శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విశాఖపట్నంలో మెరుగైన, సురక్షిత రహదారుల కోసం వీఎమ్‌ఆర్‌డిఏ, జీవీఎమ్‌సీలతో సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ భాగస్వామ్యం


రహదారుల నిర్మాణానికి శాస్త్రీయ సహకారం అందించనున్న సంస్థ

నాడు పోస్టు చేయడమైనది: 21 SEP 2026 8:46PM by PIB Hyderabad

విశాఖపట్నం నగరంలో శాస్త్రీయ పద్ధతిలో రహదారుల అభివృద్ధి కార్యక్రమ రూపకల్పన లక్ష్యంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎమ్. భరత్ ఆధ్వర్యంలో ఈ రోజు విశాఖపట్నంలోని వీఎమ్ఆర్‌డీఏ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. న్యూఢిల్లీకి చెందిన సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్. రవిశేఖర్ నేతృత్వంలోని సీనియర్ ప్రతినిధి బృందంతో పాటు నగర, మెట్రోపాలిటన్ ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్ (ఐఏఎస్), జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ శ్రీ పి. వి. వి. సత్యనారాయణ రాజు, వీఎంఆర్‌డీఏ చీఫ్ ఇంజనీర్ శ్రీ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐ సంస్థ నుంచి విచ్చేసిన డాక్టర్ జి. భరత్, డాక్టర్ సంపత్ కుమార్ పి., డాక్టర్ పి. ఎస్. ప్రసాద్, డాక్టర్ కె. రవీందర్ పలు కీలక అంశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. వీటిలో భాగంగా ఫ్లెక్సిబుల్ పేవ్‌మెంట్లు, రహదారుల పనితీరు అంచనా, బలహీనమైన, నీరు నిలిచిన నేలల్లో సబ్‌గ్రేడ్ మెరుగుదల, పట్టణ రహదారి భద్రతకు సంబంధించి తమ సంస్థ సాంకేతికతలను వివరించారు.

నగర రహదారుల రూపురేఖలను మార్చేందుకు, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ మద్దతుతో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఒక భారీ రహదారి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టిన కీలక తరుణంలో ఈ భాగస్వామ్యం కుదిరింది. ఇందులో భాగంగా నగరంలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం ఉన్న మట్టి, డబ్ల్యూబిఎమ్ రహదారులను అత్యున్నత ప్రమాణాలతో కూడిన బి.టి లేదా సి.సి రహదారులుగా ఆధునికీకరిస్తూ.. సుమారు 228 కిలోమీటర్ల మేర రహదారులను అనుబంధ మౌలిక వసతులతో సహా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు 34 కిలోమీటర్ల పొడవునా సెంట్రల్ డివైడర్ల నిర్మాణం, 1,550కి పైగా కొత్త వీధి దీపాల ఏర్పాటు, నగరంలోని ప్రధాన కూడళ్ల అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ 'సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐ' అందించే శాస్త్రీయ నైపుణ్యం, సాంకేతిక సాయం ఈ పనుల ప్రణాళికను మరింత పటిష్ఠం చేయడమే కాకుండా... రహదారుల నాణ్యతను, దీర్ఘకాలిక మన్నికను పెంచడానికి ఎంతగానో దోహదపడనుంది.

సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ఎంపీ శ్రీ ఎమ్. భరత్ మాట్లాడుతూ... నగర రహదారుల అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యాలను వివరించారు. ఇందులో భాగంగా నగరంలోని వంతెనల పరిస్థితిని అంచనా వేయడం, రహదారి ప్రాజెక్టుల్లో కఠినమైన నాణ్యత నియంత్రణ పద్ధతులను అనుసరించడం, ప్రమాదాల నివారణకు ఏఐ ఆధారిత 'ఐ-ఆర్ఏఎస్‌టీఈ' తరహా స్మార్ట్ రోడ్డు భద్రతా వ్యవస్థను ప్రవేశపెట్టడం, విశాఖ అంతటా పూర్తి స్థాయి పేవ్‌మెంట్ పరిష్కారాలను అమలు చేయడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. వీటితో పాటు రహదారుల నిర్మాణ సంబంధిత అంశాలపై కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు నిర్మాణాత్మక శిక్షణ అందించాల్సిన అవసరాన్నీ ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని ప్రముఖ ఓడరేవు, విస్తరిస్తున్న పారిశ్రామిక ప్రాంతాలు, పెరుగుతున్న మెట్రోపాలిటన్ రీజియన్, సుదీర్ఘ తీరప్రాంతం వంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా.. నగరానికి శాస్త్రీయంగా రూపొందించిన, అత్యంత మన్నికైన రహదారులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సుదీర్ఘ చర్చలో భాగంగా నగరంలో ఉన్న వివిధ సమస్యలను అధ్యయనం చేసి, వాటికి తగిన పరిష్కారాలను సూచించడానికి వీలుగా పలు కీలక రంగాలను సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ గుర్తించింది. ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా పూర్తి స్థాయి రహదారుల పునర్నిర్మాణ పనులు అంటే కొత్త రహదారుల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న రహదారుల స్థితిగతులను మెరుగుపరచడం వంటి పనులు చేపట్టనున్నారు. రహదారుల కోత, పట్టణ ప్రాంత వరదలు, తీరప్రాంత కోత వంటి తీవ్రమైన సమస్యలపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివారణోపాయాలను ప్రతిపాదించనున్నారు. వీటితో పాటు పాదచారుల రక్షణ కోసం "రైట్-టు-వాక్" (నడిచే హక్కు) సదుపాయాల కల్పన, రహదారుల నాణ్యత-భద్రతా తనిఖీలు నిర్వహించడం, స్పీడ్ బ్రేకర్లను శాస్త్రీయ పద్ధతిలో క్రమబద్ధీకరించడం, నగర రహదారి నెట్‌వర్క్ మొత్తాన్ని పర్యవేక్షించడానికి ఒక ఆధునిక ‘రోడ్ అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ను ఏర్పాటు చేయడం వంటి విప్లవాత్మక మార్పులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఈ భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠంగా, దీర్ఘకాలం పాటు కొనసాగించడానికి వీలుగా ప్రతిపాదిత అవగాహన ఒప్పందాల ప్రక్రియను వేగవంతం చేస్తామని సీఆర్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ రవిశేఖర్, చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వినోద్ కరార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీలతో సీఎస్ఐఆర్- సీఆర్ఆర్ఐ సంస్థ పైన పేర్కొన్న పనులన్నింటినీ కవర్ చేస్తూ రెండు వేర్వేరు ఒప్పందాలను చేసుకోనుంది. ఈ అధికారిక ఒప్పందాల ద్వారా... రహదారి పరిశోధనా రంగంలో సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ సంస్థకు గల 75 సంవత్సరాల అపార అనుభవాన్ని, శాస్త్రీయ నైపుణ్యాన్ని విశాఖ నగర రహదారుల అభివృద్ధి కోసం నిష్పక్షపాతంగా వినియోగించనున్నారు.

విశాఖపట్నం దేశంలోనే అత్యుత్తమ రహదారులను కలిగి ఉండేందుకు వీలుగా... ప్రతిపాదిత పరిష్కారాలకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను, స్పష్టమైన గడువుతో కూడిన కార్యాచరణను రూపొందించాలని ఎంపీ శ్రీ ఎమ్ భరత్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కోసం సమగ్ర అధ్యయనం నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ రోజు జరిగిన చర్చలను వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో కార్యరూపంలోకి తీసుకురావాలని నగర పాలక సంస్థలను, సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ సంస్థను ఆయన కోరారు.

జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏలతో భాగస్వామ్యానికి తమ సంస్థ పూర్తిగా కట్టుబడి ఉందని సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్. రవిశేఖర్ స్పష్టం చేశారు. నోడల్ అధికారుల నియామకం, సంయుక్త క్షేత్రస్థాయి సందర్శనలు, ప్రాధాన్యత కలిగిన మార్గాల గుర్తింపు వంటి అంశాలపై తక్షణమే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

తొలి అడుగుగా... ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో రహదారుల పరిస్థితిని అంచనా వేసేందుకు సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ బృందం జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ శాంతి రాజుతో కలిసి సర్వే నిర్వహించింది. ఈ ఉమ్మడి సర్వేలో భాగంగా రహదారుల ప్రస్తుత స్థితిగతులు, వాటి జామెట్రిక్ డిజైన్, రహదారి భద్రతకు సంబంధించిన అంశాలు, రహదారి చిహ్నాలు, కూడళ్ల ఆధునికీకరణ, పాదచారుల సదుపాయాలు, రహదారులు దెబ్బతినడానికి గల కారణాలను వారు పరిశీలించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2313467) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी