబని చిత్రాలు, సిక్కీ హస్తకళలు మొదలుకొని ప్రసిద్ధ ఆలయాలు, చారిత్రక ప్రముఖులు, జాతీయ చిహ్నాల ప్రతిరూపాల వరకు ఈ సేకరణ విస్తరించింది.

ఒకే ఒక్క సంప్రదాయానికి ప్రతిరూపంగా కాకుండా, బిహార్‌తో అనుబంధం ఉన్న అనేక సాంస్కృతిక ప్రత్యేకతలను ఈ సేకరణ పరిచయం చేస్తుంది.

మధుబని, మిథిలా సంప్రదాయాలు

 

మిథిలా/మధుబని చిత్రకళా సంప్రదాయానికి ఈ సేకరణలో విశేష స్థానం ఉంది. ఇందులో రామ్ సీతా వివాహం, రామ్ దర్బార్, ఛఠ్ పూజ, దశ మహావిద్యలు, పవిత్ర యంత్రాల చిత్రణలతో పాటు, రామాయణాన్ని ప్రతిబింబించే కచ్ని శైలిలో రూపొందించిన మధుబని కళాఖండం కూడా ఉన్నాయి.

మిథిలా సంప్రదాయంలోని తలపాగాలు కూడా ఈ సేకరణలో అనేకం ఉన్నాయి. చేపలు, తామర పువ్వులు వంటి సంప్రదాయ ఆకృతులతో వీటిని చేతితో చిత్రించారు. మిథిలా ప్రాంతానికి ప్రత్యేకమైన తలపాగాగా పాగ్‌ ప్రసిద్ధి చెందింది. దీనిని విభిన్న ఆకృతులు, డిజైన్లలో ఈ సేకరణలో ప్రదర్శించారు.

ప్రాంతీయ మూలాలతో ముడిపడిన హస్తకళా సంప్రదాయాలు

 

బిహార్‌ హస్తకళా వారసత్వాన్ని సిక్కీ గడ్డి కళ కూడా ప్రతిబింబిస్తోంది. ఇందులో భారత కొత్త పార్లమెంట్‌ భవనం నమూనాతో పాటు, కోస్టర్లు అమర్చిన సంప్రదాయ సిక్కీ అల్లిక బుట్ట కూడా ఉన్నాయి. వెదురు చేటపై చేతితో చిత్రించిన మధుబని కళాఖండం జానపద చిత్రకళను సంప్రదాయ వినియోగ హస్తకళతో మేళవించింది.

 

మరో ప్రత్యేకమైన కళాఖండంగా భాగల్పూర్‌కు చెందిన మంజూషా (అంగిక) చిత్రకళ నిలుస్తోంది. ఇందులో భారతదేశ పటంపై భారతమాతను చిత్రించారు. సంప్రదాయ పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల సమ్మేళనంతో రూపొందించిన ఈ కళాఖండం మంజూషా చిత్రకళలోని కథన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తోంది.

చరిత్ర, ఆధ్యాత్మిక వారసత్వం

 

 

ఈ సేకరణ బిహార్‌ చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని కూడా ప్రతిబింబిస్తోంది. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంతో అనుబంధం ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్‌ పాండేను గుర్తు చేస్తూ రూపొందించిన రాగి పలక జ్ఞాపిక కూడా ఇందులో ఉంది. అశోక స్తంభం, తఖ్త్‌ శ్రీ హర్మందిర్‌ జీ పట్నా సాహిబ్‌, భగవాన్‌ బుద్ధుడు, మహావీర్‌ స్వామి ప్రతిరూపాలతో పాటు బిహార్‌లోని వివిధ ఆలయాలు, పుణ్యక్షేత్రాల ప్రతిరూపాలు కూడా ఈ సేకరణలో ఉన్నాయి.

ఆధ్యాత్మిక సేకరణలో ముంగేర్‌లోని చండికా స్థాన్‌, బడీ దుర్గా మహారాణి, సీతామఢిలోని పునౌరా ధామ్‌, భోజ్‌పూర్‌లోని మా అరణ్య దేవి ఆలయం, ముజఫర్‌పూర్‌లోని బాబా గరీబ్‌నాథ్‌ ఆలయం, కైమూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ధామ్‌, ముండేశ్వరీ దేవి ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రతిరూపాలు ఉన్నాయి.

జననాయక్‌ కర్పూరి ఠాకూర్‌, ఆచార్య చాణక్య, గురు వాల్మీకి వంటి ప్రముఖులతో అనుబంధం ఉన్న జ్ఞాపికలతో పాటు, రామాయణం, ఇతర సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే కళాఖండాలు కూడా ఉన్నాయి.

రూ.1,500 నుంచి రూ.1,20,000 వరకు కనీస ధరలు నిర్ణయించిన ఈ బిహార్‌ సేకరణ  ప్రధానమంత్రి జ్ఞాపికల ద్వారా రాష్ట్రంలోని సజీవ కళ, హస్తకళ, ఆధ్యాత్మిక, చారిత్రక సంప్రదాయాలతో అనుబంధం ఏర్పరుచుకునే అవకాశాన్ని సేకరణదారులకు కల్పిస్తోంది.

ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ - వేలం 8వ విడత 2026 అక్టోబర్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో కొనసాగుతుంది. వేలం తేదీలు, పాల్గొనే విధానం, పూర్తి కేటలాగ్‌ వివరాల కోసం ప్రధానమంత్రి స్మారక కానుకల ఈ - వేలం పోర్టల్‌: https://pmmementos.gov.in/#/ ను చూడండి.

 

***


(రిలీజ్ ఐడి: 2314336) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , English , Urdu , Marathi