మంత్రిమండలి
ఈపీఎఫ్‌వో వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచడానికి క్యాబినెట్ ఆమోదం
తప్పనిసరి ఈపీఎఫ్‌వో పరిధిలోకి మరో 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు వచ్చే అవకాశం
ఇది క్రమబద్ధీకరణను బలోపేతం చేసే, భారతదేశ దీర్ఘకాలిక సామాజిక భద్రతా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే నిర్ణయం
పటిష్టమైన పదవీ విరమణ భద్రతను, వికసిత్ భారత్ – 2047 లక్ష్యాన్ని సాధించాలనే దిశగా ముందడుగు
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 3:07PM by PIB Hyderabad
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలో తప్పనిసరి కవరేజీ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచాలన్న కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయంతో అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు తప్పనిసరి ఈపీఎఫ్‌వో కవరేజీ పరిధిలోకి వస్తారని, తద్వారా కార్మికులకు సామాజిక భద్రత గణనీయంగా విస్తరిస్తుందని భావిస్తున్నారు.
2004 నుంచి 2014 వరకు దశాబ్దం కాలం పాటు ఈపీఎఫ్‌వో వేతన పరిమితిలో ఎలాంటి మార్పూ చేయలేదు. ఆ తర్వాత సెప్టెంబర్ 2014లో ఈ పరిమితి రూ.15,000కు పెరిగింది. గడచిన కొన్ని సంవత్సరాలుగా నిలకడగా పెరుగుతున్న వేతనాలు, ఆదాయాలు, వ్యవస్థీకృత ఉపాధిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత నిర్ణయం ద్వారా వేతన పరిమితిని రూ.25,000కు పెంచారు.
ప్రస్తుతం రూ.15,000కు పైగా వేతనంతో కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈపీఎఫ్ నిబంధనలు నేరుగా వర్తించవు. దీని వల్ల వారు తప్పనిసరి ప్రావిడెంట్ ఫండ్, పింఛను, సంబంధిత బీమా రక్షణ పరిధిలోకి రాకపోవచ్చు. ఇప్పుడు వేతన పరిమితిని రూ.25,000కు పెంచడం ద్వారా రూ.15,000 నుంచి రూ.25.000 మధ్య వేతనం పొందే ఉద్యోగులు గణనీయమైన సంఖ్యలో చట్టబద్ధమైన సామాజిక భద్రత వ్యవస్థ పరిధిలోకి వస్తారు.
ఈ ఆమోదంతో ప్రావిడెంట్ ఫండ్ పొదుపు, ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్) కింద పింఛను రక్షణ, ఉద్యోగులు డిపాజిట్ అనుసంధాన బీమా పథకం (ఈడీఎల్ఐ) పరిధిలో బీమా భద్రత మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి. సంబంధిత పథకాల నియమాలకు అనుగుణంగా ఈ ప్రయోజనాలు లభిస్తాయి. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న వేతన స్థాయులను మెరుగ్గా ప్రతిబింబించేలా చట్టబద్ధమైన చందా, పింఛనుకు అర్హత కలిగిన వేతనాల నియమావళికి వీలు కల్పిస్తుంది.
2014 సెప్టెంబర్‌లో వేతన పరిమితిని సవరించిన తర్వాత, దేశంలో వేతనాల్లో నిరంతర వృద్ధి, ఆదాయాల్లో పెరుగుదల, వ్యవస్థీకృత ఉపాధి విస్తరణ కనిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు, వృత్తుల్లో కనీస వేతనాలు కూడా ప్రస్తుత పరిమితికి చేరువయ్యాయి. ఈ పరిమితిని రూ.25,000కు పెంచుతూ తీసుకున్న నిర్ణయం... పెరుగుతున్న వేతన స్థాయిలకు అనుగుణంగా ఈపీఎఫ్‌వో విధానాన్ని ఆధునికీకరించి, విస్తృత స్థాయిలో కార్మికవర్గానికి చట్టబద్ధమైన సామాజిక భద్రతా ప్రయోజనాలను అందిస్తుంది.
ఈ చర్య ఉపాధి వ్యవస్థీకరణకు, కార్మికుల కొనసాగింపునకు, దీర్ఘకాలిక పదవీ విరమణ భద్రతకు మరింత ప్రోత్సాహం ఇస్తుందని భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నేరుగా చట్టబద్ధమైన సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడం ద్వారా, అధికారిక ఉపాధితో పాటు బదిలీ చేసుకునే వెసులుబాటు ఉన్న సురక్షిత సామాజిక భద్రత ఉండాలనే సూత్రాన్ని ఈ నిర్ణయం మరింత బలపరుస్తుంది. విస్తృతమైన సామాజిక భద్రతను కల్పించడం ద్వారా ఉద్యోగుల కొనసాగింపు, శ్రామిక శక్తి స్థిరత్వం, ఉద్యోగుల మనోస్థైర్యం పెంపు, మరింత సురక్షితమైన, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడంలో యాజమాన్యాలకు సైతం ఈ నిర్ణయం దోహదపడుతుంది.
ఈ ప్రతిపాదనపై సమగ్ర అంతర మంత్రిత్వ శాఖల సంప్రదింపులు జరిగాయి. 2026 జూన్ 16న జరిగిన సమావేశంలో వ్యయ ఆర్థిక కమిటీ ఈ ప్రతిపాదనను సిఫారసు చేసింది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.11,339 కోట్ల ఆర్థిక భారం పడుతుందని అంచనా. ప్రస్తుతం బడ్జెట్ ద్వారా అందుతున్న వార్షిక సాయం సుమారు రూ. 10,250 కోట్లు. అయిదేళ్ల కాలంలో ఈ మొత్తం వ్యయం దాదాపు రూ. 56,696 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక భద్రతా పథకాల్లో ఒకదానిని ఈపీఎఫ్‌వో నిర్వహిస్తోంది. ఉద్యోగులు భవిష్య నిధి (ఈపీఎఫ్), ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్), ఉద్యోగుల డిపాజిట్ అనుసంధాన బీమా పథకం (ఈడీఎల్ఐ)లను పర్యవేక్షిస్తోంది. తాజా ఈపీఎఫ్‌వో గణాంకాల ప్రకారం, దాదాపు 7.68 లక్షల సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 7.98 కోట్ల మంది చందాదారులుగా ఉన్నారు. ఈపీఎస్ ద్వారా దాదాపు 82 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందుతున్నారు. ఈపీఎఫ్ సభ్యత్వంతో అనుసంధానమైన బీమా రక్షణను ఈడీఎల్ఐ కల్పిస్తుంది.
భారతదేశ వృద్ధి గాథలో శ్రామిక శక్తే అత్యంత కీలకమైన అంశం. వేతనాలు, ఆదాయాలు, వ్యవస్థీకృత ఉపాధి పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి కల్పన, క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం కారణంగా కార్మికులకు నూతన అవకాశాలు లభిస్తున్నాయి. ఈపీఎఫ్‌వో వేతన పరిమితి పెంపు వల్ల సామాజిక భద్రతా వ్యవస్థ కూడా ఈ ప్రగతికి అనుగుణంగా ముందుకు సాగుతుంది. ఫలితంగా వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న మరింత మంది కార్మికులకు చట్టబద్ధమైన సామాజిక భద్రత లభిస్తుంది.
సమ్మిళితమైన, పటిష్టమైన, భవిష్యత్తు అవసరాలకు తగిన సామాజిక భద్రతా వ్యవస్థను నిర్మించే దిశగా వేసిన ముఖ్యమైన ముందడుగును ఈ ఆమోదం సూచిస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలనే దిశగా దేశం ముందడుగు వేస్తున్న తరుణంలో ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న వేతనాలు, విస్తరిస్తున్న వ్యవస్థీకృత ఉపాధితో పాటే సామాజిక భద్రత కూడా ముందుకు సాగేలా చూస్తుంది.
ఈ నిర్ణయం అమలుకు అవసరమైన చట్టబద్ధమైన, పరిపాలనాపరమైన చర్యలను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, ఈపీఎఫ్‌వో చేపడతాయి.
****
(రిలీజ్ ఐడి: 2310935)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15