ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్ఐఎన్ఎల్ భూముల ఈ - వేలానికి ముందస్తుగా విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించిన ఎన్ఎల్ఎంసీ
సెప్టెంబర్ 24, 25 తేదీల్లో విజయవాడ, హైదరాబాద్‌లో కూడా పెట్టుబడిదారులతో సమావేశాలు
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2026 8:04PM by PIB Hyderabad
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ సంస్థ - రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)కు చెందిన 459 ఫ్లాట్ల ఈ - వేలం గురించి ఆసక్తి ఉన్న బిడ్డర్లకు, భాగస్వామ్య వర్గాలకు వివరాలు అందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) ఈ రోజు విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశాన్ని నిర్వహించింది.
ఎన్ఎల్ఎంసీ, ఆర్ఐఎన్ఎల్‌కు చెందిన ఉన్నతాధికారులు పెట్టుబడిదారుల సమావేశానికి హాజరయ్యారు. ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఇతర భాగస్వామ్య వర్గాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భూముల వివరాలు, ప్లాట్ల ప్రాంతం, స్థానం, ప్రత్యేకతలు, ఈ - వేలం ప్రక్రియ, అర్హత నిబంధనలు, రిజిస్ట్రేషన్ విధానం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ), ఇంకా వర్తించే ఇతర నిబంధనలు, షరతులపై సమగ్ర సమాచారాన్ని పంచుకునేందుకు ఈ సమావేశం అవకాశం కల్పించింది.
ఈ - వేలానికి ముందు ఎన్ఎల్ఎంసీ నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ పెట్టుబడిదారుల సమావేశం జరిగింది. సమాచారాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఆసక్తి ఉన్న బిడ్డర్లు భూముల వివరాలు గురించి, వేలం ప్రక్రియ గురించి సమగ్రంగా అర్థం చేసుకునేలా చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా 2026 సెప్టెంబర్ 24న విజయవాడలో, 2026 సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ - వేలంలో విశాఖపట్నంలోని హెచ్‌బీ కాలనీ, మద్దిలపాలెం, ఆటోనగర్, గాజువాక ప్రాంతాల్లో ఉన్న ఆర్ఐఎన్ఎల్‌కు చెందిన మొత్తం 93,572.21 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 459 ప్లాట్లు ఉన్నాయి. ఒక్కో ప్లాట్ విస్తీర్ణం సుమారు 128.94 చదరపు గజాల నుంచి 2,728 చదరపు గజాల వరకు ఉంది.
ఈ భూముల్లో హెచ్‌బీ కాలనీలో సుమారు 87,949.77 చదరపు గజాల విస్తీర్ణంలో 456 నివాస ప్లాట్లు, ఆటోనగర్, గాజువాకలో సుమారు 5,622.44 చదరపు గజాల విస్తీర్ణంలో మూడు ప్లాట్లు ఉన్నాయి. విశాఖపట్నంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఈ ప్లాట్లు ఉండటంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రహదారి, పౌర మౌలిక సదుపాయాలను వినియోగించుకునే అవకాశం ఉంది.
ఆటోనగర్‌లోని భూముల్లో బ్లాక్ - 2లో 2,728 చదరపు గజాల విస్తీర్ణంలో ఒకే ఫ్లాట్, బ్లాక్ - 3లో మొత్తం సుమారు 2,894.44 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు నివాస ప్లాట్లు ఉన్నాయి. ఆటోనగర్‌లో ఇప్పటికే వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాలకు రహదారి అనుసంధానం కూడా ఉంది.
ఈ - వేలం ప్రక్రియకు లావాదేవీ సలహాదారుగా క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (క్యుఐపీఎల్) ను నియమించారు.
ఎన్ఎల్ఎంసీ సీఈఓ శ్రీ రోహన్ చంద్ ఠాకూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఆర్ఐఎన్ఎల్ భూముల ఈ - వేలానికి ముందు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో విశాఖపట్నం పెట్టుబడిదారుల సమావేశం ఒక ముఖ్యమైన భాగం. ఆసక్తి ఉన్న బిడ్డర్లకు భూముల వివరాలు, ఈ -వేలం ప్రక్రియ, నిబంధనలు, షరతులపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా చూడడమే మా లక్ష్యం. విశాఖపట్నంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో 93,500 చదరపు గజాలకు పైగా విస్తీర్ణంలో 459 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. తమ అవసరాలకు అనుగుణంగా ఆసక్తి ఉన్న బిడ్డర్లు వివిధ భూకేటాయింపులను పరిశీలించుకునే అవకాశం ఉంది. పారదర్శక, పోటీతో కూడిన ఈ - వేలం విధానం ద్వారా నగదు లావాదేవీ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఎన్ఎల్ఎంసీ ఆర్ఐఎన్ఎల్‌తో కలిసి సమన్వయంతో పనిచేస్తోంది” అన్నారు.
ఆర్ఐఎన్ఎల్ సీఎండీ శ్రీ ఎం.ఎన్.వి.ఎస్. ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రస్తుత ఈ - వేలం ద్వారా అందుబాటులో ఉంచిన ఫ్లాట్లు హెచ్‌బీ కాలనీ, మద్దిలపాలెం, ఆటోనగర్ సహా విశాఖపట్నంలోని ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉన్నాయి. పెట్టుబడిదారుల సమావేశం ద్వారా ఈ ఫ్లాట్ల వివరాలు, ఈ - వేలం ప్రక్రియ గురించి ఆసక్తి ఉన్న బిడ్డర్లకు నేరుగా వివరించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేసే అవకాశం లభించింది. ప్రధానేతర భూ ఆస్తులను క్రమబద్ధమైన, పారదర్శక విధానంలో వేలం వేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు ఎన్ఎల్ఎంసీకి అవసరమైన సహకారాన్ని ఆర్ఐఎన్ఎల్ కొనసాగిస్తుంది” అని అన్నారు.
ఈ - వేలం ను రైల్‌టెల్ ఈ - నివిదా ఈ - ప్రొక్యూర్‌మెంట్ వేదిక ద్వారా రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతలో 243 ప్లాట్ల ఈ - వేలం ను 2026 అక్టోబర్ 12న ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు నిర్వహించనున్నారు. మొదటి విడతకు రిజిస్ట్రేషన్, ఈఎండీ సమర్పణకు చివరి తేదీ 2026 అక్టోబర్ 8 సాయంత్రం 5:00 గంటల వరకు.
రెండో విడతలో 216 ప్లాట్ల ఈ - వేలం ను 2026 అక్టోబర్ 16న ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు నిర్వహిస్తారు. రెండో విడతకు రిజిస్ట్రేషన్, ఈఎండీ సమర్పణకు చివరి తేదీ 2026 అక్టోబర్ 14 సాయంత్రం 5:00 గంటల వరకు. ప్రతి వేలానికి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) రూ.2 లక్షలు.
వేలానికి సంబంధించిన సమగ్ర పత్రాలు, ప్లాట్ల వివరాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, నిబంధనలు, షరతులు అధికారిక ఈ - వేలం పోర్టల్ https://eauction.enivida.com/ అందుబాటులో ఉన్నాయి.
విశాఖపట్నంలో నేటి పెట్టుబడిదారుల సమావేశం అనంతరం, ఎన్ఎల్ఎంసీ, ఆర్ఐఎన్ఎల్ రేపు (సెప్టెంబర్ 24) విజయవాడలోనూ, ఎల్లుండి (సెప్టెంబర్ 25) హైదరాబాద్‌లోనూ తదుపరి పెట్టుబడిదారుల సమావేశాలను నిర్వహించనున్నాయి.
ఎన్ఎల్ఎంసీ గురించి
నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) 100 శాతం భారత ప్రభుత్వ యాజమాన్యం కలిగిన సంస్థ. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల విభాగం శపరిపాలనా నియంత్రణలో పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన మిగులు భూములు, ఇతర ప్రధానేతర ఆస్తులను క్రమబద్ధమైన, వృత్తిపరమైన విధానంలో విక్రయించే ప్రక్రియకు వీలు కల్పించే లక్ష్యంతో ఎన్ఎల్ఎంసీని ఏర్పాటు చేశారు.
ఆర్ఐఎన్ఎల్ గురించి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కార్పొరేట్ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.
****
(రిలీజ్ ఐడి: 2314198)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8