శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరిశోధనలు, వాటిని ఆచరణలోకి తేవడం, ముందస్తు సన్నద్ధత కోసం భారత్‌లోని పరిశోధన వర్గాలను ఒకచోట చేర్చిన 9వ మాలిక్యులర్ వైరాలజీ సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 22 SEP 2026 4:45PM by PIB Hyderabad

ఢిల్లీలోని బ్రిక్‌–నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో (బ్రిక్‌–ఎన్ఐఐ) సెప్టెంబర్ 18న ముగిసిన 9వ మాలిక్యులర్ వైరాలజీ సమావేశం (ఎంవీఎం)- 2026.. భారత్ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 200 మంది వైద్యులు, పరిశోధకులు, విద్యార్థులను ఒకచోట చేర్చింది. ఇందులో వైరల్ బయాలజీలో వస్తోన్న కొత్త సవాళ్లు,  వైరాలజీ పరిశోధనలను ఆచరణాత్మకమైన వ్యాక్సిన్‌లు చికిత్సలు, నిర్ధారణ పరీక్షలు, ప్రజా ఆరోగ్య సామర్థ్యాలుగా మార్చటం గురించి చర్చించారు.

2009లో ప్రారంభమైన మాలిక్యులర్ వైరాలజీ సమావేశం భారతీయ వైరాలజీ రంగానికి సంబంధించిన వార్షిక కార్యక్రమంగా మారింది. ఇది వైరల్ ఇన్‌ఫెక్షన్ల అణు విధానాలు (మాలిక్యులర్ మెకానిజమ్స్), హోస్ట్-వైరస్ పరస్పర చర్యల నుంచి వైరల్ పాథోజెనెసిస్, రోగనిరోధక శక్తి, పరిణామం, ఇమ్యూన్ ఎవేషన్, ఎపిడెమియాలజీ, క్లినికల్ వైరాలజీ, పరిశోధనలను ఆచరణలోకి తేవటం (ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్) వరకు వివిధ అంశాలపై పనిచేస్తున్న పరిశోధకులను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది.

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ఐసీజీఈబీ), రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్సీబీ) సహకారంతో బ్రిక్‌–ఎన్ఐఐ ఈ 2026 కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది వివిధ సంస్థలు, విభాగాల పరిశోధకులు తమ పరిశోధనా ఫలితాలను పంచుకోవడానికి, కొత్త పరిశోధనా మార్గాలను గుర్తించడానికి, వైరాలజీ పరిశోధనలను ప్రజా ఆరోగ్యానికి అవసరమైన సాంకేతికతలు, పరిష్కారాలుగా మలచడాన్ని బలపరిచే అవకాశాలపై చర్చించడానికి ఒక వేదికను అందించింది.

పుణెలో ఉన్న ఐసీఎంఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఐసీఎంఆర్-ఎన్ఐవీ) డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ ‘ఫ్లిప్ ది స్విచ్: హోస్ట్ ఫ్యాక్టర్స్ దట్ బ్లాక్ ఆర్ బూస్ట్ వైరసెస్’ (వైరస్‌లను అడ్డుకునే లేదా వృద్ధి చెందేలా చేసే అతిథేయ కారకాలు) అనే అంశంపై చేసిన కీలక ప్రసంగంతో ఈ రెండు రోజుల సమావేశం ప్రారంభమైంది. ఈ శాస్త్రీయ కార్యక్రమంలో ఇన్‌ఫ్లుయెంజా, డెంగ్యూ, చికున్‌గున్యా, హెచ్ఐవీ, హెపటైటిస్ ఈ, వెస్ట్ నైల్ వైరస్, కరోనా వైరస్‌లు, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ వంటి వివిధ వైరల్ వ్యవస్థలపై జరిగిన పరిశోధనలపై చర్చించారు. వైరల్ ప్రవేశం, ద్విగుణీకరణ (రెప్లికేషన్), హోస్ట్ ప్రతిస్పందనలు, రోగనిరోధక నియంత్రణ, వైరల్ అనుకూలత, వ్యాధి జనక యంత్రాంగం (మాలిక్యులర్ మెకానిజమ్స్ ఆఫ్ పాథోజెనెసిస్) వంటి అంశాలపై చర్చించారు.

ప్రాథమిక వైరాలజీకి, ఆచరణాత్మక అనువర్తనానికి (ట్రాన్స్‌లేషన్‌కు) మధ్య గల సంబంధంపై ఎంపీఎం 2026 ప్రత్యేక దృష్టి సారించింది. 'ట్రాన్స్‌లేషనల్ వైరాలజీ: వ్యాక్సిన్‌లు, థెరప్యూటిక్స్' అనే సెషన్‌లో యాంటీవైరల్ చికిత్సలు, యాంటీబాడీల గుర్తింపు, రోగనిర్ధారణతో కూడిన చికిత్సపై (థెరానోస్టిక్స్) చేసిన పనులతో పాటు వైరల్ పరిణామం, ఎపిడెమియాలజీకి సంబంధించిన అధ్యయనాలపై చర్చించారు. 

