బొగ్గు మంత్రిత్వ శాఖ
ఇంధనం.. ఖనిజాలు.. అత్యాధునిక పదార్థాలు.. పరిశోధన-అభివృద్ధి రంగాల్లో సాంకేతికతాధారిత వైవిధ్యీకరణ బాటలో కోల్ ఇండియా
వ్యూహాత్మక కార్యక్రమాల జాబితాలో బొగ్గును వాయువుగా మార్చే ప్రక్రియ.. థర్మల్ విద్యుత్తు.. పునరుత్పాదక ఇంధనాలు-నిల్వ.. కీలక ఖనిజాలు.. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి
నాడు పోస్టు చేయడమైనది:
20 SEP 2026 11:31AM by PIB Hyderabad
కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) తన సంప్రదాయ బొగ్గు తవ్వకం కార్యకలాపాలకు మరింత వైవిధ్యం, సాంకేతికతలను జోడిస్తూ భిన్న రంగాలకు విస్తరిస్తోంది. ఈ మేరకు ఇంధనం, ఖనిజాలు, అత్యాధునిక పదార్థాలు, పరిశోధన-అభివృద్ధి రంగాల్లో వ్యాపారాభివృద్ధి కోసం 5 వేదికల పరస్పర బలోపేతం దిశగా పయనిస్తోంది. ఈ జాబితాలో బొగ్గు గ్యాసిఫికేషన్ (వాయువుగా మార్చడం)-రసాయనాల వెలికితీత, థర్మల్ విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనం-నిల్వ; కీలక ఖనిజాలు, అత్యాధునిక పదార్థాలు, ఇనుము సహా వైవిధ్య ఖనిజాలు ఉన్నాయి.
ఇందులో భాగంగా ఇప్పటికే జాతీయ స్థాయి ప్రాజెక్టులు పురోగమనంలో ఉన్నాయి. వీటిలో బొగ్గు నుంచి రసాయనాల వెలికితీత సంబంధిత 4 కార్యక్రమాల కింద సుమారు ₹69,346 కోట్లు, చంద్రాపురలో 2×800 మెగావాట్ల అల్ట్రా-సూపర్‌క్రిటికల్ థర్మల్ కేంద్రం విస్తరణ, సుమారు 550 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం, గ్రిడ్ స్థాయి బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ (బీఈఎస్‌ఎస్) కార్యక్రమాలను చేపట్టింది. దీంతోపాటు కీలక ఖనిజాలు, అంతిమ ఉత్పత్తుల పరంగానూ అవకాశాలున్నాయి.
వ్యూహాత్మక నేపథ్యం.. వ్యాపారాభివృద్ధి
దేశవ్యాప్తంగా సీఐఎల్ విస్తృతి, మైనింగ్-ప్రాజెక్టుల అభివృద్ధి అనుభవం, ప్రభుత్వ సంబంధాలు, భూమి-బొగ్గు వనరులు, కొనుగోలు వ్యవస్థలు, బ్యాలెన్స్ షీట్, భాగస్వామ్య సామర్థ్యం వంటివి సంస్థ వైవిధ్యీకరణకు బలమైన వేదికగా నిలుస్తాయి. “నిర్దిష్ట ప్రయోజన వైవిధ్యీకరణ” మార్గనిర్దేశం సూత్రంతో వాణిజ్య స్థిరత్వం-ముప్పుల సర్దుబాటుతో రాబడులను కొనసాగిస్తుంది. అలాగే, ఇంధన-ఖనిజ భద్రత, దిగుమతి ప్రత్యామ్నాయం, స్వదేశీ సాంకేతికత, స్వల్ప కర్బన ఆధారిత వృద్ధి, ప్రభుత్వ-స్వీయ ఆస్తుల సమర్థ వినియోగం, పునరుత్థాన తయారీ రంగానికి మద్దతిస్తుంది.
