గనుల మంత్రిత్వ శాఖ
కీలక ఖనిజాల భద్రత కోసం మరింత పటిష్ఠ రీసైక్లింగ్, ఆవిష్కరణలు, ప్రజా భాగస్వామ్యం అవసరం: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2026 7:24PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని హయత్ రీజెన్సీ వేదికగా భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వశాఖ, మెటీరియల్స్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఆర్ఏఐ)లు సంయుక్తంగా నిర్వహించిన “భారత కీలక ఖనిజాల రీసైక్లింగ్ వ్యవస్థ – సర్క్యులర్ ఎకానమీ” జాతీయ సదస్సును కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు.
దేశంలోని కీలక ఖనిజాల రీసైక్లింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం, సర్క్యులర్ ఎకానమీని ముందుకు తీసుకెళ్లడంపై చర్చించడానికి విధాన రూపకర్తలు, పారిశ్రామిక నాయకులు, రీసైక్లర్లు, నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు, ఇతర భాగస్వాములు సమావేశమయ్యారు.

సమావేశంలో శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ... భారత పరిశుద్ధ ఇంధన పరివర్తన, రక్షణ సన్నద్ధత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అధునాతన తయారీ రంగాలకు కీలక ఖనిజాల రీసైక్లింగ్‌ల వ్యూహాత్మక ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. కాలం చెల్లిన ఉత్పత్తుల నుంచి కీలక ఖనిజాల పునరుద్ధరణను ప్రోత్సహించడానికి, దేశీయ రీసైక్లింగ్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, అంకుర సంస్థల మధ్య మరింత సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

నూతన సాంకేతికతలు, వ్యవస్థాపన, ఇ-వ్యర్థాల బాధ్యతాయుత నిర్వహణ, పర్యావరణ సుస్థిరతల ఆవశ్యకతను కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రజా భాగస్వామ్య ప్రాముఖ్యాన్ని స్పష్టం చేస్తూ... కీలక ఖనిజాల పునరుద్ధరణ కోసం ఇ-వ్యర్థాలు, కాలం చెల్లిన ఉత్పత్తులను విలువైన వనరులుగా చూడాలని ఆయన పౌరులను కోరారు. వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా... సాంకేతికత ఆధారితమైన, సుస్థిరమైన రీసైక్లింగ్ వ్యవస్థ దిశగా ఆలోచనలను పంచుకుంటూ, సమష్టిగా కృషి చేయాలని ఆయన పరిశ్రమలు, కంపెనీలు, పరిశోధకులకు పిలుపునిచ్చారు.
బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దుబే మాట్లాడుతూ... వనరుల సామర్థ్యాన్ని ప్రోత్సహించడం, సర్క్యులర్ ఎకానమీ, స్వయం సమృద్ధి గల వ్యవస్థను నిర్మించడం కోసం కీలక ఖనిజాల పునరుద్ధరణ, రీసైక్లింగ్ సామర్థ్యాలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు. విస్తృత ప్రజా భాగస్వామ్యం, గ్రామ స్థాయిలో ప్రచారం ద్వారా వ్యర్థాల బాధ్యతాయుత నిర్వహణ, ఇ-వ్యర్థాల రీసైక్లింగ్‌పై అవగాహనను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. తద్వారా పునర్వినియోగించదగిన వనరులు అధికారిక రీసైక్లింగ్ వ్యవస్థలోకి చేరేలా చూడాలని శ్రీ సతీష్ చంద్ర దుబే సూచించారు.
గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ కేశవ్ చంద్ర మాట్లాడుతూ... పరిశుద్ధ ఇంధన సాంకేతికతలు, అధునాతన తయారీ, ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాల్లో కీలక ఖనిజాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను వివరించారు. అన్వేషణ, ప్రాసెసింగ్, పునరుద్ధరణ, రీసైక్లింగ్‌లను కవర్ చేసే పటిష్ఠమైన దేశీయ వ్యవస్థ అవసరాన్నీ ఆయన ఉద్ఘాటించారు.

ఇ-వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర వాడుకలో లేని వస్తువులు కీలక ఖనిజాల పునరుద్ధరణ కోసం ముఖ్యమైన ద్వితీయ వనరులుగా ఉపయోగపడతాయన్నారు. వాటి ద్వారా వనరుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రాథమిక వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం, సర్క్యులర్ ఎకానమీకి మద్దతునివ్వడం సాధ్యపడుతుందని శ్రీ కేశవ్ చంద్ర పేర్కొన్నారు. భారత కీలక ఖనిజ భద్రత బలోపేతం కోసం... భాగస్వాములు స్పష్టమైన బాధ్యతలు, నిర్దిష్ట కాలపరిమితులతో సమన్వయం, కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
సెమినార్ సందర్భంగా కేంద్ర మంత్రులు కీలక ఖనిజాల పునరుపయోగ వ్యవస్థపై భావన పత్రాన్నీ ఆవిష్కరించారు. ఇది వనరుల సామర్థ్యం, ద్వితీయ వనరుల నుంచి పునరుద్ధరణ, సర్క్యులర్-స్వయం సమృద్ధ వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి సారించి, దేశంలో కీలక ఖనిజాల పునరుపయోగాన్ని బలోపేతం చేసే ఒక వ్యూహాత్మక ప్రణాళికను వివరిస్తుంది.
ఈ సదస్సులో ముఖ్యంగా కీలక ఖనిజాల రీసైక్లింగ్, ఇ-వ్యర్థాల సేకరణ, లిథియం-అయాన్ బ్యాటరీల నుంచి లోహాల రికవరీ, బ్లాక్ మాస్ ఎగుమతి, నాన్-ఫెర్రస్ లోహాల రీసైక్లింగ్, కీలక ఖనిజాలు, నాన్-ఫెర్రస్ లోహాల రీసైక్లింగ్ రంగానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు మొదలైన అంశాలపై చర్చించారు. ఈ చర్చల్లో సాంకేతిక పురోగతి, పరిశోధనాభివృద్ధి, ఇ-వ్యర్థాల సేకరణ, లిథియం-అయాన్ బ్యాటరీలు, ఇతర కాలం చెల్లిన (ఈవోఎల్) వస్తువుల నుంచి కీలక ఖనిజాలను వెలికితీయడం, బ్లాక్ మాస్ ప్రాసెసింగ్, రీసైక్లింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన విధానపరమైన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
వనరుల సుస్థిర వినియోగం కోసం కేంద్ర గనుల మంత్రిత్వశాఖ చేపడుతున్న విస్తృత ప్రయత్నాల్లో భాగంగా... ఇ-వ్యర్థాల బాధ్యతాయుత నిర్వహణ, రీసైక్లింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 'స్పెషల్ క్యాంపెయిన్ 6.0', 'స్వచ్ఛత హీ సేవా' కార్యక్రమంలో భాగంగా... ఇ-వ్యర్థాల పట్ల అవగాహన పెంచడం, వాటిని బాధ్యతాయుతంగా డిస్పోజ్ చేయడం, క్రమబద్ధమైన రీసైక్లింగ్ వ్యవస్థలోకి చేర్చడాన్ని మంత్రిత్వశాఖ ప్రోత్సహిస్తోంది. సర్క్యులర్ ఎకానమీ, వనరుల సామర్థ్యం, కీలక ఖనిజాలతో కూడిన విలువైన పదార్థాల సుస్థిర నిర్వహణపై మంత్రిత్వశాఖ విస్తృత లక్ష్యాలకు ఈ ప్రయత్నాలు తోడ్పాటునందిస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2313257)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10