సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లో 20వ రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్
నియామక పత్రాలు అందుకున్న 221 అభ్యర్థులు
నాడు పోస్టు చేయడమైనది:
19 SEP 2026 5:40PM by PIB Hyderabad
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌లో 20వ రోజ్‌గార్ మేళాను కేంద్ర హోం వ్యవహారాల సహాయమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. హైదరాబాద్ జోన్, సెంట్రల్ టాక్స్, కస్టమ్స్ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ రోజ్‌గార్ మేళాలో 221 మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహించిన 20వ రోజ్‌గార్ మేళాలో మొత్తం 51,000 నియామక పత్రాలను అందజేసినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియజేస్తుందన్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన 19 రోజ్‌గార్ మేళా కార్యక్రమాల్లో మొత్తం 12.75 లక్షల నియామక పత్రాలను అందించినట్లు శ్రీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న సంకల్పం దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల సహాయమంత్రి తెలిపారు.
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన పట్ల ప్రభుత్వానికున్న నిబద్ధతను తెలియజేస్తూ... యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, వారికి మద్దతిచ్చేందుకు స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, సంక్షేమ పథకాలు, ఎన్నో ఇతర కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు.
కొత్తగా నియమితులైన అభ్యర్థులను శ్రీ బండి సంజయ్ కుమార్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించటం... ఎంతోమంది అభ్యర్థులు, వారి కుటుంబాలకు కీలక ఘట్టమన్నారు. అంకితభావంతో పనిచేస్తూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారిని ప్రోత్సహించారు.
సభకు హాజరైన వారికి హైదరాబాద్ జోన్ సెంట్రల్ టాక్స్, కస్టమ్స్ చీఫ్ కమిషనర్, ఐఆర్ఎస్ శ్రీ అరుణ్ కుమార్ స్వాగతం పలికారు. నూతన ఉద్యోగుల రాక ప్రభుత్వ సేవలకు సంబంధించి కొత్త ఆలోచనలు, ఉత్సాహాన్ని తీసుకొస్తుందన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (ఎన్ఏసీఐఎన్)లో నూతనంగా నియమితులైన 221 మంది అభ్యర్థులు శిక్షణ పొందుతారని తెలిపారు. జీఎస్టీ, కస్టమ్స్, సంబంధిత చట్టాలు, కార్యాలయ విధానాలు, ప్రయోగాత్మకంగా పనితీరు గురించి శిక్షణ ఉంటుంది. తెలంగాణ పోలీసు అకాడమీ సహకారంతో ఇన్‌స్పెక్టర్లకు ప్రత్యేక ఆయుధ నైపుణ్య శిక్షణను కూడా అందిస్తారు.

నూతనంగా నియమితులైన ఉద్యోగులు నిబద్ధతతో, అంకితభావంతో విధులను నిర్వర్తించాలని... "పౌరుడు, పన్ను చెల్లింపుదారుడు, దేశం తొలి ప్రాధాన్యత" సూత్రాన్ని పాటించాలని శ్రీ అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో వారు చేసే పని ప్రభుత్వ విధానాల కచ్చితమైన అమలుకు, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనకు తోడ్పడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ ఐఆర్ఎస్ శ్రీ ఎన్.జే. కుమరేష్, ఉన్నతాధికారులు, నూతనంగా నియమితులైన అభ్యర్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 2312502)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28