పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ప్రపంచ ఓజోన్ దినోతవ్సం 2026 సందర్భంగా భారతీయ నెట్ జీరో వేదికతోపాటు ఎన్ఏపీసీసీ డాష్‌బోర్డును ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్
జాతీయ వాతావరణ మిషన్ల పర్యవేక్షణ బలోపేతం, స్వచ్ఛంద నెట్ జీరో చర్చలను ప్రోత్సహించనున్న డిజిటల్ వేదికలు
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 12:27PM by PIB Hyderabad
ప్రపంచ ఓజోన్ దినోత్సవం 2026 సందర్భంగా భారతదేశ నెట్ జీరో వేదిక, వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఏపీసీసీ) డాష్‌బోర్డును కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ నేడు ముంబయిలో ప్రారంభించారు. పారదర్శకత, సమన్వయం, సాక్ష్యాధారిత వాతావరణ చర్యలను బలోపేతం చేసే దిశగా ఈ రెండు డిజిటల్ కార్యక్రమాలు కీలక ముందడుగుగా నిలువనున్నాయి. నెట్ జీరో వేదిక ద్వారా వివిధ సంస్థలు స్వచ్ఛందంగా నెట్ జీరో లక్ష్యాలను ప్రకటించేందుకు జాతీయ స్థాయి వేదికను అందిస్తుంది. ఎన్ఏపీసీసీ డాష్‌బోర్డు ద్వారా వాతావరణ మార్పులకు సంబంధించిన జాతీయ మిషన్ల పురోగతిని సమగ్రంగా పర్యవేక్షించవచ్చు.
నెట్ జీరో వేదిక వివిధ రంగాలకు చెందిన భారతీయ సంస్థలు స్వచ్ఛందంగా తమ నెట్ జీరో లక్ష్యాలను నమోదు చేసుకోవడానికి, వాటి వివరాలను వెల్లడించడానికి రూపొందించిన కేంద్రీకృత డిజిటల్ వేదిక. ఇందులో పాల్గొనే సంస్థలు తమ గ్రీన్‌హౌస్ వాయువుల (జీహెచ్‌జీ) ఉద్గారాల వివరాలను వెల్లడించవచ్చు, నెట్ జీరో లక్ష్యాలను ప్రకటించవచ్చు. అలాగే ప్రతి ఏడాది సాధించిన పురోగతిని నమోదు చేయవచ్చు. సంస్థలు స్కోప్ 1, స్కోప్ 2 ఉద్గారాలను నివేదించాలని ప్రోత్సహిస్తున్నారు. స్కోప్ 3 ఉద్గారాల నివేదిక మాత్రం స్వచ్ఛందంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి స్వచ్ఛమైన ఇంధన మార్పు, ఇంధన సామర్థ్యం, సాంకేతిక చర్యలు, కార్బన్ తొలగింపు వంటి అంశాల ద్వారా నెట్ జీరో లక్ష్యాలను ఎలా సాధించనున్నారో కూడా సంస్థలు ఈ వేదికలో వివరించవచ్చు.
ఈ కార్యక్రమం ద్వారా వివిధ సంస్థలు స్వచ్ఛందంగా చేపడుతున్న వాతావరణ చర్యలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు పారదర్శకత పెరుగుతుంది. దీర్ఘకాలికంగా విశ్వసనీయమైన వాతావరణ ప్రణాళికలను రూపొందించేందుకు ఇది ప్రోత్సహిస్తుంది. నెట్ జీరో లక్ష్యాలను విజయవంతంగా ప్రకటించిన సంస్థలకు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుంచి ధ్రువీకరణను అందజేస్తారు. పాల్గొనే సంస్థలు, సంస్థాగత విభాగాలు, పరిశ్రమలు ప్రకటించిన వివరాలను ప్రజలు కూడా చూడగలిగే అవకాశం ఉండటంతో, దేశంలో స్వచ్ఛందంగా చేపడుతున్న నెట్ జీరో చర్యల సమగ్ర సమాచార నిధి కూడా ఏర్పడుతుంది. నెట్ జీరో వేదికను https://netzeroindia.moef.gov.in ఇక్కడ పొందవచ్చు.
ఎన్ఏపీసీసీ డాష్‌బోర్డు ద్వారా వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద ఉన్న జాతీయ మిషన్ల అమలు, పురోగతిని సమగ్రంగా డిజిటల్ రూపంలో చూడవచ్చు. మిషన్లకు సంబంధించిన సమాచారం, గుర్తించిన సూచికలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు వ్యవస్థీకృతంగా పర్యవేక్షించేందుకు ఇది సహాయపడుతుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, దేశవ్యాప్తంగా చేపడుతున్న వాతావరణ చర్యలను సాక్ష్యాధారిత అంచనాకు మద్దతిస్తుంది. అలాగే రంగాల వారీగా పురోగతిని పరిశీలించడం, అమలులో ఉన్న లోపాలను గుర్తించడం, మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి సంబంధిత సమాచారాన్ని సమీకరించడం వంటి అంశాల్లో డాష్‌బోర్డ్ ఉపయోగపడుతుంది. దేశీయంగా చేపడుతున్న వాతావరణ చర్యలకు, అంతర్జాతీయంగా వాతావరణ కట్టుబాట్లకు మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడంలో కూడా ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ డాష్‌బోర్డును https://napccindia.moef.gov.in/ ఇచ్చడ చూడవచ్చు.
నెట్ జీరో వేదిక, ఎన్ఏపీసీసీ డాష్‌బోర్డు ప్రారంభం ద్వారా సాంకేతికత ఆధారిత పాలన, పారదర్శకత, సంస్థల మధ్య సమన్వయం, సాక్ష్యాధారిత వాతావరణ చర్యలకు భారత ప్రభుత్వం ఇస్తున్న నిరంతర ప్రాధాన్యం స్పష్టమవుతోంది. తక్కువ కార్బన్ ఉద్గారాలు, వాతావరణ మార్పులను తట్టుకునే భవిష్యత్తు దిశగా భారత్ సాగుతున్న మార్పులో విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కూడా ఈ రెండు డిజిటల్ కార్యక్రమాలు దోహదపడనున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2311020)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12