ప్రధాన మంత్రి కార్యాలయం
20వ రోజ్‌గార్ మేళాలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
'వికసిత్ భారత్' దిశగా మన ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తోన్న భారత యువశక్తి
యువతకు కొత్త అవకాశాలను కల్పించాలన్న మా నిబద్ధతకు 'రోజ్‌గార్ మేళాలు' నిదర్శనం
ప్రపంచ విశ్వాసాన్ని సంపాదించిన మన యువత ప్రతిభ, నైపుణ్యాలు
మన ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, ఉత్సాహవంతులైన యువశక్తిపైనే ప్రపంచం ఆశలు
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో మన యువతకు కొత్త అవకాశాలు
మన వ్యాపారవేత్తలకు కొత్త భాగస్వామ్యాలను, ప్రపంచ మార్కెట్‌లను అందుబాటులోకి తెస్తున్న వాణిజ్య ఒప్పందాలు
మన యువతకు అందుబాటులో కొత్త కెరీర్ అవకాశాలు
ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్
భారత అంకుర సంస్థల ప్రస్థానం ప్రధాన మహానగరాలకే పరిమితం కాలేదు
గుర్తింపు పొందిన మొత్తం అంకుర సంస్థల్లో దాదాపు సగం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే ఉన్నాయి: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 SEP 2026 2:30PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 20వ 'రోజ్‌గార్ మేళా'లో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందజేశారు. ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఒక మైలు రాయిగా నిలిచే ఈ కార్యక్రమం వేలాది కుటుంబాలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఇది అభ్యర్థుల వ్యక్తిగత కృషికి, వారి తల్లిదండ్రుల అపారమైన త్యాగాలకు తగిన గుర్తింపు అవుతుందని ఆయన పేర్కొన్నారు. "జీవితంలో ఈ కొత్త ఆరంభం కోసం మీ అందరికీ నా శుభాకాంక్షలు" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే మహత్తర లక్ష్యం దిశగా భారత్ పురోగమిస్తున్న తరుణంలో... భారత ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు శ్రీ మోదీ స్వాగతం పలికారు. ప్రతి పరిపాలన పరమైన నిర్ణయం ద్వారా అభివృద్ధి చెందిన భారత్, స్వయం-సమృద్ధ భారత్ అనే రెండు లక్ష్యాలను సాకారం చేసుకునే ప్రయత్నాలను నిరంతరం బలోపేతం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తోటి యువత పట్ల మన యువతకు ప్రత్యేక బాధ్యత ఉందని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. మన యువతరం ప్రతిభ, నైపుణ్యాలు ప్రపంచ విశ్వాసాన్ని చూరగొన్నాయని... ఇది భారతీయ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, యువశక్తిపై ప్రపంచవ్యాప్తంగా అపారమైన అంచనాలను పెంచుతోందని ఆయన పేర్కొన్నారు. "మన ఆవిష్కర్తలు, మన పారిశ్రామికవేత్తలు, మన యువశక్తిపై ప్రపంచానికి ఎన్నో ఆశలు ఉన్నాయి" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
ఇటీవల ముగిసిన బ్రిక్స్ సదస్సును గురించి ప్రస్తావిస్తూ... సాంప్రదాయికంగా సాగే ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారానికి మించి అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడమే ప్రభుత్వ వ్యూహమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మన పారిశ్రామికవేత్తలు, రైతులు, మహిళలు, యువతను నేరుగా ప్రపంచ భాగస్వామ్యాల్లో భాగమయ్యేలా బ్రిక్స్ కనెక్ట్, బ్రిక్స్ ఎంఎస్ఎంఈ కోఆపరేషన్ పోర్టల్ వంటి కార్యక్రమాలను రూపొందించినట్లు ఆయన వివరించారు. "ప్రతి ఒక్కరూ ఈ భాగస్వామ్యంలో చురుగ్గా పాలుపంచుకోవాలి" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక దౌత్యాన్ని ప్రస్తావిస్తూ... సుమారు 40 దేశాలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అపూర్వ రీతిలో అపారమైన ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ఒప్పందాలు దేశీయ పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్‌లను, చైతన్యవంతమైన భాగస్వామ్యాలను అందుబాటులోకి తెస్తున్నాయని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. "ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మన యువతకు కొత్త అవకాశాలను అందుబాటులోకి తెస్తున్నాయి" అని శ్రీ మోదీ ధ్రువీకరించారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రభుత్వం నిరంతరం చూపుతున్న శ్రద్ధను వివరిస్తూ... ప్రధానమంత్రి జాతీయ విద్యా విధానం, స్కిల్ ఇండియా మిషన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, అప్రెంటీస్‌షిప్ విధానాన్ని ప్రోత్సహించడం వంటి కీలక కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. పరిశ్రమల ప్రత్యక్ష భాగస్వామ్యం ద్వారా వచ్చిన 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వెయ్యి ప్రభుత్వ ఐటీఐలను ఆధునికీకరిస్తున్న 'పీఎం-సేతు' పథకాన్నీ ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. "యువత విద్య, నైపుణ్యాలు మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
దేశీయ అంకుర సంస్థల వ్యవస్థ సాధించిన అద్భుతమైన వృద్ధిని ప్రశంసిస్తూ... ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ కేంద్రంగా దేశం నిలిచినందుకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం గుర్తింపు పొందిన అంకుర సంస్థల్లో దాదాపు సగం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చిన్న పట్టణాల యువత తమ ఆలోచనలపై చురుగ్గా పనిచేస్తూ, కంపెనీలను నిర్మిస్తూ, తమ తోటివారికి కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారని అభినందించారు. "నేడు భారత నూతన ఆర్థిక వ్యవస్థలో గ్రామాలు, పట్టణాలు, చిన్న నగరాల యువత ప్రధాన పాత్ర పోషిస్తున్నారు" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ప్రైవేట్ రంగంలో ఉపాధిని పెంచే వ్యూహాన్ని వివరిస్తూ... రెండు కోట్ల మంది యువతను తొలిసారిగా అధికారిక కార్మిక శక్తిలో భాగం చేయడమే లక్ష్యంగా లక్ష కోట్ల రూపాయలతో చేపట్టిన భారీ కార్యక్రమమైన 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన'నూ ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పథకం కింద తొలిసారి ఉద్యోగంలో చేరే వారికి 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు, కొత్త ఉద్యోగాలను కల్పించే యజమానులకూ ఆర్థికంగా ప్రతిఫలం లభిస్తుందని ఆయన వివరించారు. "దేశంలో ఉపాధిని పెంపొందించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోంది" అని శ్రీ మోదీ ధ్రువీకరించారు.
ఉపాధి కల్పనను పటిష్ఠమైన స్థూల ఆర్థిక వ్యవస్థతో అనుసంధానిస్తూ... ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంది, పెట్టుబడులు పెరిగి, కొత్త పరిశ్రమలు విస్తరించినప్పుడే యువతకు నూతన అవకాశాలు లభిస్తాయని ప్రధానమంత్రి వివరించారు. దేశం సాధించిన 7.8 శాతం వృద్ధి రేటును, మొదటి త్రైమాసికంలో పెట్టుబడుల్లో నమోదైన 12 శాతం పెరుగుదలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ... మెరుగవుతున్న దేశ ఆర్థిక దృక్పథాన్ని రేటింగ్ ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. "భారత్ సాధించిన ఈ వృద్ధిలో గత కొన్నేళ్లుగా చేపట్టిన సంస్కరణల పాత్ర ఎంతో ఉంది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
నిరంతర పరిపాలన పరివర్తన శకాన్ని స్వీకరించాలని కొత్త అధికారులను ఆదేశిస్తూ... పన్నుల విధానాన్ని సరళీకరించడం, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని పెంపొందించడం, విద్య-నైపుణ్యాభివృద్ధిలో సంస్కరణలను అమలు చేయడం, నూతన రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాల ఆవశ్యకతను ప్రధానమంత్రి స్పష్టం చేశారు. తమ పదవీ కాలమంతా పరిపాలన పరమైన సంస్కరణలు మెరుగైన వేగంతో అప్రతిహతంగా కొనసాగేలా చూడాలని ఆయన యువ అధికారులను కోరారు. "దేశంలో సంస్కరణల ఎక్స్‌ప్రెస్ పూర్తి వేగంతో నిరంతరం పరుగెత్తడం అవసరం" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
కెరటాలను జయించడానికి సూర్యుడిని, సముద్రాన్ని, పడవను, నావికుడిని మన సొంతం చేసుకోవాలంటూ తాను గతంలో చెప్పిన కవితాత్మక వ్యాఖ్యలను ప్రధానమంత్రి గుర్తుచేశారు. దేశ యువత గొప్ప ఆశయాలకు అండగా నిలుస్తూ, ధైర్యసాహసాలను ప్రదర్శించాలని ఆయన కొత్తగా విధుల్లోకి చేరిన వారికి పిలుపునిచ్చారు. ప్రతీ ఫైలుపై చేసే సంతకం, తీసుకునే ప్రతీ పరిపాలన నిర్ణయం.. అడ్డంకులను తొలగించే, కొత్త ఆలోచనలు చిగురింపజేసే, ఉద్యోగాలను సృష్టించే ఆవిష్కరణలతో కూడిన పెట్టుబడులను ప్రోత్సహించేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. "మీరు ప్రతీ ఫైలుపై చేసే సంతకం యువత ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదిగా ఉండాలి" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
వారి వ్యక్తిగత అనుభవాలను గురించి ప్రస్తావిస్తూ, ప్రభుత్వ వ్యవస్థలో తమకు లభించిన కొత్త అధికారాలను పూర్తి సహానుభూతితో వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నూతనంగా నియమితులైన అధికారులను కోరారు. ఈ సర్వీసులో చేరడానికి ముందు తాము స్వయంగా ఎదుర్కొన్న అధికారికపరమైన అవరోధాలను తొలగించే దిశగా చురుగ్గా చర్యలు చేపట్టాలని వారికి సూచించారు. "తాము అనుభవించిన ఇబ్బందులను ఇతర యువత ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాకూడదన్నదే మీ ప్రయత్నంగా ఉండాలి" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
వేగంగా మారుతున్న ప్రపంచంలో జీవిత కాలమంతా నేర్చుకోవడం కొనసాగించాలనే మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తూ... 'మిషన్ కర్మయోగి' విధాన ప్రణాళిక ద్వారా కొత్తగా చేరినవారు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. నూతన సాంకేతికతల్లో ప్రావీణ్యం సంపాదించాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఐజీవోటీ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న 1.7 కోట్ల మంది ఉద్యోగులతో పాటు, కొత్తగా చేరేవారికి ఈ వ్యవస్థలో నిలదొక్కుకోవడంలో సహాయపడటానికి 'కర్మయోగి ప్రారంభ్' మాడ్యూల్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. "మిమ్మల్ని మీరు ఎంతగా మెరుగుపరుచుకుంటే, మీరు దేశ పౌరుల కోసం అంత ఉత్తమంగా సేవ చేయగలుగుతారు" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
ఏ ప్రభుత్వానికైనా నిజమైన బలం ప్రజల విశ్వాసంలోనే ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వృద్ధుల పింఛన్ల మంజూరు, విద్యార్థుల స్కాలర్షిప్లు, రైతు రాయితీల వంటి వారి రోజువారీ పనులు సామాన్య ప్రజల జీవితాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయని ప్రధానమంత్రి కొత్తగా చేరిన ఉద్యోగులకు గుర్తుచేశారు. వారి ప్రవర్తన, సామర్థ్యం, నిజాయతీ, సున్నితత్వమే అంతిమంగా ప్రభుత్వంతో పౌరుడికి కలిగే వ్యక్తిగత అనుభవాన్ని నిర్వచిస్తాయని ఆయన స్పష్టం చేశారు. "మీ ప్రవర్తన, మీ సున్నితత్వం, మీ సామర్థ్యం, మీ నిజాయతీ... ఇవన్నీ ప్రభుత్వంతో పౌరులకు కలిగే అనుభవాన్ని నిర్ణయిస్తాయి" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
పరిపాలనకు సంబంధించిన ఒక శక్తిమంతమైన సూత్రంతో తన ప్రసంగాన్ని ముగిస్తూ... పౌరులకు చేసే సేవను దేశ సేవతో సమానంగా భావించాలని, తమ దైనందిన విధుల్లో 'నాగరిక్ దేవో భవ' (ప్రజలే దైవం) అనే భావనను పాటించాలని ప్రధానమంత్రి నూతన అధికారులకు పిలుపునిచ్చారు. వివిధ విభాగాల్లో వారు అత్యంత అంకితభావంతో, సేవాభావంతో తమ బాధ్యతలను నిర్వర్తిస్తారన్న దృఢ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. "మీ పని ఒక పౌరుడి జీవితాన్ని సులభతరం చేసినప్పుడు, మీ విజయం మరింత గొప్పగా ఉంటుంది" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
(రిలీజ్ ఐడి: 2312451)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam