సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పారిశుధ్య పనుల నుంచి ఆర్థిక భద్రత దాకా: కర్నాటి శ్రీనివాసరావు ప్రయాణం

నాడు పోస్టు చేయడమైనది: 21 SEP 2026 4:34PM by PIB Hyderabad

సరసమైన రుణాల లభ్యత, మూలధన రాయితీ, యాంత్రిక పారిశుధ్య పరికరాలు... సురక్షితమైన, మరింత గౌరవప్రదమైన పనిని ప్రోత్సహిస్తూనే, సుస్థిరమైన జీవనోపాధి అవకాశాలనూ సృష్టించగలవు. లేని పక్షంలో పరిమిత విద్య, తక్కువ ఆదాయం కారణంగా పెరుగుతున్న గృహ ఖర్చులను భరించడం, ఆర్థిక భద్రతను నిర్మించుకోవడం పారిశుధ్య కార్మికులకు కష్టమవుతుంది.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 53 ఏళ్ల పారిశుధ్య కార్మికుడు కర్నాటి శ్రీనివాసరావు, 'నమస్తే' (NAMASTE) పథకంలోని 'స్వచ్ఛతా ఉద్యమి యోజన' కింద అందిన సహాయంతో తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నారు. నలుగురు ఇతర సభ్యులతో కూడిన ఒక సమూహ ప్రాజెక్ట్ ద్వారా లభించిన మద్దతుతో, ఆయన ఇప్పుడు నెలకు సుమారు రూ. 10,000 అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

చిన్నతనంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా శ్రీ రావు ఆరవ తరగతి తర్వాత చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. 2008లో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికుడిగా చేరి రూ. 2500 నెల జీతంతో కెరీర్‌ ప్రారంభించారు. ఆయన తన కుటుంబానికి మద్దతునివ్వడానికి కట్టుబడి ఉన్నారు. పరిమిత విద్యార్హతలు... ఆయనకు ఇతర ఉపాధి అవకాశాలు, అధిక సంపాదనలను నిరోధించాయి.

 

గృహ నిర్వహణ ఖర్చులు, చదువు సంబంధిత వ్యయాలు, అనుకోని ఖర్చులు పెరగడంతో... ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం ఆయనకు కష్టంగా మారింది. ఆయన భార్య గృహిణి కావడంతో, ఆ కుటుంబం ప్రధానంగా ఆయన సంపాదనపైనే ఆధారపడేది. కాలక్రమేణా ఆయన నెలవారీ ఆదాయం సుమారు రూ. 22,500కు పెరిగినప్పటికీ, రోజువారీ ఖర్చులను భరిస్తూనే భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం సవాలుగా మారింది. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, అత్యవసర పరిస్థితులను మరింత ధీమాతో ఎదుర్కోవడానికి వీలుగా అదనపు ఆదాయ వనరును సమకూర్చుకోవాలని శ్రీ రావు ఆశించారు.

శ్రీ రావు, మరో నలుగురు సభ్యులు కలిసి 21 ఆగస్టు 2025న గుల్ఫర్ 8 కేఎల్ డెస్లడ్జింగ్ వాహనాన్ని కొనుగోలు చేసే ఒక గ్రూప్ ప్రాజెక్ట్ కోసం స్వచ్ఛతా ఉద్యమి యోజన కింద సహాయం అందుకున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 50 లక్షలు. ఈ ఆర్థిక సహాయంలో రూ. 31.25 లక్షల రుణం, రూ. 18.75 లక్షల ముందస్తు మూలధన సబ్సిడీ భాగంగా ఉన్నాయి. ఈ సహాయం వల్ల ఆ గ్రూప్ యాంత్రిక పారిశుధ్య సేవలను చేపట్టడానికి, అదనపు, స్థిరమైన జీవనోపాధిని అభివృద్ధి చేసుకోవడానికి వీలు కలిగింది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా, శ్రీ రావు తన సాధారణ ఉద్యోగం ద్వారా పొందే ఆదాయానికి అదనంగా నెలకు సుమారు రూ. 10,000 సంపాదిస్తున్నారు. దీనివల్ల ఆయన మొత్తం నెలవారీ ఆదాయం సుమారు రూ. 22,500 నుంచి రూ. 32,500కు పెరిగింది. ఈ అదనపు ఆదాయం ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, ఇంటి ఖర్చులను మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకోవడం, భవిష్యత్తు కుటుంబ అవసరాల కోసం పొదుపు చేయడం ప్రారంభించడంలో ఆయనకు సహాయపడింది.

శ్రీ రావు ఈ రోజు తన కుటుంబం కోసం మరింత సురక్షితమైన, గౌరవప్రదమైన భవిష్యత్తు వైపు పయనిస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు అందించే ఆర్థిక సహాయం, యాంత్రిక పారిశుధ్య పరిష్కారాలు జీవనోపాధిని ఎలా బలోపేతం చేయగలవో ఆయన అనుభవం నిరూపిస్తుంది. నమస్తే పథకం కింద ఉన్న స్వచ్ఛతా ఉద్యమి యోజన... ఆయన జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి, పొదుపు చేసుకోవడానికి, భవిష్యత్తుపై కొత్త నమ్మకాన్ని పెంచుకోవడానికి వీలు కల్పించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2313248) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Kannada