రక్షణ మంత్రిత్వ శాఖ
రష్యాకు అధికారిక పర్యటనకు వెళ్లిన ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్
భారత్-రష్యా రక్షణ సహకారాన్ని, సైనిక సంబంధాలను మరింత బలపరచటమే ఈ పర్యటన ఉద్దేశం
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 10:23AM by PIB Hyderabad
భారత సైన్యాధిపతి (సీఓఏఎస్) జనరల్ ధీరజ్ సేత్, సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక రక్షణ భాగస్వామ్యాన్ని, సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయటమే ఈ పర్యటన లక్ష్యం.
ఈ పర్యటనలో భాగంగా సైన్యాధిపతికి లాంఛనంగా గార్డ్ ఆఫ్ హానర్ గౌరవం లభిస్తుంది. అలాగే మాస్కోలోని 'అమర జవానుల స్మారకం' వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు. వృత్తిపరమైన సైనిక సహకారం, శిక్షణతో సహా పరస్పర ఆసక్తిగల వివిధ అంశాలపై రష్యా సైనిక దళాల కమాండర్-ఇన్-చీఫ్ కల్నల్ జనరల్ ఆండ్రీ నికోలాయెవిచ్ మోర్ద్విచెవ్‌తో చర్చలు జరుపుతారు.
మాస్కోలోని నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, రష్యా రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారులతో సీఓఏఎస్ సమావేశమవుతారు. ఈ సమావేశంలో రక్షణ పరిశ్రమ, సేకరణల బాధ్యతలు నిర్వర్తించే డిప్యూటీ రక్షణమంత్రి శ్రీ వాసిలీ సెర్గెవిచ్ ఓస్మాకోవ్ కూడా ఉంటారు. సమకాలీన సైనిక పరిణామాలపై అభిప్రాయాలను పంచుకోవటానికి రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవటానికి ఈ సమావేశాలు చక్కటి అవకాశాన్ని కల్పిస్తాయి.
ఈ పర్యటనలో భాగంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌ను కూడా జనరల్ ధీరజ్ సేత్ సందర్శిస్తారు. అక్కడ మిఖైలోవ్‌స్కాయా మిలిటరీ ఆర్టిలరీ అకాడమీని సందర్శించి, అకాడమీని నడిపించే నాయకులను, అధ్యాపక బృందాన్ని కలుసుకుంటారు.
నిరంతర సైనిక దౌత్యం, సైనిక సంబంధాలకు ఇరుదేశాలు ఇస్తున్న ప్రాముఖ్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తుంది. ఈ చర్చలు సైనిక సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తాయని, భారత్-రష్యాల మధ్య రక్షణ బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయని భావిస్తున్నారు.
(రిలీజ్ ఐడి: 2310746)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6