ఆర్థిక మంత్రిత్వ శాఖ
మాదకద్రవ్యాల నివారణపై అవగాహనను, యువ సాధికారతను, సామాజిక ప్రచారాన్ని బలోపేతం చేసేందుకు బ్రహ్మకుమారీలతో ఎంవోయూ కుదుర్చుకున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2026 7:52PM by PIB Hyderabad
ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత సమాజాన్ని ప్రోత్సహించడానికి, మాదక ద్రవ్యాల నివారణపై అవగాహనను, యువ సాధికారతను, సామాజిక కార్యక్రమాలను బలోపేతం చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ విభాగం పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్)కు, ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. 2026 సెప్టెంబర్ 18న రాజస్థాన్‌లోని మౌంట్ అబులో ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన నషా ముక్త భారత్ (మాదక ద్రవ్య రహిత భారత్) లక్ష్య సాధనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నిరంతర అవగాహన, యువత భాగస్వామ్యం, సమాజ భాగస్వామ్యం ద్వారా నషా ముక్త భారత్ అభియాన్ ఆశయాలకు ఈ కార్యక్రమం తోడ్పాటును అందిస్తుంది.

మౌంట్ అబులో సంతకాలు చేసిన ఎంవోయూతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, బ్రహ్మకుమారీల ప్రతినిధులు
గ్వాలియర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, నార్కోటిక్స్ కమిషనర్ డాక్టర్ దినేష్ కుమార్ బిసెన్ సమక్షంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ డిప్యూటీ నార్కోటిక్స్ కమిషనర్ శ్రీ నరేష్ బుందెల్, బ్రహ్మకుమారీస్ మెడికల్ విభాగం కార్యదర్శి డాక్టర్ బనార్సిలాల్ సాహ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

2026, సెప్టెంబర్ 18న మౌంట్ అబులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, బ్రహ్మ కుమారీస్ మధ్య ఎంవోయూ సంతకాల కార్యక్రమం.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు ప్రాధాన్యమిస్తూ.. మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన ప్రచారాలు, యువ సాధికారత, సామాజిక ప్రచార కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ, అమలు, సమీక్షకు అవసరమైన ఓ సహకార విధానాన్ని ఈ ఎంవోయూ అందిస్తుంది. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోఫిక్ పదార్థాల వల్ల ఎదురయ్యే హానికర ప్రభావాలపై విలువ ఆధారిత విద్య, అవగాహనపై ఈ సహకారం దృష్టి సారిస్తుంది. అలాగే వ్యసనానికి బానిసలుగా మారిన వ్యక్తులకు అందుబాటులో ఉన్న కౌన్సిలింగ్, రికవరీ, చికిత్సా మార్గాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.
ఈ అవగాహన ఒప్పందం ప్రకారం సీబీఎన్ చేపడుతున్న యువ రక్ష కార్యక్రమం పరిధిలో నిర్వహించే సెమినార్లు, సింపోజియంలు, ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు, మల్టీమీడియా ప్రదర్శనలు, అవగాహన ర్యాలీలు, పోస్టర్-డిజైన్ పోటీలు, డిజిటల్ అవగాహన కార్యక్రమాలకు ఉభయపక్షాలు మద్దతు ఇస్తాయి. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, హాస్టళ్లు, కోచింగ్ కేంద్రాలు, వృత్తిపరమైన శిక్షణా సంస్థలతో పాటు వ్యవసాయం, సాంప్రదాయ సాగు ప్రాంతాల్లోని గ్రామీణ సమాజాలు, యువతపై ప్రత్యేక దృష్టి సారించాలని భావిస్తున్నారు.
మెడిటేషన్, ప్రాణాయామం, సానుకూలంగా ఆలోచించడం, స్వీయ భావోద్వేగ నియంత్రణతో సహా జీవన నైపుణ్యాలు, ఒత్తిడిని అధిగమించడం, సమగ్ర ఆరోగ్య కార్యక్రమాలను కూడా ఈ ఒప్పందం అందిస్తుంది. తమ కేంద్రాలు, సెమినార్ వేదికలు, వాలంటీర్లు, శిక్షణా నిపుణులు, ఆధ్యాత్మిక సలహాదారుల ద్వారా ఈ కార్యక్రమానికి మద్దతు బ్రహ్మకుమారీల మద్దతు ఉంటుంది. తమ సంస్థాగత, డిజిటల్ వేదికల ద్వారా యువ రక్ష ప్రచారాన్ని చేపడుతుంది.

మౌంట్ అబులో నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, నార్కోటిక్స్ కమిషన్ డాక్టర్ దినేష్ కుమార్ బిసెన్
ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, నార్కోటిక్స్ కమిషనర్ డాక్టర్ దినేష్ కుమార్ బిసెన్ మాట్లాడారు. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నివారించడంలో సామూహిక, సమాజ ఆధారిత ప్రయత్నాల ప్రాముఖ్యాన్ని ఆయన వివరించారు. నివారణ అవగాహన కోసం యువత, విద్యా సంస్థలు, సమాజాలతో నిరంతర సంప్రదింపులు అవసరమన్నారు. నివారణ అవగాహన, యువత భాగస్వామ్యం కోసం సీబీఎన్ నిర్వహిస్తున్న ‘‘ఆపరేషన్ యువ రక్ష’’ గురించి సమాచారాన్ని ఆయన పంచుకున్నారు. ఈ కార్యక్రమం పరిధిలో సెమినార్లు, సింపోజియంలు, ఇంటరాక్టివ్ సెషన్లు, అవగాహన ర్యాలీలు, పోస్టర్ డిజైన్ పోటీలు, డిజిటల్ ప్రచారాల ద్వారా పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ కేంద్రాలు, ఇతర యువ కేంద్రీకృత వేదికల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. యువ రక్ష కార్యక్రమం ద్వారా విద్యార్థులను, యువ నిపుణులను స్వచ్ఛంద రాయబారులుగా, పీర్ ఎడ్యుకేటర్లుగా అభివృద్ధి చేయాల్సిన ప్రాధాన్యాన్ని కూడా ఆయన తెలియజేశారు.

మౌంట్ అబులో అవగాహన, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న సిబ్బంది
ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత జీవనశైలికి తోడ్పాటును అందించడంలో విలువ ఆధారిత విద్య, స్వీయ అవగాహన, సానుకూల ఆలోచనలు, రాజయోగ మెడిటేషన్, ఒత్తిడిని అధిగమించడం, భావోద్వేగ ఆరోగ్యం పోషించే పాత్రను బ్రహ్మకుమారీల ప్రతినిధులు వివరించారు. ఈ సంస్థ తన యువజన విభాగాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళా వేదికలు, సామాజిక నాయకులను కూడా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేలా సమీకరిస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం, జాతీయ, అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక కార్యక్రమాలు, వాలంటీర్లకు అవగాహన కల్పించడం, సామర్థ్య నిర్మాణానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. కార్యకలాపాలు స్వచ్ఛందమైనవిగా, అవగాహన పెంచేవిగా, సమ్మిళితంగా, ఎలాంటి నియంత్రణలు లేకుండా కొనసాగుతాయి. అవగాహన, విద్య, స్ఫూర్తినందించే, సమాజ ఆధారిత కార్యకలపాల్లో బ్రహ్మకుమారీస్ సభ్యులు పాల్గొంటారు. అమలు, దర్యాప్తు, పోలీసు విధులను వారు నిర్వహించరు.
మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో నిరంతర అవగాహన కల్పించేందుకు, యువతను భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ ఎంవోయూ సహకారాత్మక ప్రయత్నంగా పనిచేస్తుంది. దీనికోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌కు ఉన్న చట్టబద్ధమైన అనుభవాన్ని, నివారణ అవగాహన బాధ్యతలను బ్రహ్మకుమారీలకున్న విస్తృతమైన సామాజిక నెట్‌వర్కును, వాలంటీర్ల సామర్థ్యాన్ని, సామాజిక–ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమన్వయం చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2313462)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6