బొగ్గు గ్యాసిఫికేషన్.. బొగ్గు నుంచి రసాయనాలు.. భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్
గ్యాసిఫికేషన్ ప్రక్రియ కింద బొగ్గును సింథసిస్ గ్యాస్ లేదా సింగాస్‌గా మారుస్తారు. దీనితో సింథటిక్ నేచురల్ గ్యాస్ (ఎస్‌ఎన్‌జీ), అమ్మోనియా, యూరియా, అమ్మోనియం నైట్రేట్, మెథనాల్ వంటి రసాయనాలను ఉత్పత్తి చేయవచ్చు. ఈ సాంకేతికత ద్వారా దిగుమతి ప్రత్యామ్నాయానికి తోడ్పాటు సహా బొగ్గు నుంచి రసాయనాల వెలికితీత సాధ్యమవుతుంది.
బొగ్గు నుంచి రసాయనాల వెలికితీత కోసం సీఐఎల్ పరిధిలో యొక్క నాలుగు ప్రధాన ప్రాజెక్టులున్నాయి: 1. తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్.. అంచనా వ్యయం ₹19,062.22 కోట్లు.. 1.27 ఎంఎంటీపీఏ యూరియా ఉత్పాదక సామర్థ్యం. 2. భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్.. అంచనా వ్యయం ₹25,015.89 కోట్లు.. 0.66 ఎంఎంటీపీఏ అమ్మోనియం నైట్రేట్ ఉత్పాదక సామర్థ్యం. 3. కోల్ గ్యాస్ ఇండియా లిమిటెడ్.. అంచనా వ్యయం ₹13,052.81 కోట్లు.. ఏటా 633.6 మిలియన్ ఎన్‌ఎం³ ఎస్‌ఎన్‌జీ సామర్థ్యం. 4. చంద్రాపూర్‌లో బొగ్గు నుంచి ఎస్‌ఎన్‌జీ ఉత్పత్తికి సీఐఎల్-బీపీసీఎల్ సంయుక్త ప్రాజెక్టు.. అంచనా వ్యయం ₹12,214.86 కోట్లు.. ఉత్పాదనలో 633.6 మిలియన్ ఎన్‌ఎం³ మేర వార్షిక సామర్థ్యం.
అధిక బూడిదగల భారత బొగ్గుకు తగినట్లు ప్రక్రియలను వైవిధ్యీకరించడం ఈ కార్యక్రమాల సాంకేతిక ప్రాథమ్యాలలో ఒకటి. అంతేకాకుండా ప్రక్రియ గరిష్ఠీకరణ, కీలక పరికరాల స్థానికీకరణ, అత్యాధునిక నియంత్రణ, డిజిటల్ ట్విన్స్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, జలవనరులు, బూడిద-ఉద్గారాల మెరుగైన నిర్వహణ ఇందులో అంతర్భాగంగా ఉంటాయి. డేటా-వాణిజ్య సామర్థ్యం ధ్రువీకరణ అనంతరం మాత్రమే ప్రాజెక్టుల అనుసరణ చర్యలు చేపడతారు.
భూగర్భంలో గల లేదా ఇతరత్రా తవ్వకం వీలుకాని బొగ్గును ‘భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్’ (యూసీజీ) ప్రక్రియ ‘సింగాస్’గా మార్చగలదు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో ఈ సాంకేతికత ఇంకా వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) పరిధఙలోని ‘కాస్టా వెస్ట్ బ్లాక్’ (గనుల)లో ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును సీఐఎల్ దశలవారీగా చేపట్టింది. ఇందులో తొలి దశ 2025 మే 31న పూర్తికాగా, రెండో దశ అదే ఏడాది జూన్ 20న ప్రారంభమైంది. దీనికింద సమగ్ర ఇంజినీరింగ్, డైరెక్షనల్ డ్రిల్లింగ్, ఇంజెక్షన్, ఉత్పత్తి బావులు, ఇగ్నిషన్-నియంత్రణ వ్యవస్థలుండగా, ఇది ఈ ఏడాది (2026)లోగా పూర్తి కావాల్సి ఉంది.
థర్మల్ విద్యుత్తు.. ఉపరితల.. జలోపరితల సౌరశక్తి
సీఐఎల్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) సంస్థలు ప్రతిపాదిత 50:50 నిష్పత్తితో సంయుక్తంగా జార్ఖండ్‌లోని చంద్రాపురాలో 2×800 మెగావాట్ల అల్ట్రా-సూపర్ క్రిటికల్ ప్రాజెక్టు విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తు విక్రయ కార్యకలాపాలకు డీవీసీ సమన్వయం చేస్తుంది. భవిష్యత్తులో అధిక-పొదుపుతో ఉత్పాదన, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, ఫ్లెక్సిబుల్ ప్లాంట్ ఆపరేషన్, ఉద్గార నియంత్రణ, జలల పునరుపయోగం, బూడిద శాస్త్రీయ వినియోగం తదితరాలపై దృష్టి సారిస్తారు.
ఇక సౌరశక్తి ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 550 మెగావాట్ల సామర్థ్యంతో ఉత్పాదనను సీఐఎల్ ప్రారంభించింది, దీనికితోడు పైకప్పుల మీద, భూ ఉపరితలంపైన, స్వతంత్ర, అంతర్రాష్ట్ర, మార్కెట్-సంధానిత ప్రాజెక్టులు పురోగమనంలో ఉన్నాయి. సౌరశక్తి విషయంలో సీఐఎల్ రెండు పద్ధతులను అనుసరిస్తోంది. వీటిలో ఒకటి- విద్యుతుద్పాన వ్యయాన్ని, కర్బన ఉద్గారాలను తగ్గించే స్వతంత్ర ప్రాజెక్టులు. మరొకటి వాణిజ్య పునరుత్పాదక-విద్యుదుత్పాదన కోసం వినియోగ స్థాయి ప్రాజెక్టులు.
వనరుల నాణ్యత, ప్రసారం, భూమి లభ్యత, నిల్వ, కోత, కొనుగోలు-సరఫరా వ్యయం తదితరాల సంబంధిత ‘లైఫ్‌సైకిల్’, ముప్పు ప్రాతిపదికగల అంచనాలపై సౌరశక్తి ప్రాజెక్టుల ఎంపిక ఆధారపడి ఉంటుంది. డిజిటల్ పర్యవేక్షణ, హైబ్రిడ్ నిల్వ పరిష్కారాలు వంటివి ప్రాజెక్టు సామర్థ్యానికి, కార్యాచరణ సౌలభ్యానికి తోడ్పడతాయి.
గోరఖ్‌పూర్‌లోని చిల్వా తాల్ వద్ద 20 మెగావాట్ల ఏసీ గ్రిడ్-కనెక్టెడ్ జలోపరితల సౌరశక్తి ప్రాజెక్టును కూడా సీఐఎల్ ఏర్పాటు చేస్తోంది. జలాశయాలకు అనువైన ఈ సౌరశక్తి భూ ఉపరితల ఉత్పాదనతో పోలిస్తే చౌకగా ఉంటుంది. అయితే- నీటి మట్టాలు, బాతిమెట్రీ, గాలి-అలలు, యాంకరింగ్, తుప్పు, నిర్వహణ, భద్రత, పర్యావరణ సంబంధిత ముప్పుల నివారణ దిశగా ప్రాదేశిక నిర్దిష్ట అంచనా, ప్రామాణిక తనిఖీ ప్రక్రియలు అవసరం.
బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థలు
పునరుత్పాదక-ఇంధనాల ఏకీకరణ, గరిష్ఠ డిమాండ్ నిర్వహణ, గ్రిడ్ సారళ్యం, మెరుగైన ప్రసారం-వినియోగానికి బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థలు (బీఈఎస్‌ఎస్) మద్దతిస్తాయి. దీనికి సంబంధించి సీఐఎల్ కార్యక్రమాలలో తెలంగాణలోని చౌటుప్పల్ వద్ద ‘టీజీజెన్‌కో’ ఒక కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇది 187.5 మెగావాట్లు, 750 మెగావాట్-గంటల సామర్థ్యం, 4 గంటల వ్యవధితో ఈ ప్రాజెక్టును సీఐఎల్ చేపడుతోంది. అయితే, ఈపీసీ ఎంపిక, దీర్ఘకాలిక కార్యకలాపాల నిర్వహణ ఏర్పాట్లు పురోగమనంలో ఉన్నాయి.
ఒడిశాలోని నాలుగు ప్రదేశాలలో 80 మెగావాట్లు/320 మెగావాట్-గంటల సామర్థ్యంతో, నాలుగు గంటల వ్యవధి గల బీఈఎస్‌ఎస్ ప్రాజెక్టులను కూడా సీఐఎల్ రూపొందిస్తోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ద్వారా సరఫరా సామర్థ్యం సమకూర్చుకోనుండగా, ఈపీసీ టెండర్ కూడా జారీ అయింది. అయితే, విస్తృత లభ్యత సహా విశ్వసనీయ ఇంధన నిల్వ-నిర్వహణ, పర్యవేక్షణ మాత్రమే కాకుండా సరఫరా నిబంధనలకు అనుగుణంగా ఉండటం, ప్రగతి సాధనకు తగిన ఆధునిక ప్రణాళిక తదితరాలపై వాణిజ్యపరంగా బీఈఎస్‌ఎస్ ప్రాజెక్టుల వాణిజ్య విజయం ఆధారపడి ఉంటుంది.
కీలక ఖనిజాలు-సమీకృత గ్రాఫైట్ విలువ వ్యవస్థ
బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్, అత్యాధునిక తయారీ, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు కీలక ఖనిజాలు అత్యావశ్యకం. ‘సీఐఎల్’కు దేశీయంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని గ్రాఫైట్ ఆస్తులు సహా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని అరుదైన భూ మూలకాలు (ఆర్‌ఈఈ), అరుదైన లోహాల లభ్యత అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వనరుల నిర్ధారణ, జియోమెటలర్జీ, బెనిఫిషియేషన్, రికవరీ, ఉత్పత్తి స్పెసిఫికేషన్, వ్యర్థాల నిర్వహణ, మార్కెట్ సంధానం వంటివి ప్రధానంగా దృష్టి సారించాల్సిన రంగాలు. ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (ఐఆర్‌ఈఎల్), నాన్-ఫెర్రస్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ (ఎన్‌ఎఫ్‌టీడీసీ), కర్టిన్ యూనివర్సిటీ, హిందుస్థాన్ కాపర్, ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ఈ కృషి వేగం పుంజుకుంటోంది. విదేశీ అవకాశాలను దశలవారీ సాంకేతిక, ఆర్థిక వివేచన ప్రాతిపదికన మూల్యాంకనం చేస్తారు.
మరోవైపు మైనింగ్, బెనిఫిషియేషన్, ప్యూరిఫికేషన్, స్ఫెరోనైజేషన్, కోటింగ్, యానోడ్ మెటీరియల్స్ ఉత్పాదన సహిత సమీకృత గ్రాఫైట్ విలువ వ్యవస్థ ఏర్పాటుపై సీఐఎల్ లక్ష్యనిర్దేశం చేసుకుంది. ఎన్‌ఎఫ్‌టీడీసీ సహకారంతో 99.95 శాతం కనీసం స్వచ్ఛత గల కోటెడ్ స్ఫెరికల్ ప్యూరిఫైడ్ గ్రాఫైట్ (సీఎస్‌పీజీ) ఉత్పాదనకు ఒక ప్రదర్శనాత్మక ప్లాంటును అర్హత వేదికగా ప్రతిపాదించారు. అటుపైన సుస్థిర నాణ్యతతో ఉత్పత్తి, ప్రక్రియ సామర్థ్యం, వినియోగదారు ధ్రువీకరణలకు అనుగుణంగా వాణిజ్య స్థాయి ఉత్పత్తిని పెంచుతారు.
డిజిటల్-సంస్థాగత స్వరూపం
మైనింగ్, ప్రాసెస్ పరిశ్రమలు, విద్యుత్తు, పునరుత్పాదక శక్తి, గ్రిడ్ సేవలు, అత్యాధునిక పదార్థ రంగాలకు ఒక ఉమ్మడి డిజిటల్ స్వరూపం అవసరం. సురక్షిత ఎంటర్‌ప్రైజ్ డేటా రూమ్, ప్రామాణిక ప్రాజెక్టు ఆర్థిక నమూనాలు, జీఐఎస్ ఆధారిత అవకాశాల గుర్తింపు, ప్రాజెక్టు దశ, ఆమోదాలు, పెట్టుబడి, షెడ్యూల్, నష్టాలు, రాబడులపై పర్యవేక్షణకు సంబంధిత డాష్‌బోర్డులు సహా టెండర్ దశ నుంచి డిజిటల్ ఇంజనీరింగ్, ఆస్తి-సమాచార నిబంధనలు కూడా ఇందులో కీలకాంశాలుగా ఉంటాయి.
అవకాశాల పరిశీలన, భావన ధ్రువీకరణ, సాధ్యాసాధ్యాలు, కాంట్రాక్టులు, ప్రదర్శన, వాణిజ్య కార్యకలాపాలను ఒక సాధారణ స్టేజ్-గేట్ నమూనా విశ్లేషిస్తుంది. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, స్థానికీకరణ, అంచనా వేయదగిన ఫలితాలు, వ్యవధి నిర్దేశిత లక్ష్యాలపై దృష్టి సారిస్తూ, ప్రత్యేక సాంకేతికతలు, మార్కెట్లను అందిపుచ్చుకోవడంలో జాయింట్ వెంచర్లు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను సీఐఎల్ సద్వినియోగం చేసుకుంటుంది.
ముప్పు నిర్వహణ.. కీలక పనితీరు సూచీలు.. భవిష్యత్ కార్యాచరణ
ముప్పు నిర్వహణ ప్రక్రియ కోసం సీఐఎల్ ఒక చురుకైన, దశలవారీ విధానాన్ని అనుసరిస్తుంది. ఇందులో- సాంకేతిక-వనరుల పరమైన ముప్పులు, మార్కెట్-ఆర్థిక ముప్పులు, అమలు-వ్యయాల ముప్పులు, పర్యావరణ-సామాజిక-పాలన (ఈఎస్‌జీ) సహా సరఫరా-వ్యవస్థ ముప్పులు, సైబర్-కార్యాచరణ ముప్పులు, సామర్థ్యం-సంబంధిత ముప్పులు అంతర్భాగంగా ఉంటాయి.
ముప్పు ప్రతిస్పందనలలో ప్రయోగాత్మక ధ్రువీకరణ, స్వతంత్ర సమీక్ష, వినియోగదారు అర్హత ధ్రువీకరణ, కొనుగోలు ఏర్పాట్లు వంటివి ఉంటాయి. పటిష్ట వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్), తాత్కాలిక ప్రణాళికలు, జీవితచక్రం అంచనా-స్థానికీకరణ, కార్యాచరణ సాంకేతిక భద్రత, సంఘటనలపై ప్రతిస్పందన, లక్షిత శిక్షణ-జ్ఞాన బదిలీ వంటివి కూడా ఉంటాయి.
కీలక పనితీరు సూచీలలో- ప్రాజెక్ట్ సామర్థ్యం, కార్యాచరణ లభ్యత-నాణ్యత, మెగావాట్లలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, మెగావాట్ అవర్ పరంగా నిల్వ సామర్థ్యం, ఖనిజ వనరుల అభివృద్ధి, అంతిమ ఉత్పత్తుల అర్హత, దిగుమతి ప్రత్యామ్నాయం, స్వదేశీ సాంకేతికత, ముప్పు-సర్దుబాటు రాబడులు, నగదు రాబడులు, ఉద్గారాలు, నీరు, వ్యర్థాలు, పునరుద్ధరణ, భద్రత, సామాజిక ప్రభావ ఈఎస్‌జీ ఫలితాలు ఉంటాయి.
సాంకేతికత ఆధారిత వైవిధ్యీకరణ కోసం వ్యాపారాభివృద్ధి విభాగం ఎంటర్‌ప్రైజ్ ఇంటిగ్రేటర్‌గా పనిచేస్తుంది. అవకాశాల గుర్తింపు, భాగస్వామ్యాల ఏర్పాటు, సాంకేతికతల ధ్రువీకరణ, వాణిజ్య నమూనాల ఏర్పాటు, ఆమోద స్వీకణ ప్రాజెక్టుల క్రమబద్ధ అమలు వంటివి దీని బాధ్యతలలో భాగంగా ఉంటాయి. జవాబుదారీగా గల స్పాన్సర్లతో ఏకీకృత వైవిధ్యీకరణ-సాంకేతిక భవిష్య ప్రణాళికను రూపొందించడం, ప్రామాణిక సాంకేతిక, ఆర్థిక, ఈఎస్‌జీ మూల్యాంకన టెంప్లేట్లు, ముందుగా నిర్దేశించిన విజయ ప్రమాణాలు, స్వతంత్ర ధ్రువీకరణ సహిత ప్రదర్శన ప్రాజెక్టుల రూపకల్పన వంటివి తక్షణ ప్రాథమ్యాలలో ఉన్నాయి.
‘సీఐఎల్’లో పరిశోధన-అభివృద్ధి కార్యక్రమం…
పరిశోధనాభివృద్ధి-సాంకేతిక.. ఆవిష్కరణల వ్యవస్థ
‘సీఐఎల్’లో 1975లో ఏర్పాటైన ‘సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ’ 1994లో ఏర్పాటైన పరిశోధన-అభివృద్ధి బోర్డు, 2003లో ఏర్పాటైన అపెక్స్ కమిటీ దాకా ఈ పరిశోధన-అభివృద్ధి చట్రం రూపొందింది. ఈ చట్రం ఇప్పుడు 2026 నాటి స్వతంత్ర పరిశోధన-అభివృద్ధి విధానంతోపాటు మార్గదర్శకాల దాకా పరిణామశీలమైంది. ఇవి టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ (టీఆర్‌ఎల్) 4, అంతకన్నా ఎక్కువ గల ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తాయి.
గని ప్రణాళిక, ఉత్పాదకత, భద్రత, అన్వేషణ, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అత్యాధునిక మైనింగ్, పర్యావరణం-సుస్థిరత, వ్యర్థాల నుంచి అర్థం, టెక్నాలజీ ఆవిష్కరణ-స్వదేశీకరణ, బొగ్గు ప్రత్యామ్నాయ ఉపయోగాలు, పునరుత్పాదక ఇంధనం స్వచ్ఛమైన బొగ్గు, శుద్ధి-ఖనిజ శుద్ధి వగైరాలు ప్రధాన రంగాలలో భాగంగా ఉన్నాయి.