వ్యక్తిగత పరిశోధన కార్యక్రమాలకే పరిమితం కాకుండా భారత్ మరింత బలమైన జాతీయ వైరాలజీ ఆవిష్కరణ, సన్నద్ధత వ్యవస్థను తయారు చేసుకునే తీరును కూడా ఈ సమావేశం పరిశీలించింది. 'వైరాలజీ పరిశోధన భవిష్యత్తు, బయోఈ3 విధానంలో దాని సహకారం: వికసిత్ భారత్ వైపు అడుగులు' అనే అంశంపై విద్యావేత్తలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు ప్యానల్ చర్చ చేపట్టారు. బ్రిక్-ఎన్ఐఐకి చెందిన డాక్టర్ నిమేష్ గుప్తా మోడరేటర్‌గా వ్యవహరించిన ఈ చర్చలో డాక్టర్ నవీన్ కుమార్ (ఐసీఎంఆర్‌-ఎన్ఐవీ), ప్రొఫెసర్ సౌమిత్ర దాస్ (ఐఐఎస్సీ), డాక్టర్ సుధాన్షు వ్రతి (ఆర్సీబీ), ప్రొఫెసర్ సంజీవ్ గలాండే (శివ్ నాడార్ విశ్వవిద్యాలయం), డాక్టర్ సుబీర్ మజుందార్ (సన్ ఫార్మా సైన్స్ ఫౌండేషన్) పాల్గొన్నారు.

భారతీయ వైరాలజీ రంగానికి ఉన్న శాస్త్రీయ బలాలు, సామర్థ్యాలను బయోఈ3, వికసిత్ భారత్ విస్తృత దృక్పథానికి అనుసంధానించే తీరుపై ఈ చర్చ కేంద్రీకృతమైంది. పరిశోధన, పరిశీలన (వాలిడేషన్) నుంచి ఉత్పత్తి స్థాయికి చేరుకునేలా మరింత అనుసంధానమైన మార్గాన్ని అభివృద్ధి చేయడం.. వ్యాక్సిన్‌లు, చికిత్సలు, నిర్ధారణ పరీక్షల కోసం ప్లాట్‌ఫామ్ సాంకేతికతలను రూపొందించడం.. వ్యక్తిగత ప్రాజెక్ట్‌లను మించి ఆచరణాత్మక అనువర్తనానికి (ట్రాన్స్‌లేషన్‌కు) మద్దతు ఇచ్చే నిధుల సమకూర్పు విధానాలు.. విద్యావేత్తలు, పరిశ్రమ, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యాలు.. వైరల్ వ్యాధుల నిఘా, ఆరోగ్య భద్రతకు అవసరమైన సామర్థ్యాల గురించి వక్తలు చర్చించారు. 'వికసిత్ భారత్' లక్ష్యంలో వైరాలజీకి మరింత పెద్ద పాత్ర ఉందని ఈ ప్యానల్ చర్చ స్పష్టం చేసింది.

ప్రాథమిక శాస్త్రవేత్తలు, వైద్యులు, ట్రాన్స్‌లేషనల్ పరిశోధకులు, నిధులు సమకూర్చే సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఆధునిక వైరాలజీలోని పరస్పర అనుసంధాన స్వభావాన్ని ఎంవీఎం 2026 సమావేశం ప్రధానంగా చెప్పింది. ఇక్కడ వైరల్ యంత్రాంగాలను అర్థం చేసుకోవడం అనేది ఆ విజ్ఞానాన్ని ముందస్తు సన్నద్ధత, సాంకేతికతలు, వర్ధమాన ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలుగా మార్చే సామర్థ్యంతో కలిసి సాగాలని ఈ సమావేశం చాటిచెప్పింది.

ఈ కార్యక్రమంలో ఏడు శాస్త్రీయ సెషన్‌లు, స్పాట్‌లైట్ ప్రసంగాలు, పోస్టర్ ప్రెజెంటేషన్‌లు, ప్యానల్ చర్చ జరిగాయి. ఆ తర్వాత అవార్డు వేడుక, ముగింపు సెషన్‌తో ఈ కార్యక్రమం ముగిసింది.

“ఒక విద్యార్థిగా ఎంవీఎం-2026లో పాల్గొనటం నాకు ఎంతో విలువైన అభ్యాస అనుభవాన్ని ఇచ్చింది. ప్రముఖ వైరాలజిస్టులు వైరస్ బయాలజీలోని వివిధ అంశాల గురించి చెప్పిన విషయాలను తెలుసుకోవటం ఎంతో స్ఫూర్తినిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధకులతో మమేకమయ్యే అవకాశాన్ని కూడా ఇది కల్పించింది. ఈ సమావేశ నిర్వహణలో కూడా భాగస్వామ్యమవటం ఈ అనుభవాన్ని మరింత అర్థవంతంగా మార్చింది. శాస్త్రీయ ఆలోచనలు, చర్చలు, సహకారాలు అన్నీ కలిసి ఒక శక్తిమంతమైన పరిశోధనా సమాజాన్ని ఎలా సృష్టిస్తాయో మేం ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది.”

— భవ్య అహుజా, పీహెచ్‌డీ స్కాలర్, బ్రిక్‌-ఎన్ఐఐ


(రిలీజ్ ఐడి: 2313714) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Urdu