ఆర్థిక మంత్రిత్వ శాఖ
రూ. 15.78 కోట్లకు పైగా నకిలీ ఐటీసీ మోసాన్ని వెలుగులోకి తెచ్చిన సీజీఎస్‌టీ ఢిల్లీ సౌత్ కమిషనరేట్: సంస్థ భాగస్వామి అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
15 SEP 2026 9:56PM by PIB Hyderabad
మోసపూరిత ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్‌లపై కొనసాగుతున్న తనిఖీల్లో భాగంగా, దిల్లీ సౌత్ కమిషనరేట్‌కు చెందిన కేంద్ర వస్తు, సేవల పన్ను (సీజీఎస్‌టీ) ఎగవేత నిరోధక విభాగం అధికారులు ఒక ఇనుము, ఉక్కు వ్యాపార సంస్థ భాగస్వామిని అరెస్టు చేశారు. సుమారు రూ. 87.67 కోట్ల విలువైన నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా రూ. 15.78 కోట్లకు పైగా అనర్హమైన ఐటీసీని మోసపూరితంగా పొందడం, వినియోగించడం, బదిలీ చేయడం లాంటి ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి.
పలు సంస్థలు జారీ చేసిన ఇన్‌వాయిస్‌ల ఆధారంగా అనర్హమైన ఐటీసీని పొందినట్లు గుర్తించారు. వాటిలో ఉనికిలో లేని, కార్యకలాపాలు నిర్వహించని, సస్పెండ్ అయిన, రద్దయిన సంస్థలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది. అలాగే సరఫరాదారులు పేర్కొన్న వ్యాపార చిరునామాలో వాస్తవానికి ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని క్షేత్రస్థాయి పరిశీలనలో నిర్ధారణ అయింది.
అనంతరం చేపట్టిన విచారణలో వస్తువులు తీసుకోకుండానే ఐటీసీని పొందినట్లు, వస్తువుల సరఫరా లేకుండానే జారీ చేసిన ఇన్‌వాయిస్‌ల ద్వారా ఆ మొత్తాన్ని పలువురు గ్రహీతలకు బదిలీ చేసినట్లు స్పష్టమైంది.
దర్యాప్తులో భాగంగా సేకరించిన సాక్ష్యాలు, సీజీఎస్‌టీ చట్టం–2017 లోని 70వ సెక్షన్ ప్రకారం నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా సీజీఎస్టీ చట్టం–2017లోని 69వ సెక్షన్ ప్రకారం 14.09.2026న నిందితుడిని అరెస్టు చేసి పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
(రిలీజ్ ఐడి: 2310743)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2