పరిశోధన-అభివృధ్ధి వ్యవహారాల సీఐఎల్ బోర్డు, ఆర్ అండ్ డి బోర్డు, అపెక్స్ కమిటీ, అనుబంధ సంస్థల స్థాయి ఆర్ అండ్ డి కమిటీల ద్వారా ప్రాజెక్ట్ విలువను బట్టి ఆమోదాలు లభిస్తాయి. సీఐఎల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సీఎస్‌ఐఆర్ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థలు, అనుబంధ సంస్థలు, ఇంక్యుబేషన్ కేంద్రాలు, అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను అనుసంధానించే హబ్ అండ్ స్పోక్ నెట్‌వర్క్ మద్దతుతో, నాసర్ (ఎన్‌ఏసీసీఈఆర్) ఒక స్వతంత్ర నోడల్ సంస్థగా, కేంద్రక కూడలిగా పనిచేస్తుంది.
సీఐఎల్ మద్దతుతో నడిచే ప్రధాన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్
సీఐఎల్ నిధులతో నడిచే ప్రధాన అత్యున్నత నైపుణ్య కేంద్రాలలో ఐఐటీ-మద్రాస్‌లోని ‘సీఐఎల్ సెంటర్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ’ ఒకటి. దీనికి ₹87.90 కోట్ల నిధుల లభ్యత ఉండటంతో ఇది సుస్థిర పదార్థాలు, గనుల పునరుపయోగం, ఇంధన మార్పడిపై దృష్టి సారిస్తుంది. అలాగే, ఐఐటీ-హైదరాబాద్‌లోని ‘క్లీన్జ్’కు ₹98 కోట్ల నిధుల మద్దతు ఉండగా, ఇది స్వచ్ఛ బొగ్గు సాంకేతికత, తక్కువ-గ్రేడ్ భారతీయ బొగ్గుపై దృష్టి సారిస్తుంది, ఐఐటీ-(ఐఎస్ఎం) ధన్‌బాద్‌లోని సీఐఎల్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ మైనింగ్, ₹67.45 కోట్ల నిధులతో మైనింగ్ 4.0, ఐఓటి, స్మార్ట్ మైన్స్, ఇమ్మర్సివ్ టెక్నాలజీస్, 5జిలపై దృష్టి సారిస్తుంది. ఐఐటి-(ఐఎస్ఎం) ధన్‌బాద్‌లోని సీఐఐ సెంటర్ ₹10 కోట్లలతో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ప్రోటోటైపింగ్, వర్చువల్ రియాలిటీ, సిమ్యులేషన్ సహా ఆటోమేషన్‌పైనా దృష్టి సారిస్తుంది.
పరిశోధన-అభివృద్ధి రంగం.. వ్యయం-విజయాలు
పరిశోధన-అభివృద్ధి రంగంలో ₹231 కోట్ల ఆమోదిత వ్యయంతో 20 వేర్వేరు ప్రాజెక్టులు ఉన్నాయి. అధిక ప్రభావం చూపే ఈ కార్యక్రమాలలో కాస్టా వెస్ట్‌లో యూసీజీ, ఓపెన్‌కాస్ట్-అండర్‌గ్రౌండ్ గనుల కోసం 5జి స్వతంత్ర నెట్‌వర్కులు, బైఫేషియల్ పెరోవ్‌స్కైట్ సోలార్ సెల్స్, కీలక ఖనిజాల కోసం కృత్రిమ మేధ, జియోఫిజికల్ అన్వేషణ వంటివి ఉన్నాయి.
ఇక 2023–24 ఆర్థిక సంవత్సరంలో పరిశోధన-అభివృద్ధి వ్యయం ₹61.31 కోట్లుకాగా, 2024–25లో ₹245.38 కోట్లు, 2025–26లో ₹183.88 కోట్లు. 2026–27లో ₹225 కోట్లు, 2027–28లో ₹350 కోట్లు, 2028–29కిగాను ₹400 కోట్లు, 2029–30కి ₹500 కోట్ల వంతున ప్రణాళికబద్ధ వ్యయం చేస్తారు.
ఈ నేపథ్యంలో 2026–27లో ఐదు పేటెంట్ల దాఖలు, మరో రెండు పేటెంట్ల ప్రక్రియ కొనసాగుతుండటం సంస్థ సాధించిన విజయాలలో కొన్ని, బైఫేషియల్ పెరోవ్‌స్కైట్ సోలార్ సెల్స్‌కు ఒక పేటెంట్ మంజూరు కాగా, వెలాసిటీ ఆఫ్ డిటోనేషన్ కొలత పరికరాల వాణిజ్యీకరణ కోసం సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, ట్రిపుల్ ఐటీ, రూర్కీ, ఐఐటీ- ఖరగ్‌పూర్‌తో కలిసి కొత్త సీఐఎల్ అత్యున్నత నైపుణ్య కేంద్రాల స్థాపనకు చర్చలు వంటివి ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మరింత ముందంజ వేయడం కోసం ‘నాసర్’ (ఎన్‌ఏసీసీఈఆర్)ను బలోపేతం చేయడం అవశ్యం. హబ్ అండ్ స్పోక్ వ్యవస్థ విస్తరణ, పరిశోధన నుంచి ఆచరణ దాకా ప్రక్రియలను వేగిరపరచడం, గ్యాసిఫికేషన్, భవిష్యత్ పదార్థాలు, బ్యాటరీల వంటి స్వదేశీ-భవిష్యత్ సంసిద్ధ సాంకేతికతలపై దృష్టి సారించడం కూడా అవసరం.
సంక్షిప్త సారాంశం
సంప్రదాయ బొగ్గు తవ్వకం సంస్థ స్థాయి నుంచి క్రమంగా వైవిధ్యభరిత ఇంధనం, ఖనిజాలు, మెటీరియల్స్, టెక్నాలజీ ఆధారిత సంస్థగా సీఐఎల్ పరిణామం చెందుతోంది. బొగ్గు గ్యాసిఫికేషన్, పొదుపైన విద్యుదుత్పాదన, పునరుత్పాదక ఇంధనం, బీఈఎస్‌ఎస్, కీలక ఖనిజాలు, అత్యాధునిక పదార్థాలు, పరిశోధన-అభివృద్ధి తదితర రంగాల్లో ఈ సంస్థక కార్యక్రమాలు ప్రస్తుత రూపాంతరీకరణకు విస్తృత పునాది వేస్తున్నాయి.
అటుపైన భవిష్యత్తులో సాంకేతిక ధ్రువీకరణ, స్వదేశీ సామర్థ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, క్రమబద్ధ పెట్టుబడులు, డిజిటల్ పాలన, పటిష్ట ముప్పు నిర్వహణ తదితరాల ద్వారా ఈ కార్యక్రమాల విస్తరణతోపాటు వాణిజ్యపరంగా నిలకడైన ఫలితాలు రాబట్టడంపై దృష్టి సారిస్తారు. నాసర్ సహా ఆర్ అండ్ డి, హబ్ అండ్ స్పోక్ వ్యవస్థల బలోపేతంతోపాటు పరిశోధన-ఆవిష్కరణల క్షేత్రస్థాయి అమలు మరింత వేగం పుంజుకుంటాయి.
విస్పష్ట దశలు, అంచనా వేయగల ఫలితాలు, జవాబుదారీతనంతో కూడిన అమలు ద్వారా సీఐఎల్ తన మైనింగ్ నైపుణ్యం, సంస్థాగత సామర్థ్యాలు, సాంకేతిక వ్యవస్థల సద్వినియోగంతో దేశ ఇంధన-ఖనిజ భద్రతకు తోడ్పడుతుంది. అలాగే, దిగుమతులకు ప్రత్యామ్నాయం, సాంకేతిక స్వావలంబనకు చేయూతనివ్వగలదు. అదే సమయంలో ఉజ్వల భవిష్యత్తు దిశగా నిలకడైన సరికొత్త వృద్ధి వేదికలను కూడా సృష్టించగలదు.
***
(రిలీజ్ ఐడి: 2312837)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2