యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైతువల్, కోలాసిబ్‌‌లలో జిల్లా సమీక్ష సమావేశాలు.. అధ్యక్షత వహించిన కేంద్ర సహాయ మంత్రి రక్షా ఖడ్సే.. అభివృద్ధి ప్రాధాన్యాలు, క్రీడలు, యువజనుల భాగస్వామ్యంపై సమీక్ష


క్షేత్ర స్థాయిలో క్రీడలు, యువత సమీకరణ, మత్తు పదార్థాల వాడకాన్ని నివారించడం,
వ్యవసాయం, సంధానం, కేంద్ర ప్రభుత్వ పథకాల పటిష్ట అమలుపై ప్రత్యేక దృష్టి

నాడు పోస్టు చేయడమైనది: 16 SEP 2026 2:24PM by PIB Hyderabad

మిజోరంలో నిన్న, ఈ రోజు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే అధికారిక పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా సైతువల్, కోసాలిబ్ జిల్లాల్లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. ఈ సమావేశాల్లో అభివృద్ధి ప్రాధాన్యాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, యువజన భాగస్వామ్యం, వ్యవసాయం, సంధానం, ఆరోగ్య సంరక్షణ సేవలతో పాటు జీవనోపాధి అవకాశాలపై సమీక్షను నిర్వహించారు.
యువత భాగస్వామ్యం, వ్యవసాయం, క్రీడలపై సైతువల్‌లో సమీక్షా సమావేశం


సైతువల్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టరు శ్రీ శ్రీనివాస్ సాదీ, పోలీస్ సూపరింటెండెంటు శ్రీ వివేక్ కుమార్ మౌర్య, సీనియర్ జిల్లా అధికారులతో పాటు క్రీడా సమాఖ్యలు, సాముదాయిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


image.png


సమావేశంలో మాదకద్రవ్యాలకు యువత బానిసలుగా కాకుండా చూడాలన్న అంశంపై ప్రధానంగా చర్చించారు. ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని శ్రీమతి రక్షా ఖడ్సే స్పష్టం చేశారు. ఈ విషయంలో యువజన బృందాలు, సాముదాయిక సంస్థలు, నేర నియంత్రణ సంస్థల మధ్య బలమైన సమన్వయం ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి సహచరుల నాయకత్వంలో చైతన్య కార్యక్రమాలను నిర్వహించడం, ఫలప్రదంగా నిలిచే యువజన భాగస్వామ్యంతో పాటు సుస్థిర ప్రాతిపదికన సముదాయ స్థాయి ప్రయత్నాలను కూడా చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
సైతువల్ జిల్లాలో వ్యవసాయం, తోట పంటల అవకాశాలను కూడా సమావేశంలో సమీక్షించారు. దీనిలో మిజోరమ్ సేంద్రియ ఉత్పాదనలకు మార్కెట్టు లభ్యతపై, సరఫరా మార్గాలను మెరుగుపరచడంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ పద్ధతుల్లో స్థానిక రైతులకు విశాల మార్కెట్లతో మరింత ప్రభావవంతమైన రీతిన ముడిపడగలుగుతారని మంత్రి అన్నారు.
సమావేశంలో పాల్గొన్న స్థానిక క్రీడా సమాఖ్యల ప్రతినిధులు క్రీడారంగ మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకారులను తీర్చిదిద్దడానికి సంబంధించిన క్షేత్ర స్థాయి అవసరాలను ప్రస్తావించారు. క్రీడల మౌలిక సదుపాయాలకు తోడు క్రమం తప్పని కోచింగ్, సువ్యవస్థిత శిక్షణ, పోటీలలో ఉన్నత స్థాయులకు క్రీడాకారులు ఎదిగేలా వారికి సాయాన్ని అందించడం ముఖ్యమని శ్రీమతి ఖడ్సే సూచించారు. క్షేత్ర స్థాయుల్లో క్రీడల అవకాశాల పరిధిని విస్తరించడంలో ‘ఖేలో ఇండియా పథకం’ పోషించదగ్గ పాత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె అన్నారు.
సంధానం, ఆరోగ్య సంరక్షణతో పాటు జీవనోపాధి మార్గాలపై కోలాసిబ్‌ సమావేశంలో సమీక్ష
శ్రీమతి ఖడ్సే అధ్యక్షతన నిర్వహించిన కోలాసిబ్ జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టరు శ్రీ హెచ్. డొలియన్‌బువాయియా, ఎమ్‌సీఎస్, పోలీస్ సూపరింటెండెంటు శ్రీ పు లాల్‌రిన్‌పుయియా వర్తేతో పాటు, సీనియర్ పరిపాలనాధికారులు, విభాగాల అధిపతులు పాల్గొన్నారు.


image.png


మౌలిక సదుపాయాల కల్పనలో రోడ్డు సంధానాన్ని కీలక ప్రాధాన్య అంశంగా గమనించారు. స్థానికులకు మార్కెట్ల లభ్యత, అవసరమైన సేవలను మెరుగుపరుస్తూ, ఆర్థిక అవకాశాలను అందించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉందని తీర్మానించారు.
జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అయిదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్ స్కూలు ఎలా పనిచేస్తున్నదీ మంత్రి సమీక్షించారు. అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ సంబంధిత మౌలిక సదుపాయాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవడంపై శ్రద్ధ చూపాల్సిందిగా ఆమె సూచించారు.
వ్యవసాయంపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. రైతులకు సహకారాన్ని అందించడంలో కృషి విజ్ఞ‌ాన్ కేంద్రం (కేవీకే) పోషిస్తున్న పాత్ర ప్రస్తావనకు వచ్చింది. కొలాసిబ్‌లో 10,000 కన్నా ఎక్కువ మంది రైతులు ఉన్నారు. ప్రస్తుత 5,000 మందికి పైగా రైతులకు సాంకేతిక మార్గదర్శకత్వాన్ని కృషి విజ్ఞ‌ాన్ కేంద్రం అందజేస్తున్నది. పలు రాష్ట్రాలలో ఇంటర్న్‌షిప్‌లతో పాటు విజిటింగ్ ఫేకల్టీ కార్యక్రమాలకు కూడా కేవీకే సహకారాన్ని అందిస్తోంది.
సమావేశంలో 102 సహకార సంఘాలు సహా సహకార రంగం పనితీరుపై సమీక్షను చేపట్టారు. ఈ సహకార సంఘాల్లో చాలావరకు వ్యవసాయ ప్రధానమైనవే. అలాగే జన్ ఔషధీ కేంద్రాల పనితీరును కూడా సమీక్షించారు. స్థానికంగా జీవనోపాధి అవకాశాల కల్పన, సాముదాయిక స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలను పటిష్టపరచడంలో వీటి పాత్రనూ చర్చించారు.
స్థానికంగా ఔత్సాహిక పారిశ్రామికత్వానికి ప్రోత్సాహం
జిల్లాలో ‘ప్రధానమంత్రి  ఉపాధి కల్పన కార్యక్రమం’ (పీఎమ్‌ఈజీపీ) అమలవుతున్న తీరును శ్రీమతి ఖడ్సే సమీక్షించారు. 2025-26లో ఇచ్చిన అనుమతులు కార్యరూపం దాల్చడంలో అడ్డంకిగా నిలిచిన వెబ్‌సైట్ లభ్యత సంబంధిత సమస్యల్ని పరిష్కరించడంతో పాటు, ఫర్నిచర్ వర్క్‌షాపులు, కిరాణా దుకాణాలు, మినరల్ వాటర్ యూనిట్లు సహా ఎంపిక చేసిన 25 స్థానిక వాణిజ్య సంస్థలకు మద్దతును త్వరిత గతిన అందించడంపైన కూడా ప్రధానంగా చర్చించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ, ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’లను శ్రీమతి ఖడ్సే సమీక్షించిన సందర్భంగా.. లబ్ధిదారు సమాచారంలో లోపాలను తొలగించాలని, రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ చర్యలను చేపడితే ఉద్దేశించిన ప్రయోజనాలను అర్హత కలిగిన కుటుంబాలు అన్నింటికీ అందేటట్లుగా చూడవచ్చని ఆమె అన్నారు.
కొలాసిబ్‌లో క్షేత్ర స్థాయిలో క్రీడలను బలోపేతం చేయడం
కొలాసిబ్ సమీక్షా సమావేశంలో క్రీడలు ఓ ప్రధానాంశంగా చర్చకు వచ్చాయి. ఫుట్‌బాల్, హాకీ, రెజ్లింగ్ ఈ జిల్లాలో ప్రధాన క్రీడా విభాగాలుగా ఉన్నాయని గుర్తించారు. కొలాసిబ్‌కు చెందిన అథ్లెట్లు జాతీయ స్థాయి ఫుట్‌బాల్ లీగ్‌లలో పాలుపంచుకుంటున్నారు. ఈ జిల్లాలో ఓ హాకీ మైదానం కూడా ఉంది. ఇది ఓ క్రీడాకారుడు జాతీయ స్థాయికి ఎదగడంలో తోడ్పడింది.
స్థానిక క్రీడాకారులకు సువ్యవస్థిత కోచింగ్, నిరంతర శిక్షణ అవకాశాలను అందించడానికి ఒక ప్రత్యేక ట్రయినింగ్ సెంటరును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా చర్చించారు.
వీబీ-జీఆర్ఏఎమ్-జీ కార్యక్రమంలో భాగంగా నెలకొల్పుతున్న క్రీడా రంగ మౌలిక సదుపాయాలపై శ్రీమతి ఖడ్సే సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్, వాలీబాల్ మైదానాలు, ప్రస్తుతం ఉన్న సదుపాయాల నిర్వహణ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 51 గ్రామాల్లోనూ క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని, దీంతో యువతకు తమ సముదాయాల దగ్గరి ప్రాంతాల్లోనే ఆట సదుపాయాలు అందుబాటులోకి రాగలవనీ ఆమె సూచించారు.
‘మై భారత్’, యువజన సమీకరణ
యువజనులను సమీకరించడం, మత్తుపదార్థాలకు అలవాటు పడటాన్ని మాన్పించడంపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. జిల్లాలో అమలు చేస్తున్న నషా ముక్త్ కార్యక్రమాలను మంత్రి దృష్టికి పోలీస్ సూపరింటెండెంటు తీసుకువచ్చారు. చైతన్య ప్రధాన కార్యక్రమాలతో పాటు, మాదకద్రవ్యాల సేవనం ఆకర్షణలో పడకుండా తప్పించుకోవలసిందిగా సూచిస్తున్నామని వివరించారు.
యువత శక్తిని క్రీడలు, విద్య, ప్రజాసేవ, ఫలప్రదమైన సామాజిక కార్యక్రమాలతో అనుబంధాన్ని పెంపొందించుకొనే దిశగా మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి శ్రీమతి ఖడ్సే  స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో మరిన్ని అవగాహన ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తుండాల్సిందిగా ఆమె సలహానిచ్చారు. యువత చెంతకు చేరుకోవడంలో మంచి అలవాట్లు ఉన్న సహచరులు చూపే ప్రభావానికి  అమిత ప్రాధాన్యం ఉంటుందని మంత్రి అన్నారు.
కొలాసిబ్‌లో దాదాపు 9,000 మంది యువజనులు ‘మై భారత్’ వేదికలో చేరారని జిల్లా యువజన అధికారి వెల్లడించారు. చైతన్య ప్రబోధక కార్యక్రమాల్లో చేరేటట్లుగా మరింత ఎక్కువ మంది మై భారత్ స్వచ్ఛంద సేవకులను సమీకరించాలని, మైభారత్ వాలంటీర్లతో పోలీస్ విభాగం ఇప్పటి కన్న ఎక్కువ సమన్వయాన్ని నెలకొల్పుకోవాలని శ్రీమతి ఖడ్సే కోరారు.
క్షేత్ర స్థాయిలో అభివృద్ధిపై దృష్టి
రెండు జిల్లాల సమీక్షల సందర్భంగా, దేశాభివృద్ధి ప్రస్థానంలో యువతదే కీలక పాత్ర అని శ్రీమతి ఖడ్సే స్పష్టం చేశారు. వారి శక్తి యుక్తులను క్రీడలు, విద్య, ఔత్సాహిక పారిశ్రామికత్వం, సాముదాయిక భాగస్వామ్యం, ఉత్పాదకత ప్రధానమైన జీవనోపాధుల రంగాల్లోకి తప్పక మళ్లించాల్సిందిగా ఆమె సూచించారు.
క్రీడలతో ముడిపడిన విస్తారిత అనుబంధ వ్యవస్థలను (ఇకోసిస్టమ్స్) పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, క్రీడలకు అనేక అవకాశాలున్న మిజోరం వంటి ప్రాంతాల్లో ఇది కీలకమని ఆమె ప్రస్తావించారు. దీనికిగాను సదుపాయాలు, నాణ్యమైన కోచింగ్, సువ్యవస్థిత శిక్షణ, సముచిత సహాయ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థంగా అమలు చేయాలంటే అందుకు కచ్చితమైన సమాచారం, బలమైన అంతర్ విభాగ సమన్వయం, స్థానికులతో నిరంతర ప్రాతిపదికన అనుబంధం.. ఇవి అవసరమని శ్రీమతి రక్షా ఖడ్సే స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల ప్రయోజనాలు క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులకు మంచి అవకాశాలను, ఉత్తమ ఫలితాలను అందించేలా చూడాలని ఆమె అన్నారు.
జిల్లా సమీక్షా సమావేశాల ముగింపు సందర్భంగా.. సైతువల్, కొలాసిబ్ జిల్లాల ప్రజలకు, యువతీయువకులకు మరిన్ని అవకాశాలను కల్పించేటట్లు సమ్మిళిత అభివృద్ధిని ముందుకు తీసుకు పోవాలని తీర్మానించారు. దీని కోసం జిల్లా పాలనాధికార యంత్రాంగాలు, పోలీస్ అధికారులు, యువజన సంస్థలు, క్రీడా సంఘాలు, వ్యవసాయ సంస్థలు, సహకార సంఘాలు, సాముదాయిక సంస్థల పరస్పరం పక్కా సమన్వయాన్ని ఏర్పరుచుకోవాలని స్పష్టం చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2311015) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी