భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
యూరోపియన్ పార్లమెంట్ ఐటీఆర్‌ఈ ప్రతినిధులతో చర్చలు జరిపిన కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి
ఈవీలు, బ్యాటరీలు, పారిశ్రామిక కర్బన ఉద్గారాల తగ్గింపు, గ్రీన్ స్టీల్ రంగాలపై దృష్టి సారించిన భారత్-ఈయూ సహకారం
నాడు పోస్టు చేయడమైనది:
22 SEP 2026 7:52PM by PIB Hyderabad
నేడు న్యూఢిల్లీలో యూరోపియన్ పార్లమెంట్ పరిశ్రమ, పరిశోధన, ఇంధన కమిటీ (ఐటీఆర్‌ఈ) ప్రతినిధి బృందంతో భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్‌డీ కుమారస్వామి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధి, స్వచ్ఛ ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, పారిశ్రామిక కర్బన ఉద్గారాల తగ్గింపు రంగాల్లో భారత్-ఈయూ సహకారాన్ని మరింత బలోపేతం చేయటంపై ఈ చర్చలు జరిగాయి. ఈ యూరోపియన్ పార్లమెంట్ ప్రతినిధి బృందంలో పార్లమెంటు సభ్యులు శ్రీ రఫెలే స్టాన్కనెల్లి, శ్రీమతి ఏంజెలికా విన్జిగ్, శ్రీ మొహమ్మద్ చాహిమ్, శ్రీ రౌల్ డి లా హోజ్ క్వింటానో, శ్రీ నికోలస్ గొంజాలెజ్ కసారెస్, శ్రీ మోర్టెన్ లోకెగార్డ్, శ్రీ జూరి రాటాస్, శ్రీ వర్జినిజస్ సింకెవిసియస్ పాల్గొన్నారు. ఈ బృందంతో పాటు ఐటీఆర్‌ఈ సెక్రటేరియట్ డైరెక్టర్ శ్రీ ఎటియెన్ బాసోట్, అడ్మినిస్ట్రేటర్ శ్రీ మారియుస్ కావ్నిక్, అసిస్టెంట్ శ్రీ బ్రహిమ్ ఎబ్న్ ఐస్సా, ఇతర సిబ్బంది హాజరయ్యారు.
భారత్-ఈయూ సంబంధాల్లో ఇదొక కీలక తరుణమని, 2026 జనవరిలో జరిగిన 16వ భారత్-ఈయూ సదస్సు తర్వాత ఈ పర్యటన జరుగుతోందని మంత్రి తెలిపారు. ఈ సదస్సులో ఎఫ్‌టీఏ చర్చలను ముగించటంతో పాటు భారత్-ఈయూ ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక కార్యచరణను ఆమోదించినట్లు తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో మరింత సహకారానికి విస్తృత అవకాశాలున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు, ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేసేందుకు ఈవీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు కీలక కార్యక్రమాలను కేంద్రమంత్రి శ్రీ కుమారస్వామి తెలియజేశారు. ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్స్ కోసం పీఎల్‌ఐ పథకం, అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్స్ కోసం పీఎల్‌ఐ పథకం, పీఎం ఈ-డ్రైవ్ వంటి పథకాలను ప్రస్తావించారు. స్థిరమైన ఇంధన నిల్వ వ్యవస్థల కోసం 10 జీడబ్ల్యూహెచ్ ఏసీసీ తయారీకి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న గ్లోబల్ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సిందిగా యూరోపియన్ పరిశ్రమలను ఆహ్వానించారు.
భారతదేశంలో పారిశ్రామిక కర్బన ఉద్గారాల తగ్గింపు, ఇంధన మార్పిడి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మంత్రి స్పష్టం చేశారు. ఇందులో బీహెచ్‌ఈఎల్ స్వదేశీ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ, స్క్రాప్ రీసైక్లింగ్, ఉక్కు వ్యర్థాల వినియోగం, సర్క్యులర్ ఎకానమీ పద్ధతుల ద్వారా ఉక్కు రంగాన్ని పర్యావరణహిత రంగంగా మార్చే ప్రణాళిక గురించి తెలిపారు.
భారీ పరిశ్రమలు, ఉక్కు మంత్రిత్వ శాఖ సెక్రటరీ శ్రీ కామ్రాన్ రిజ్వీ, అదనపు సెక్రటరీ శ్రీ హనీఫ్ ఖురేషీలతో పాటు పలువురు సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేయటం, దేశీయ తయారీని బలోపేతం చేయటం, పారిశ్రామిక కర్బన ఉద్గారాలను మరింతగా తగ్గించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రతినిధి బృందం అభినందించింది. స్వచ్ఛ సాంకేతికతలు, స్థిరమైన రవాణా, అధునాతన ఇంధన పరిష్కారాల్లో భారత్-ఈయూ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవటంపై సభ్యులు ఆసక్తిని కనబరిచారు.
భారత్, ఈయూ బలాలను ఏకం చేయటం ద్వారా స్వచ్ఛ ఇంధనం దిశగా మార్పును వేగవంతం చేయవచ్చని, వినూత్న ఈ-మొబిలిటీ పరిష్కారాల ద్వారా సుస్థిర రవాణాను ముందుకు తీసుకెళ్లవచ్చని శ్రీ కుమారస్వామి అన్నారు. పారిశ్రామిక రంగంలో నిరంతర భాగస్వామ్యం, మరింత సహకారం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2313708)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11