ఆయుష్
azadi ka amrit mahotsav

సంప్రదాయం, ఆధారాల కలయికతో అంతర్జాతీయ ఆరోగ్య పరిరక్షణ దిశగా ఆయుర్వేదం


ఆయుష్ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, దేశంలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ఆదరణ,
వైద్య పర్యాటకుల సంఖ్యలో పెరుగుదల,
పరిశోధనల్లో పురోగతి...

వీటితో అంతర్జాతీయ స్థాయిలో ఆయుర్వేద విస్తరణకు అనేక అవకాశాలు

నాడు పోస్టు చేయడమైనది: 14 SEP 2026 5:34PM by PIB Hyderabad

ప్రపంచ దేశాల్లో ఆరోగ్య సంరక్షణతో ముడిపడిన చర్చలలో ఒక విషయంగా మాత్రమే ఇంతకాలం పరిమితమైన ఆయుర్వేదం ఇక ఆ పరిమితిని అధిగమించి, ప్రధాన స్రవంతి దిశగా పురోగమిస్తోంది. భారత్‌లో ఆయుష్ సేవల ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ వృద్ధి చెందుతుండటం, దేశీయంగా చాలా మంది సాంప్రదాయిక సంరక్షణ పద్ధతులను అనుసరిస్తుండటం, ఆరోగ్యం పట్ల, వైద్య సేవలను అందుకోవడమే ప్రధానంగా పర్యటనలపై పెరుగుతున్న ఆసక్తి.. ఇవన్నీ కలిసి ఆయుర్వేదానికి సరికొత్త అవకాశాల్ని అందిస్తున్నాయి. మరో వైపు, ప్రపంచ దేశాల్లో వైద్య సమాజం కూడా ఇదివరకటి కన్న ఇప్పుడు సాంప్రదాయిక వైద్యానికి, పరిశోధనలకు, ఫలితాలకు మరింత ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తోంది.
భారత్‌లో ఈ నెల 23న 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకోనుంది. ‘‘ఆరోగ్యవంతమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేదను అనుసరించడం’’ అన్న అంశాన్ని ఈ సంవత్సర ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారు. భారత్ తన శతాబ్దాల నాటి జ్ఞాన వ్యవస్థను ఆధునిక పరిశోధనలు, నాణ్యతా ప్రమాణాలు, అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సేవల ప్రాథమిక ప్రణాళిక (ఫ్రేంవర్క్)లతో జోడించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న దశలో ఈ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇప్పుడున్న సవాలు ఆయుర్వేదాన్ని ప్రపంచ దేశాల చెంతకు చేర్చడమొక్కటే కాదు.. ఆయుర్వేదంలో అంతర్జాతీయ స్థాయి వృద్ధికి మద్దతిచ్చేలా తగిన ప్రమాణాలను కూడా నెలకొల్పవలసి ఉంది. దీని విశ్వసనీయతను, సంస్థాగత పునాదులను తీర్చిదిద్దాల్సిన అవసరం కూడా ఉంది.
గత పదేళ్లలో, ఆయుష్ రంగం గణనీయ ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. దీంతో ఆయుర్వేద విస్తరణకు బలమైన పునాది పడటంతో పాటు, మునుపటితో పోలిస్తే ఎక్కువ వర్గాల ఆదరణ కూడా లభించడం మొదలైంది. ఆయుష్ మార్కెట్టు స్థాయి 2014లో 2.85 బిలియన్ అమెరికా డాలర్లుగా ఉంటే, 2023కల్లా అది 43.4 బిలియన్ అమెరికా డాలర్లకు మెరుగైంది. ఇదే వ్యవధిలో, ఆయుష్ ఎగుమతులు కూడా 1.09 బిలియన్ అమెరికా డాలర్ల నుంచి 2.16 బిలియన్ అమెరికా డాలర్లకు చేరుకున్నాయి.  ఎమ్ఎస్ఎమ్ఈ, అంకుర సంస్థలను పటిష్టపరచడానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమల్లోకి తీసుకు వచ్చింది. ఫలితంగా ఈ రంగంలో కొత్త వాణిజ్య సంస్థలను ప్రారంభించే వారికి, నూతన ఆవిష్కరణలకు, పెట్టుబడులకు విశాల ప్రోత్సాహక విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్) ఏర్పడటానికి మార్గం సుగమమైంది.
ఆయుష్ చికిత్స పద్ధతులకు దేశీయంగా ఆదరణ అంతకంతకు పెరుగుతుండటంతో, ఈ విస్తరణ కార్యకలాపాలకు కీలకమైన దన్ను లభిస్తోంది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ నమూనా సర్వే కార్యాలయం 2022 జులై మొదలు 2023 జూన్ మధ్య కాలంలో, అఖిల భారత స్థాయిలో మొదటిసారిగా ఒక సర్వేను నిర్వహించింది. దీనిలో 1,81,298 కుటుంబాల అభిప్రాయాలు సేకరించారు. ఈ కుటుంబాల్లో 1,04,195 కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల నివాసులు కాగా, 77,103 కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆయుష్ పట్ల అవగాహన గ్రామ ప్రాంతాల్లో 94.8 శాతం, పట్టణ ప్రాంతాల్లో 96 శాతం స్థాయుల్లో ఉందని సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంత నివాసుల్లో 46.3 శాతం మంది, పట్టణ ప్రాంత నివాసుల్లో 52.9 శాతం మంది సర్వేకు ముందటి 365 రోజుల్లోనూ చికిత్సకుగాని, లేదా నివారణ దృష్ట్యా గాని చికిత్స పరంగా ఆయుష్‌ వైపు మొగ్గు చూపారని కూడా సర్వే తేల్చింది. చికిత్స కోసం ఆయుష్ పద్ధతులన్నిటిలోకీ ఆయుర్వేద పైనే ఎక్కువ మంది శ్రద్ధ చూపుతున్నారనీ, నివారణ ప్రధాన ఆరోగ్య సంరక్షణ, వెల్‌నెస్ రీత్యా కూడా ఇది పోషించగల పాత్ర మునుముందు పెరగనుందని నిర్ధారణ అయింది.
వైద్యసేవలను కోరుకుంటూ బయటి దేశాల నుంచి భారత్‌కు తరలివస్తున్న వారి ద్వారా నానాటికీ పెరుగుతున్న అంతర్జాతీయ గిరాకీ ప్రయోజనాన్ని సద్వినియోగపరుచుకోవాలని భారత్ ఆశిస్తోంది. ఆయుష్ పద్ధతుల్లో చికిత్స చేయించుకోగోరుతున్న విదేశీయులను దృష్టిలో పెట్టుకొని ‘ఆయుష్ వీసా’ను 2023 జులై 27న ప్రవేశపెట్టారు. ఆయుర్వేద, ఇతర సాంప్రదాయిక వైద్య పద్ధతులకు మంచి అవకాశాలున్న పర్యాటక ప్రాంతాలను గుర్తించడానికి భారతీయ పర్యాటక అభివృద్ధి సంస్థతో ప్రభుత్వం భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వైద్యం కోసం ప్రయాణాలు చేస్తున్న వారికి సంబంధించిన మార్కెట్టు 2022లో 115.6 బిలియన్ అమెరికా డాలర్లుగా ఉండవచ్చని అంచనా వేయగా, ఇది మరో నాలుగు సంవత్సరాల్లో.. అంటే 2030కల్లా దాదాపుగా 286.1 బిలియన్ అమెరికా డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఈ కారణంగా ఆయుర్వేద, తదితర సాంప్రదాయిక పద్ధతులు భారత వైద్య పర్యాటక, వెల్‌నెస్ సంబంధిత విస్తారిత అనుబంధ వ్యవస్థలో ఓ ప్రధాన భాగంగా మారగలగడానికి అవకాశం ఉంది. అయితే దీనికిగాను ఆరోగ్యసంరక్షణ సేవలను, వెల్‌నెస్ పథకాలను, పర్యటన రంగాన్ని పరస్పరం అనుసంధానించవలసి ఉంటుంది.
ఈ దిశగా విధానపరంగా చూసినప్పుడు 2026 జులైలో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. నీతి ఆయోగ్ ‘‘అంతర్జాతీయ స్థాయికి ఆయుర్వేదాన్ని తీసుకు పోవడానికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక’’ను విడుదల చేసింది. 2047ను లక్ష్యంగా నిర్దేశించుకొని అప్పటికల్లా అనుసరించాల్సిన చర్యలను రూపొందించారు. దీనిలో నియంత్రణ, నిదర్శనాలు, పరిశోధనలు, విద్య, అంతర్జాతీయ సహకారం, ఎగుమతులు, బ్రాండింగు, చికిత్స సేవల కోసం వచ్చే పర్యాటకులు అన్న అంశాలకు ప్రాముఖ్యాన్నిచ్చారు. ఇది నాణ్యత ప్రమాణాలు, పటిష్ఠ మౌలిక సదుపాయాల కల్పన, విశ్వసనీయ పరిశోధనలు, మంచి శిక్షణను పొందిన వృత్తి నిపుణులు, చక్కని ఫలితాలను చూపే ఉత్పాదనలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అర్థం చేసుకోగలిగే, గుర్తింపునకు నోచుకొనే నియంత్రణ సంబంధిత ప్రాథమిక ప్రణాళికలు.. వీటికి ప్రాధాన్యాన్ని ఇవ్వవలసి ఉంటుందని సూచిస్తోంది. విదేశాల్లో ఆయుర్వేద సేవలు, ఉత్పాదనలు ఇప్పటితో పోలిస్తే మరింత ఎక్కువ నమ్మకాన్ని, స్థాయిని పొందాలంటే అందుకు అనుగుణంగా సంస్థాగత, నాణ్యత ప్రధానమైన విస్తారిత అనుబంధ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని ఈ కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్నారు.
ఆయుర్వేద వైద్య పద్ధతిని బలపరచడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు.. అంతర్జాతీయ స్థాయిలో సాంప్రదాయిక, పూరక, ఏకీకృత వైద్య రంగంలో దీని విస్తృత భాగస్వామ్యంతో కూడా ముడిపడి ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిద్ధం చేసిన ‘2025-2034 ప్రపంచ సాంప్రదాయిక వైద్య వ్యూహా’న్ని కిందటి సంవత్సరం నిర్వహించిన 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో  ఆమోదించారు. ఇది నిదర్శనాన్ని బలపరిచే, భద్రతకు, నియంత్రణకు పూచీ పడే, సాంప్రదాయిక ఔషధాలను ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలతో ఏకీకరించే, వాటి విస్తృత అంతర రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించే అంతర్జాతీయ ప్రాథమిక ప్రణాళికను అందిస్తోంది.
ఈ అంతర్జాతీయ ఉద్యమంలో భారత్ కీలక పాత్రను పోషించింది. డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటరును 2022లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేశారు. దీనిలో ప్రధాన ఇన్వెస్టరుగా ఉంది భారత్. ఈ సెంటర్ స్థాపనకు, మౌలిక సదుపాయాల కల్పనకు, కార్యకలాపాలకు దాదాపు 250 మిలియన్ అమెరికా డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమని భారత్ ప్రకటించింది. ఈ సెంటర్.. విద్య, డేటా, ఎనలిటిక్స్, సుస్థిరత, సమానతలతో పాటు నూతన ఆవిష్కరణ, సాంకేతిక విజ్ఞానం వంటి రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది.
సాంప్రదాయిక చికిత్సపై ప్రపంచ శిఖరాగ్ర సదస్సులను రెండిటిని డబ్ల్యూహెచ్ఓ నిర్వహించిన సందర్భంగా కూడా భారత్ భూమిక మరింత ప్రస్ఫుటమైంది. మొదటి సదస్సును 2023 ఆగస్టులో గాంధీనగర్‌లో నిర్వహించారు. ఈ సదస్సుకు డబ్ల్యూహోచ్ఓతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహ ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఈ సదస్సులో ‘గుజరాత్ డిక్లరేషన్‌’ను ప్రకటించారు. రెండో శిఖరాగ్ర సదస్సును 2025 డిసెంబరు 17 నుంచి 19 మధ్య న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సదస్సును ‘‘ప్రజల కోసం, భూ గ్రహం కోసం సమతౌల్యాన్ని పునరుద్ధరించడం:  వెల్‌నెస్‌కు సంబంధించిన విజ్ఞానం, అభ్యాసం’’ ఇతివృత్తంతో ఏర్పాటు చేశారు. దీనిలో నిదర్శన, ఆరోగ్య వ్యవస్థను ఏకీకరించడం, నియంత్రణ, జీవవైవిధ్యం, స్వదేశీ జ్ఞానం, మేధాసంపత్తి, నూతన ఆవిష్కరణలు సహా వివిధ అంశాలపై చర్చించారు. ఈ శిఖరాగ్ర సదస్సు ఫలితంగా ‘ఢిల్లీ డిక్లరేషన్’‌తో పాటు, ‘డబ్ల్యూహోచ్ఓ ఆధ్వర్యంలో 2025-2034 ప్రపంచ సాంప్రదాయిక వైద్య వ్యూహా’న్ని అమలుచేయడానికి ‘‘స్మార్ట్’’ (స్పెసిపిక్ (ఎస్), మెజరబుల్ (ఎమ్), అచీవబుల్ (ఏ), రెలవెంట్ (ఆర్), టైమ్-బౌండ్ (టీ).. నిర్దిష్ట, కొలవదగిన, సాధించదగ్గ, సందర్భశుద్ధి కలిగిన, కాలబద్ధ) వాగ్దానాలను కూడా వెల్లడించారు.
అంతర్జాతీయ ఆరోగ్య వర్గీకరణ ప్రాథమిక ప్రణాళికలలో ఆయుర్వేద, సిద్ధా, యునానీ చికిత్స పద్ధతులను చేర్చడం మరో ముఖ్య పరిణామమని చెప్పుకోవచ్చు. 2024 జనవరిలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐసీడీ-11లోని సాంప్రదాయిక వైద్య మాడ్యూల్- 2ను ప్రవేశపెట్టింది. దీనిలో ఈ వైద్య పద్ధతులకు సంబంధించిన వ్యాధిగ్రస్తత కోడ్స్‌ను చేర్చారు. దీంతో ఈ పద్ధతులకు సంబంధించిన స్థితులను గురించి అంతర్జాతీయ స్థాయిలో సరిపోల్చదగిన ఫ్రేంవర్క్ ద్వారా డాక్యుమెంటేషన్‌, రిపోర్టింగ్  సాధ్యపడతాయి. ఇలా చేర్చడం ఏ సాంప్రదాయిక చికిత్స పద్ధతి తాలూకు శాస్త్రీయ చెల్లుబాటు, లేదా ప్రభావశీలతను ఆమోదించడంగా పరిగణించ కూడదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ప్రమేయాల (ఇంటర్‌వెన్షన్స్) వర్గీకరణ దిశగా పనులు పురోగమిస్తున్నాయి. ఆయుర్వేద, సిద్ధా, యునానీ వైద్యాలకు ఇంటర్‌వెన్షన్ కోడ్స్‌ను రూపొందించడానికి భారత్, డబ్ల్యూహెచ్ఓలు కలిసి పనిచేస్తున్నాయి.
విశ్వసించదగిన విజ్ఞాన నిదర్శనలను అందించడంలోనే ఆయుర్వేద భావి వికాసం ఆధారపడి ఉంటుంది. ఆయుష్ చికిత్స పద్ధతులకు సంబంధించిన పరిశోధనల కోసం ప్రభుత్వ అధికారిక భాండాగారం (రిపాజిటరీ)గా ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ రిసర్చ్ వెబ్‌సైట్ పనిచేస్తోంది. ప్రస్తుతం దీనిలో 43,000 కన్న ఎక్కువ రిసర్చ్ ఎంట్రీలను అందుబాటులో ఉంచారు. పరిశోధన పరంగా చోటు చేసుకుంటున్న ఈ వృద్ధి.. ఆయుర్వేదను మరింత విస్తృత స్థాయిలో అర్థం చేసుకోవడం, విశ్వసనీయ ప్రమాణాలను నెలకొల్పడం, సేవలతో పాటు ఉత్పాదనలను అందించడంలో తోడ్పడగలుగుతుంది. అలాగే, బాధ్యతాయుత, సుస్థిర ప్రాతిపదికలతో ఆయుర్వేదకు సంబంధించిన విశిష్ట సిద్ధాతాలను, జ్ఞాన వ్యవస్థలను సంరక్షించడం కూడా ఈ వైద్య పద్ధతి అభివృద్ధిని నిర్ధారించడానికి ఎంతో కీలకం.
మార్పులకు లోనవుతున్న ఈ ముఖచిత్రం.. భారతీయ సాంప్రదాయిక వైద్య పద్ధతి అంతర్జాతీయ స్థాయి సహకారంలో ఒక కొత్త దశలోకి అడుగుపెడుతోందని సూచిస్తోంది. ఆయుష్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా విస్తరిస్తూ, దేశీయంగా అధిక ఆదరణకు పాత్రమవుతూ, వైద్య ప్రధాన పర్యాటక రంగంలో నూతన అవకాశాలను అందిస్తూ, బలమైన అంతర్జాతీయ సహకారం, గ్లోబల్ క్లాసిఫికేషన్ ఫ్రేంవర్కులతో పాటు పరిశోధన, నాణ్యత ప్రమాణాల విషయంలో పెరుగుతున్న ప్రాధాన్యం.. వీటన్నింటితో ఆయుర్వేద కొత్త అభివృద్ధి బాట పడుతోంది.
దేశంలో త్వరలోనే 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘‘ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు  ఆయుర్వేదం’’ అన్న ఇతివృత్తం నివారణ ప్రధానమైన ఆరోగ్య సంరక్షణ, వెల్‌నెస్, సుస్థిర జీవనశైలి.. వీటికి ఆయుర్వేద అందించగల తోడ్పాటును వివరించేందుకు అవకాశాన్ని ఇస్తోంది.  అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో ఆయుర్వేద భావి ప్రస్థానం నిదర్శన, నూతన ఆవిష్కరణలు, నాణ్యత, వృత్తినైపుణ్య సామర్థ్యాలు, బాధ్యతాయుత అంతర్జాతీయీకరణ అన్న అంశాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, వెల్‌నెస్ రంగంలో నిరంతర ప్రాతిపదికన మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయుర్వేద స్థానం దీంతో ఇప్పటి కన్న మరింత బలోపేతం కానుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2310499) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi