వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యాపార సౌలభ్యం, ఎఫ్‌టీఏ అవకాశాలు, వాణిజ్య సంస్కరణల వర్క్‌షాపులో పరిశ్రమ నిపుణులతో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చర్చ


భౌతిక, డిజటల్ వ్యవస్థల ద్వారా ఎగుమతి సౌకర్యాలను బలోపేతం చేయాలని శ్రీ గోయల్ పిలుపు

జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఎగుమతిదారులకు మద్దతు అందించేందుకు స్థానిక సిబ్బందిని నియమించాలని ప్రతిపాదించాం: శ్రీ గోయల్

టారిఫ్‌లు, ఎఫ్‌టీఏ అవకాశాలు, విధానాలపై ఉత్పత్తివారీగా, హెచ్ఎస్‌ఎన్ కోడ్ వారీగా సమాచారం అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ వేదిక

నాడు పోస్టు చేయడమైనది: 22 SEP 2026 9:36PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో వ్యాపార సౌలభ్యం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కొనసాగుతున్న వాణిజ్య సంబంధిత సంస్కరణలపై పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) వర్క్ షాప్ ను నిర్వహించింది. అనంతరం కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాదతో ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపట్టింది

భౌతిక, డిజిటల్ వ్యవస్థల ద్వారా ఎగుమతి సౌకర్యాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని శ్రీ గోయల్ ఈ చర్చలో వివరించారు. ప్రతి ప్రాంతంలోనూ ప్రతి శాఖకూ వేర్వేరు కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి బదులుగా బహుళ విభాగాలు, సంస్థలు ఒకే చోట అందుబాటులో ఉండేలా ప్రధాన నగరాల్లో సమీకృత వాణిజ్య, పరిశ్రమ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

ఆయన పరిశ్రమ ప్రతినిధులతో నేరుగా మాట్లాడారు. వారు చేసిన కొన్ని సూచనలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

ఒక ప్రాంతీయ పరిశ్రమల సంఘంతో ఇలాంటి సమావేశం జరగడం ఇదే తొలిసారి.

దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ఇటీవల చేపట్టిన విధానపరమైన చర్యల సానుకూల ప్రభావాన్ని రోలర్ చెయిన్, పారిశ్రామిక విడిభాగాల తయారీ రంగం వివరించింది. నాణ్యతా నియంత్రణ ఉత్వర్వు (క్యూసీవో)లు, కనీస దిగుమతి ధర (ఎంఐపీ) నిబంధనలు, అధిక దిగుమతి సుంకాల లాంటి చర్యలు ఈ రంగంలో గణనీయమైన వృద్ధికి తోడ్పడ్డాయనీ, ఫలితంగా ఈ రంగం 15 రెట్లు విస్తరించిందని తెలియజేసింది. అలాగే సుమారుగా రూ. 500 కోట్ల నూతన పెట్టుబడులు వచ్చాయనీ, దాదాపు 5,000 నూతన ఉద్యోగాల కల్పన జరిగిందని వెల్లడించింది. దేశీయ తయారీ రంగ సామర్థ్యానికి తోడ్పాటును అందించడానికీ, పెట్టుబడులను ప్రోత్సహించడానికీ, ఉద్యోగాల కల్పనకూ చేపడుతున్న ఈ చర్యలను పరిశ్రమ స్వాగతించింది.

జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఎగుమతిదారులకూ, ఔత్సాహిక ఎగుమతిదారులకూ మద్దతునిచ్చేలా ప్రాంతీయ భాషల పరిజ్ఞానం ఉన్న, శిక్షణ పొందిన 1000 మంది స్థానిక సిబ్బందితో కూడిన ప్రతిపాదిత వ్యవస్థను కూడా మంత్రి ప్రకటించారు. శిక్షణ అనంతరం వారిని ఉద్యోగాల్లో నియమిస్తారు. వారు పారిశ్రామిక ఛాంబర్లు, ప్రాంతీయ సంఘాలతో కలసి వ్యాపారాలకు సహయపడతారు.

ఎగుమతిదారులకు ఉత్పత్తివారీగా, హెచ్ఎస్ఎన్ కోడ్ వారీగా సమాచారాన్ని అందించడం కోసం అభివృద్ధి చేస్తున్న ట్రేడ్ కనెక్ట్ వేదిక గురించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి శ్రీ గోయల్ వివరించారు. ఈ సమాచారంలో ఎగుమతి చేసే దేశంలో సుంకాలు, ఎఫ్‌టీయే అవకాశాలు, ఎఫ్‌టీయే ప్రయోజనాలను పొందే విధానాలు కూడా ఉంటాయి. ఎగుమతి అవకాశాల సామర్థ్యాన్నీ, మౌలిక సదుపాయాల్లోని అంతరాలనూ గుర్తించడంలో వ్యాపారాలకు సాయపడేందుకు డిజిటల్, ఏఐ ఆధారిత సాధానాలను ఈ వేదిక ఉపయోగిస్తుంది.

పారిశ్రామిక సంఘాలు, వాణిజ్య విభాగాలు, వివిధ రంగాలకు చెందిన సంస్థల ప్రతినిధులనూ, డీపీఐఐటీ, వాణిజ్య విభాగం ఉన్నతాధికారులనూ ఈ వర్కుషాప్ ఒక్కచోటకు చేర్చింది. కొనసాగుతున్న ఈవోడీబీ సంస్కరణలు, వాణిజ్యాన్ని  సులభతరం చేసే చర్యలు, ఎఫ్‌టీఏల ద్వారా లభించే అవకాశాలు, మార్కెట్లను చేరుకోవడంలో, నిబంధనలను పాటించడంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, విధానపరమైన అవసరాలపై చర్చలో ప్రధాన దృష్టి సారించారు

స్టార్టప్ ఇండియా, మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్), పెట్టుబడులకు ప్రోత్సాహం, జాతీయ సింగిల్ విండో వ్యవస్థ, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్‌వో)లో సంస్కరణలకు సంబంధించిన కీలక కార్యక్రమాల గురించి డీపీఐఐటీ అధికారులు ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు. వీటిలో నియంత్రణ పద్ధతుల సరళీకరణ, హేతుబద్ధీకరణ, డిజిటలీకరణ, నిబంధనల భారాన్ని తగ్గించడం, అనుమతులు, సేవా పంపిణీ వ్యవస్థలను మెరుగుపరచడం గురించి తెలియజేశారు

ఇటీవలి ఎఫ్‌టీఏల గురించి, వాణిజ్య సౌలభ్య సంస్కరణల గురించి ఓ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భారతదేశ వాణిజ్య ఒప్పందాల ద్వారా లభిస్తున్న అవకాశాలు, ఏర్పడుతున్న బాధ్యతల గురించి పరిశ్రమకు వివరించారు. వాణిజ్య సంబంధిత ప్రక్రియలు, విధానాల డిజిటలీకరణ, డాక్యుమెంటేషన్, సరళీకరణకు సంబంధించి కొనసాగుతున్న చర్యల గురించి కూడా ఈ కార్యక్రమంలో తెలియజేశారు.

ఎగుమతుల్లో పోటీతత్వం, వాణిజ్య డాక్యుమెంటేషన్, నియంత్రణ ప్రక్రియలు, ఎఫ్‌టీఏ వినియోగం, సరకు రవాణా, దేశీయ సరఫరా వ్యవస్థలు, ప్రమాణాలు, పరీక్షా మౌలిక వసతులు, నియంత్రణల పరంగా స్థిరత్వానికి సంబంధించిన సమస్యలను ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, మ్యాన్–మేడ్ ఫైబర్స్, రాగి, ఆటోమోటివ్, ఇంజినీరింగ్, ఎయిర్ కండిషనర్లు, సరకు రవాణా, ఎంఎస్ఎంఈ రంగాలకు చెందిన ప్రతినిధులు, మహిళా పారిశ్రామికవేత్తలు లేవనెత్తారు.

ఎఫ్‌టీఏల పరిధిలో అందించే మూల ధ్రువపత్రాల డిజిటల్ బదిలీ, ధ్రువీకరణతో సహా ప్రభుత్వ వ్యవస్థలు, విదేశీ వాణిజ్య వేదికల మధ్య విస్తృతమైన అనుసంధానం అవసరమని పారిశ్రామిక ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇలాంటి ఎలక్ట్రానిక్ ప్రక్రియలను ఇతర ఎఫ్‌టీఏ భాగస్వాములకు కూడా విస్తరించాలనే ప్రతిపాదనను పరిశీలన కోసం పరిగణనలోకి తీసుకున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ), కస్టమ్స్, బ్యాంకులు, ఇతర భాగస్వాములతో కూడిన ఎగుమతి ప్రక్రియను మరింత ఏకీకృతం చేయాల్సిన అవసరాన్ని పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి.

పేరుకుపోయిన డాక్యుమెంటేషన్, సముద్ర రవాణా వ్యయాలకు సంబంధించిన సమస్యలతో సహా రవాణా, వాణిజ్య ప్రక్రియల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై కూడా చర్చించారు. అలాగే రూల్స్ ఆఫ్ ఆరిజన్, దిగుమతులు, ఎగుమతుల నాణ్యత, నియంత్రణ ప్రక్రియలు, దిగుమతి పోటీ, పరీక్షలు, ధ్రువీకరణ మౌలికసదుపాయాలు, ఎంఎస్ఎంఈలకు నియంత్రణ పరంగా స్థిరత్వం, తదితరమైన రంగాల వారీగా సమస్యలను తెలియజేశారు.

భారతీయ ఎగుమతుల విశ్వసనీయతను బలోపేతం చేయడానికి నాణ్యతతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాల్సిన అవసరం గురించి తెలియజేశారు. గమ్యస్థాన మార్కెట్ ప్రమాణాలపై అవగాహన కల్పించడానికి, వాటిని పాటించడానికి మద్దతు ఇవ్వాలని పారిశ్రామిక సంఘాలకు, ఎగుమతి ప్రోత్సాహక మండళ్లకు సూచించారు. అలాగే మోసపూరిత, నాసిరకం లేదా నిబంధనలకు విరుద్ధమైన తయారీ ఉదంతాలను గుర్తించి తగిన నియంత్రణ చర్యలు తీసుకోవడంలో సహాయపడాలని కోరారు.

వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను పరిష్కరించడం, దేశీయ తయారీ, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రపంచ మార్కెట్లలో భారతీయ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడంలో ప్రభుత్వం-పరిశ్రమల భాగస్వామ్యానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సమావేశం పునరుద్ఘాటించింది.

సులభతర వ్యాపార విధానాన్ని బలోపేతం చేయడం, వాణిజ్యాన్ని సులభతరం చేయడం, విస్తరిస్తున్న భారతదేశ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వ్యవస్థ అందిస్తున్న అవకాశాలను దేశీయ పరిశ్రమలు సమర్థంగా వినియోగించుకొనేలా చేయడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో ఈ వర్క్‌షాప్ ఓ భాగం

 

****


(రిలీజ్ ఐడి: 2313865) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी