విద్యుత్తు మంత్రిత్వ శాఖ
అమెరికాలో జరిగిన జీ20 ఇంధన సమృద్ధి మంత్రిత్వ స్థాయి సమావేశంలో సురక్షితమైన, చవకైన, విశ్వసనీయమైన ఇంధనానికి భారత్ పిలుపు
శుద్ధ వంట ఇంధనం, అనుమతులు, కీలకమైన ఖనిజాల్లో ప్రధాన ఫలితాలను ముందుకు తీసుకెళ్లిన జీ20
సమర్థమైన నియంత్రణ, సురక్షితమైన కీలక ఖనిజ సరఫరా వ్యవస్థల తోడ్పాటుతో పటిష్టమైన, భవిష్యత్తు అవసరాలకు
తగిన ఇంధన వ్యవస్థను నిర్మించడంలో భారత్ నిబద్ధతను తెలియజేసిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2026 11:43AM by PIB Hyderabad
అమెరికాలోని హ్యూస్టన్‌లో 2026 సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు జరిగిన జీ20 ఇంధన సమృద్ధి మంత్రిత్వ స్థాయి సమావేశంలో భారత ప్రతినిధి బృందం పాల్గొంది. ఈ బృందానికి కేంద్ర విద్యుత్తు, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ మనోహర్ లాల్ కట్టర్ నేతృత్వం వహించారు. జీ20కు అమెరికా అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. దీనిలో మూడు ప్రధానాంశాలైన ఇంధన భద్రత-చవక ధరలకే బేస్‌లోడ్, అనుమతులు-నియంత్రణల సామర్థ్యం, కీలక ఖనిజాలు- పటిష్టమైన సరఫరా వ్యవస్థలపై జరిగిన చర్చల్లో ఆయన పాల్గొన్నారు.

అభివృద్ధికి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రగతికి సురక్షితమైన, చవకైన, విశ్వసనీయమైన ఇంధనం అవసరమని చర్చల్లో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వివిధ దేశాల పరిస్థితులు, అభివృద్ధి ప్రాధాన్యాలను గౌరవిస్తూనే... అందరి ఉమ్మడి శ్రేయస్సు కోసం అంతర్జాతీయ సహకారానికి ఉన్న ప్రాధాన్యాన్ని, పరస్పరం ప్రయోజనం చేకూర్చే సామర్థ్యాలను ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేశారు.
డిజిటల్ విధానాలు, వికేంద్రీకరణ, వినియోగదారు కేంద్రంగా భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా పటిష్టమైన ఇంధన వ్యవస్థను భారత్ క్రమంగా నిర్మిస్తోందని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో దేశం సాధించిన గణనీయమైన ప్రగతిని ఆయన వివరించారు. మొత్తం విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 552 గిగావాట్లకు చేరిందని, ఇందులో సగానికి పైగా శిలాజేతర వనరుల నుంచే వస్తోందని తెలిపారు. కీలకమైన ఎన్‌డీసీ లక్ష్యాలను భారత్ నిర్ణీత గడువు కంటే ముందే సాధించిందని, 2070 నాటికి సున్నా ఉద్గారాలను చేరుకోవడమే దేశ దీర్ఘకాలిక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఇంధన రంగంలో నియంత్రణ సామర్థ్యాన్ని పెంచడానికి, పోటీతత్వాన్ని ప్రోత్సహించడానికి, పెట్టుబడులు-భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడానికి భారత్ చేపట్టిన పలు సంస్కరణలను మంత్రి వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడానికి నేషనల్ సింగిల్ విండో సిస్టమ్, పరివేశ్, పీఎం గతిశక్తి లాంటి వేదికలు దోహదపడ్డాయని తెలిపారు.
కీలక ఖనిజాల విషయంలో భద్రమైన, పటిష్టమైన, విభిన్న సరఫరా వ్యవస్థలకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి అన్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పునర్వినియోగం, స్థానికంగా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలని సూచించారు. అన్వేషణ నుంచి పునర్వినియోగం వరకు అన్ని అంశాలను పర్యవేక్షించే జాతీయ కీలక ఖనిజాల కార్యక్రమం గురించి ఆయన వివరించారు. పునర్వినియోగం, పునరుద్ధరణ, వైవిధ్యీకరణలో జీ20 సహకారానికి పిలుపునిచ్చారు.
మూడు ప్రధానాంశాల్లో అనేక ముఖ్యమైన ఫలితాలను మంత్రిత్వ స్థాయి సమావేశం అందించింది. అవి:
(i) శుద్ధ వంట ఇంధనం లభ్యత: శుద్ధ వంట ఇంధనాన్ని సార్వత్రికంగా అందుబాటులోకి తీసుకు రావాల్సిన ప్రాధాన్యాన్ని శుద్ధ వంట ఇంధన సౌకర్యాలను పెంపొందించడంపై జీ20 ప్రకటన తెలియజేస్తోంది. అలాగే సాంకేతికంగా పక్షపాతం చూపని, దేశాల పరిస్థితులకు అనుగుణంగా ఉండే విధానాన్ని ప్రోత్సహిస్తోంది. అలాగే ఏ పరిష్కారమైనా అన్ని దేశాల విభిన్న అవసరాలను తీర్చలేదని గుర్తించింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శుద్ధ వంట ఇంధన మార్గంగా ఎల్పీజీని గుర్తించింది. ఎల్‌పీజీని వినియోగించే ప్రాజెక్టులతో సహా శుద్ధ వంట ఇంధనానికి సంబంధించిన అన్ని పరిష్కారాలకు ఆర్థిక సాయంలో సమాన ప్రాధాన్యం కల్పించాలని పిలుపునిచ్చింది.
(ii) అనుమతులు, నియంత్రణల సామర్థ్యం: ఇంధన రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం కావాలంటే సులభతరమైన, క్రమబద్ధీకరించిన అనుమతులు, నియంత్రణ ప్రక్రియలు ఉండాలని జీ20 పర్మిటింగ్ అండ్ రెగ్యులేటరీ ఎఫిషియెన్సీ సింపోజియం స్పష్టం చేసింది. అదే సమయంలో స్వచ్ఛందంగా సమాచారాన్ని పంచుకోవడం, సామర్థ్య నిర్మాణం, డిజిటల్, ఏఐ ఆధారిత సాధనాల ద్వారా సహకారాన్ని ప్రోత్సహించింది.
(iii) నీటి పునర్వినియోగం: జాతీయ విధానాలకు అనుగుణంగా ప్రయోజనాన్ని అందించే శాస్త్రీయమైన, సాక్ష్యం ఆధారితమైన, తక్కువ ఖర్చుతో కూడిన నీటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించడానికి జీ20 నీటి పునర్వినియోగ కార్యక్రమాన్ని స్వచ్ఛంద విధానంగా ముందుకు తీసుకువచ్చారు. ఇది నీటి భద్రతను, స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి సహకారాన్ని, ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానాలను ప్రోత్సహించింది. అలాగే ఒకటే విధానం అందరికీ సరిపోదని గుర్తించింది.
(iv) కీలక ఖనిజాలు: ఇంధన భద్రత, డిజిటల్ మౌలిక సదుపాయాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాలు, ఆర్థికాభివృద్ధికి కీలక ఖనిజాలు ఎంతో ముఖ్యమని జీ20 క్రిటికల్ మినరల్స్ సమావేశ ప్రకటన స్పష్టం చేసింది. దేశాల సార్వభౌమాధికారాన్ని, దేశాలను అనుసరిస్తున్న వైవిధ్యమైన మార్గాలను గౌరవిస్తూనే... సమష్టిగా, స్వచ్ఛందంగా సహకరించుకోవాలని స్పష్టం చేసింది. వైవిధ్యీకరణ, విలువ జోడింపు, పటిష్టమైన సరఫరా వ్యవస్థల కోసం ఆవిష్కరణలను, పునర్వినియోగాన్ని, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.
ఈ సమావేశాల సందర్భంగా అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్, అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ కార్యదర్శి డౌగ్ బర్గమ్, కెనడా ఇంధన-సహజ వనరుల శాఖ పార్లమెంటరీ కార్యదర్శి కోరీ హోగన్‌లతో కేంద్ర మంత్రి ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ చర్చల్లో పటిష్టమైన ఇంధన మౌలిక వసతులు, సరఫరా వ్యవస్థలు, విద్యుత్ రంగ పరివర్తనతో సహా పరస్పర ఆసక్తి కలిగిన అంశాలపై చర్చించారు. అలాగే డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి భారతదేశ ప్రణాళికలపై కూడా చర్చల్లో దృష్టి సారించారు.


అంతర్జాతీయ ఇంధన చర్చకు భారత్ అందిస్తున్న నిర్మాణాత్మక సహకారాన్ని జీ20 ఇంధన సమృద్ధి మంత్రిత్వ స్థాయి సమావేశంలో మంత్రి భాగస్వామ్యం తెలియజేస్తోంది. అలాగే అందరికీ సురక్షితమైన, సుస్థిరమైన, సరసమైన, సమ్మిళిత్వం సాధించిన ఇంధన భవిష్యత్తును అందించడంలో భారత్ నిబద్ధతను స్పష్టం చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2311364)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3