పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సబ్సిడీపై ఇచ్చే గృహ ఎల్‌పీజీ సిలిండర్లకు అక్టోబర్‌ 1 నుంచి బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి

ఇప్పటికే ఆధార్‌ ధ్రువీకరణ పూర్తి చేసుకున్న. 27.43 కోట్ల మంది వినియోగదారులు (89.9 శాతం) ఎలాంటి అదనపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు

ఆధార్‌ ధ్రువీకరణను సిలిండర్‌ డెలివరీ సమయంలోనూ, గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్‌ షోరూమ్‌లో లేదా చమురు మార్కెటింగ్‌ సంస్థల (మొబైల్‌ యాప్‌ల ద్వారా పూర్తి చేసుకోవచ్చు

నాడు పోస్టు చేయడమైనది: 19 SEP 2026 7:42PM by PIB Hyderabad

సబ్సిడీ వర్తించే నియంత్రిత రిటైల్‌ విక్రయ ధర (ఆర్ఎస్పీ) కు గృహ ఎల్‌పీజీ సిలిండర్‌ రీఫిల్‌ బుక్‌ చేసుకోవాలంటే 2026 అక్టోబర్‌ ఒకటి నుంచి బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ (బీఏఏ) పూర్తి చేసి ఉండాలి.

బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ ద్వారా సబ్సిడీతో కూడిన ఎల్‌పీజీ నిజమైన, అర్హత కలిగిన కుటుంబాలకు మాత్రమే చేరేలా నిర్ధారించవచ్చు. ప్రతి గ్యాస్‌ కనెక్షన్‌ను ఆధార్‌ ధ్రువీకరించిన వినియోగదారుతో అనుసంధానం చేయడం వల్ల సబ్సిడీతో అందించే గృహ ఎల్‌పీజీ సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు మళ్లించడాన్ని అరికట్టడంతో పాటు నకిలీ, అనర్హమైన కనెక్షన్లను తొలగించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా సబ్సిడీ పంపిణీ మరింత పారదర్శకంగా నిర్దేశిత అర్హులకు మాత్రమే అందుతుంది. ఈ ప్రక్రియ అర్హత కలిగిన కుటుంబాలకు ఎల్‌పీజీని నిరాకరించడానికి ఉద్దేశించినది కాదు.  ప్రతి అర్హత కలిగిన వినియోగదారుడు ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేయడానికి పలు సులువైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

2026 అక్టోబర్‌ 1 నుంచి వచ్చే మార్పులు

  • ఇప్పటికే బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ  పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ ధ్రువీకరణ చేయాల్సిన అవసరం లేదు. వారికి సిలిండర్‌ సరఫరా ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది.

  • బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ పూర్తి చేయని వినియోగదారులకు ధ్రువీకరణ పూర్తయిన తర్వాత సబ్సిడీతో కూడిన నియంత్రిత రిటైల్‌ విక్రయ ధరకు రీఫిల్‌ బుకింగ్‌ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ ఎలా పూర్తి చేయాలి?

  • సిలిండర్‌ డెలివరీ సమయంలో: డెలివరీ సిబ్బంది అక్కడికక్కడే చమురు మార్కెటింగ్‌ సంస్థ మొబైల్‌ యాప్‌ ద్వారా ఆధార్‌ ధ్రువీకరణను పూర్తి చేయవచ్చు.

  • •డిస్ట్రిబ్యూటర్‌ షోరూమ్‌లో: వినియోగదారులు తమ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌ వద్దకు వెళ్లి అక్కడే ఆధార్‌ ధ్రువీకరణను పూర్తి చేసుకోవచ్చు.

  • చమురు మార్కెటింగ్‌ సంస్థల (ఓఎంసీ) మొబైల్‌ యాప్‌ల ద్వారా: వినియోగదారులు ఇంటి నుంచే స్వయంగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం:

  • ఇండేన్‌ వినియోగదారులకు: ఇండియన్ఆయిల్‌ వన్‌ యాప్‌

  • భారత్‌గ్యాస్‌ వినియోగదారులకు: హలోబీపీసీఎల్‌ యాప్‌

  • హెచ్‌పీ గ్యాస్‌ వినియోగదారులకు: హెచ్‌పీ పే యాప్‌

స్వయంగా ఈ - కేవైసీ పూర్తి చేసే విధానంపై వీడియో మార్గదర్శకాలు పీఎంయూవై పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి.

బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ పూర్తి చేయడానికి ఇష్టపడని వినియోగదారులకు అవకాశం

బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ పూర్తి చేయడానికి ఇష్టపడని లేదా పూర్తి చేయలేని వినియోగదారులు ఇప్పటికీ ఎల్‌పీజీ పొందవచ్చు. ఇందుకోసం తమ ఎంపికను సంబంధిత చమురు మార్కెటింగ్‌ సంస్థ డిజిటల్‌ వేదికల్లో నమోదు చేసుకోవాలి. వినియోగదారు వెబ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌, వాట్సాప్‌ చాట్‌బాట్‌, ఐవీఆర్ఎస్‌ లేదా అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా ఈ ఎంపికను నమోదు చేసుకోవచ్చు.

ఈ వినియోగదారులకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల వద్ద స్థానికంగా లభ్యమయ్యే నిల్వలకు లోబడి, ఎటువంటి రాయితీ లేకుండా మార్కెట్ ధరపై 5 కిలోలు లేదా 10 కిలోల సిలిండర్లలో ఎల్పీజీ సరఫరా చేస్తారు. 

ఇప్పటివరకు పురోగతి

2026 సెప్టెంబర్‌ 19 నాటికి 27.43 కోట్ల మంది  గృహ ఎల్‌పీజీ వినియోగదారులు బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ పూర్తి చేశారు. దీంతో మొత్తం వినియోగదారుల్లో 89.9 శాతం మంది ధ్రువీకరణ పూర్తి చేసినట్లయింది.

వినియోగదారులు 2026 జూన్‌ 30లోగా బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ ( పూర్తి చేయాలని తొలుత సూచించారు. వినియోగదారులకు మరింత సమయం కల్పించేందుకు తరువాత గడువును పలుమార్లు పొడిగించారు. తొలుత జూలై 31 వరకు, అనంతరం ఆగస్టు 7, ఆగస్టు 15, ఆగస్టు 23, ఆగస్టు 31, సెప్టెంబర్‌ 7 వరకు పొడిగించి, చివరగా 2026 సెప్టెంబర్‌ 14 వరకు గడువు ఇచ్చారు.

2023 అక్టోబర్‌ నుంచి చమురు మార్కెటింగ్‌ సంస్థలు దేశవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు 12 కోట్లకు పైగా ఎస్ఎంఎస్‌, వాట్సాప్‌ సందేశాలను పంపించాయి. బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ పూర్తి చేయని వినియోగదారులను గుర్తించి, డిస్ట్రిబ్యూటర్లు, డెలివరీ సిబ్బంది వ్యక్తిగతంగా సంప్రదించి ధ్రువీకరణ పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. డిస్ట్రిబ్యూటర్‌ కేంద్రాలు, అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌ సమయంలో ఐవీఆర్ఎస్‌ ద్వారా సూచనలు, మొబైల్‌ నోటిఫికేషన్లు, సామాజిక మాధ్యమాలు, వార్తాపత్రికలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా కూడా విస్తృతంగా అవగాహన కల్పించారు.

ఎల్‌పీజీ సబ్సిడీ వ్యయం

గృహ ఎల్‌పీజీని ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. 2026 సెప్టెంబర్‌లో 14.2 కిలోల సిలిండర్‌పై సబ్సిడీ సుమారు రూ.210గా ఉంది. 2026 జూన్‌లో ఇది ఒక్కో సిలిండర్‌కు రూ.721కు చేరుకుంది.

గృహ ఎల్‌పీజీని అందుబాటు ధరలో కొనసాగించేందుకు ప్రభుత్వం 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో చమురు మార్కెటింగ్‌ సంస్థలకు రూ.22,000 కోట్ల పరిహారం చెల్లించింది. 2025 - 26, 2026 - 27 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి రూ.30,000 కోట్లను చెల్లిస్తోంది. అయినప్పటికీ, 2026 ఆగస్టు 31 నాటికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలకు గృహ ఎల్‌పీజీ విక్రయాలపై పేరుకుపోయిన అండర్‌ రికవరీలు రూ.62,000 కోట్లను మించాయి. సబ్సిడీని నిజమైన, అర్హత కలిగిన వినియోగదారులకు మాత్రమే అందించడం ద్వారా దాన్ని దీర్ఘకాలం కొనసాగించేందుకు వీలు కలుగుతుంది.

అక్టోబర్‌ 1లోగా బీఏఏ పూర్తి చేయాలి

ఇప్పటివరకు బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ పూర్తి చేయని వినియోగదారులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న పై పేర్కొన్న ఏదైనా మార్గం ద్వారా 2026 అక్టోబర్‌ 1లోగా బీఏఏ పూర్తి చేయాలని కోరుతున్నారు.

ఎల్‌పీజీ సేవలకు సంబంధించిన సహాయం కోసం వినియోగదారులు టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1800 2333 555కు కాల్‌ చేయవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2312828) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , English , Urdu , Marathi , Malayalam