ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‌దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రూ. 845 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ


భారీ మొత్తంలో గంజాయి, చరస్, కొకైన్, ఆంఫెటమైన్ స్వాధీనం.. 15 మంది అరెస్ట్‌

నాడు పోస్టు చేయడమైనది: 21 SEP 2026 7:44PM by PIB Hyderabad

అక్రమ మాదకద్రవ్యాల రవాణాపై కొనసాగిస్తున్న దాడుల్లో భాగంగా రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ).. దేశవ్యాప్తంగా నిర్వహించిన పలు నిఘా ఆధారిత ఆపరేషన్లలో పెద్దఎత్తున మత్తు పదార్థాలు, సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఎన్డీపీఎస్ చట్టం- 1985 (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్) నిబంధనల ప్రకారం గంజాయి లేదా కన్నాబిస్, చరస్, ఆంఫెటమైన్‌తో సహా 845 కిలోలకు పైగా అక్రమ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అధికారులు 15 మందిని అరెస్ట్ చేశారు.

చరస్, గంజాయి స్వాధీనం

నేపాల్ నుంచి చరస్ లేదా హషీష్ అక్రమ రవాణాకు సంబంధించి అందిన కచ్చితమైన సమాచారం మేరకు 20.09.2026న గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో జన నాయక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికులను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. వారిని వ్యక్తిగతంగా తనిఖీ చేయగా తొడల చుట్టూ చీరల కింద కనిపించకుండా పెట్టిన మోకాలి క్యాప్‌లలో దాదాపు 6 కిలోల చరస్ లేదా హషీష్ దొరికింది. ఈ అక్రమ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఎన్డీపీఎస్ చట్టం-1985 కింద ఆ ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేశారు. 

దీనితో పాటు రెండు వేర్వేరు ప్రధాన ఆపరేషన్లలో సుమారు 801 కిలోల గంజాయిని కూడా డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా సమాచారం ఆధారంగా 17.09.2026న బోధ్‌గయాలోని జిందాపుర్ టోల్ ప్లాజా సమీపంలో డీఆర్ఐ అధికారులు ఒక కంటైనర్ లారీని పట్టుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా వరి పొట్టులో దాచిపెట్టిన 737 ప్యాకెట్లలో ఉన్న సుమారు 752.3 కిలోల గంజాయి, కన్నాబిస్ దొరికింది. ఈ అక్రమ మత్తు పదార్థాన్ని, వాహనాన్ని, వరి పొట్టును స్వాధీనం చేసుకొని డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

11.09.2026న ఒడిశాలోని మెంట్రి గ్రామంలో మాదకద్రవ్యాలను డెలివరీ చేయడానికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఘరియాబాద్ అటవీ శాఖ అధికారుల సమన్వయంతో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. తనిఖీ చేయగా రవాణాకు ఉపయోగించిన స్కూటర్‌తో పాటు 3 గోనెసంచులలో 25 ప్యాకెట్లుగా ఉన్న సుమారు 48.5 కిలోల గంజాయి దొరికింది. ఈ అక్రమ మత్తు పదార్థాన్ని, వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేశారు.

డీఆర్ఐ అందించిన నిఘా సమాచారం ఆధారంగా ముంబయి, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల కస్టమ్స్ అధికారులు థాయ్‌లాండ్, వియత్నాం నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల దగ్గర సుమారు 28 కిలోల అత్యుత్తమ నాణ్యత గల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం- 1985 నిబంధనల ప్రకారం ఈ అక్రమ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని నలుగురు ప్రయాణికులను అరెస్ట్ చేశారు.

కొకైన్ స్వాధీనం

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో 15.09.2026న చేపట్టిన మరో ప్రధాన నిఘా ఆధారిత ఆపరేషన్‌లో దుబాయ్ నుంచి దోహా మీదుగా వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అతని చెక్-ఇన్ లగేజీని తనిఖీ చేయగా తొమ్మిది ప్యాకెట్లలో ఉన్న సుమారు 5.8 కిలోల తెల్లటి రంగు పొడి లభించింది. పరీక్ష (ఫీల్డ్ టెస్టింగ్) చేయగా అది కొకైన్ అని నిర్ధారణ అయింది. ఎన్డీపీఎస్ చట్టం- 1985 కింద ఈ అక్రమ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.

ఆంఫెటమైన్ స్వాధీనం

డీఆర్ఐ చేపట్టిన వరుస ఆపరేషన్లు వివిధ ప్రాంతాల్లో ఆంఫెటమైన్ రవాణాను భగ్నం చేశాయి. మొత్తం మూడు వేర్వేరు ఆపరేషన్లలో సుమారు 4.5 కిలోల ఆంఫెటమైన్ రకానికి చెందిన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఐదుగురిని అరెస్ట్ చేశారు.

ముంబయిలో 16.09.2026న ఢిల్లీ నుంచి ప్రయాణిస్తున్న ఒక భారతీయ మహిళా ప్రయాణికురాలిని అధికారులు పట్టుకున్నారు. బేబీ పౌడర్ డబ్బాల లోపల దాచిపెట్టిన సుమారు 493 గ్రాముల మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షించగా ఆ మాత్రలు ఆంఫెటమైన్, ఎక్స్‌టసీ అని తేలింది. ఆ మాత్రలను స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రయాణికురాలిని అరెస్ట్ చేశారు.

కాలికట్ విమానాశ్రయంలో 09.09.2026న ఒక ప్రయాణికుడి లగేజీ నుండి సుమారు 1.9 కిలోల ఆంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నారు. దీనికి కొనసాగింపుగా నిర్వహించిన మరో ఆపరేషన్‌లో ఈ మత్తు పదార్థాన్ని రిసీవర్, ఆర్గనైజర్ ను అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి, వాళ్ల వాహనం నుంచి అదనంగా 17 గ్రాముల ఆంఫెటమైన్, రూ. 3.45 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

అదే రోజు ఇండోర్‌లో ఢిల్లీ నుంచి బస్సులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. సల్వార్ సూట్ సెట్ల లోపల దాచిపెట్టిన సుమారు 2 కిలోల ఆంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేశారు.

వ్యవస్థీకృత మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను ఛిన్నభిన్నం చేయడం, రవాణా వివిధ దశల్లో మత్తు పదార్థాలను అడ్డగించడం, కొత్త రకపు దాచే పద్ధతులను ఛేధించడంలో డీఆర్ఐ నిరంతర దృష్టిని ఈ ఆపరేషన్‌లు ప్రధానంగా తెలియజేస్తున్నాయి. 

 

 

***


(రిలీజ్ ఐడి: 2313466) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil