ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్-2026లో ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 11 SEP 2026 7:05PM by PIB Hyderabad

గౌరవనీయ దేశాధినేతలు,

బ్రిక్స్‌ వాణిజ్య సమాజ అగ్రగాములు,

ఆవిష్కర్తలు.. మిత్రులారా…

అందరికీ నమస్కారం!

   బ్రిక్స్‌ వాణిజ్య వేదిక (బిజినెస్‌ ఫోరమ్‌) సమావేశం సందర్భంగా మీకిదే నా హృదయపూర్వక స్వాగతం. ఈ ఏడాది మనం బ్రిక్స్ 20వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ కూటమికి 2006లో శ్రీకారం చుట్టిన నాడు కేవలం నాలుగు దేశాలు మాత్రమే ఇందులో ఉండేవి. అయితే, బ్రిక్స్ సభ్య-భాగస్వాములతో కలిపి, ఇప్పుడు మనది 21 దేశాలతో కూడిన ఒక ఉమ్మడి కుటుంబం.

అంతర్జాతీయ స్థాయిలో నేడు బ్రిక్స్‌ కూటమికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రపంచ జనాభాలో 50 శాతం, జీడీపీలో 40 శాతం, వాణిజ్యంలో 25 శాతానికిపైగా వాటా నేడు బ్రిక్స్‌ దేశాలదే. అంతేగాక ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచ జీడీపీలో వృద్ధి సుమారు 2.5 రెట్లు కాగా, బ్రిక్స్ ఉమ్మడి జీడీపీ వృద్ధి దాదాపు 4.5 రెట్లుగా నమోదైంది. ఒక్కమాటలో చెబితే- ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే బ్రిక్స్ ఆర్థిక సామర్థ్యం దాదాపు రెట్టింపు వేగంతో వృద్ధి సాధిస్తోంది.

అంతర్జాతీయ స్థాయి ఆవిష్కరణలు-పరిష్కారాలకు కీలక కూడళ్లుగానూ బ్రిక్స్ దేశాలు ఆవిర్భవిస్తున్నాయి. క్షేత్రస్థాయి కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతికతల దాకా మన దేశాల్లో ఆవిష్కరణలకు సరికొత్త అవకాశాలు అందివస్తున్నాయి. బ్రిక్స్ స్థాయి, వేగం, ఆశావాదం ఇనుమడిస్తుండటాన్ని మనమిప్పుడు ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో భారత్‌ నిర్వహిస్తున్న ఈ బ్రిక్స్‌ వాణిజ్య వేదిక సమావేశం ఇప్పటిదాకా సాగిన వాటిలో అతి పెద్దది కావడం గమనార్హం.

మిత్రులారా!

ప్రస్తుతం భారత్‌ అధ్యక్షతన “పునరుత్థానం-ఆవిష్కరణ-సహకారం-సుస్థిరత దిశగా ప్రస్థానం” ఇతివృత్తంగా బ్రిక్స్ ముందంజ వేస్తోంది. భారత్‌ గత పుష్కర కాలం నుంచీ ఈ తారక మంత్రాన్నే తన ఆర్థిక-వాణిజ్య విధాన పునాదిగా మలచుకుంది. పునరుత్థాన సామర్థ్యం అంశంలో- ఇంధనం నుంచి సాంకేతికత వరకూ తన సరఫరా వ్యవస్థలను భారత్‌ మరింత వైవిధ్యభరితంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దుకుంది. అంతర్జాతీయ అనిశ్చితి నడుమన కూడా వృద్ధి, స్థిరత్వంపై ప్రపంచానికి విశ్వాసం కల్పించడంలో ఈ సామర్థ్యమే దోహదం చేసింది.

దేశంలో రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలను మేమెంతో వేగంగా విస్తరిస్తున్నాం. అలాగే, నౌకా నిర్మాణం, సెమీకండక్టర్లు, క్వాంటం సాంకేతికత, కీలక ఖనిజాలు, బయోటెక్నాలజీ తదితర వ్యూహాత్మక రంగాల్లో కొత్త సామర్థ్యాలను తీర్చిదిద్దుతున్నాం. కాబట్టే, ఈ రంగాల్లో ప్రపంచ వ్యాపార సంస్థలకు భారత్‌ సరికొత్త అవకాశాల కూడలిగా రూపొందుతోంది. అందువల్లనే, “మేక్ ఇన్ ఇండియా.. ఇన్నోవేట్ విత్ ఇండియా.. స్కేల్ ఫర్ ది వరల్డ్” నినాదంతో ఆహ్వానం పలుకుతున్నాం.

మిత్రులారా!

భారత్‌ ఇప్పుడు ఒక అంకుర విప్లవానికి సాక్షిగా నిలుస్తోంది. ఈ మేరకు రెండు లక్షలకు పైగా అంకురాలు, 120కి పైగా యూనికార్న్‌ సంస్థలతో ప్రపంచ పరిష్కారాల కూడలిగా ఆవిర్భవిస్తోంది. బ్రిక్స్ నిర్వహిస్తున్న ‘భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్‌ పో’ ఈ ఘనతను ప్రస్ఫుటం చేస్తుంది. మా అంకుర సంస్థలు కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో పెనుమార్పులు తెస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీలపై ఎంతో కృషి చేస్తున్నాయి.. రక్షణ-అంతరిక్ష రంగాల్లోనూ సరికొత్త ఆవిష్కరణలకు రూపమిస్తున్నాయి. ఈ ప్రపంచ స్థాయి ఆవిష్కరణలను ఇప్పుడు మనం బ్రిక్స్ ద్వారానూ ప్రపంచ మార్కెట్లకు చేరువ చేయాలి.

మిత్రులారా!

జనాభా స్థాయిలో ఆవిష్కరణలు ఈ రంగంలో భారత్‌ సముపార్జించిన మరో విశిష్టత. జనాభా స్థాయిలో ఆర్థిక సార్వజనీనత సహా డిజిటల్ లావాదేవీలకు దేశీయంగా రూపొందించిన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) నవ్యోత్తేజమిచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ 50 శాతం తక్షణ చెల్లింపులు ఈ సాంకేతికత ద్వారా సాగుతున్నాయి. ఈ డిజిటల్ వేదికపై కొత్త పరిష్కారాల రూపకల్పన లక్ష్యంగా పరిశ్రమలకు, అంకురాలకు మేమొక సార్వత్రిక వ్యవస్థను సమకూర్చాం. ఈ అంతర్జాతీయ స్థాయి వ్యవస్థను నేడు అనేక దేశాలు స్వీకరిస్తుండటం మాకెంతో గర్వకారణం. బ్రిక్స్ దేశాల ఆవిష్కర్తలు కూడా తమ స్థానిక అవసరాల కోసం కొత్త పరిష్కారాల రూపకల్పనలో మా అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

మిత్రులారా!

ప్రపంచమంతటా నేడు వాణిజ్య అవరోధాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అధిగమించగల ఆర్థిక వారధులను భారత్‌ నిర్మిస్తోంది. ఈ మేరకు 2014 నుంచి దాదాపు 40 దేశాలతో మేం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాం. అంటే-   వ్యాపారాలకు అడ్డంకులు తగ్గిస్తూ, అవకాశాలను విస్తరించడమే బ్రిక్స్ దేశాల విషయంలోనూ మేం అనుసరించే విధానం.

అందువల్ల, బ్రిక్స్‌కు మా అధ్యక్షతన వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యం, స్మార్ట్ గ్రిడ్‌ తదితర రంగాల్లో కొత్త సహకార నెట్‌వర్కులు ఏర్పాటు చేశాం. అంకురాలు, సూక్ష్మ-చిన్న మధ్యతరహా మార్కెట్లు, ఆర్థిక సహాయ సంస్థలతో అనుసంధానించేందుకు బ్రిక్స్‌ ఇంక్యుబేటర్ నెట్‌వర్క్, బ్రిక్స్‌ ఎంఎస్‌ఎంఈ పోర్టల్, బ్రిక్స్‌ అంకుర పరిశోధన నిధి వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. సహకార విస్తృతి దిశగా ఈ చర్యలన్నిటి ద్వారా మీరందరూ ప్రయోజనం పొందడంతోపాటు పెట్టుబడులు-ప్రతిభ ఆదానప్రదానాన్ని మరింత పెంచుకోవచ్చు.

మిత్రులారా!

సురక్షిత సముద్ర మార్గాలు, నిరాటంక సరఫరా మార్గాలతోపాటు నావికులు కూడా సురక్షితంగా ఉంటేనే ప్రపంచ వాణిజ్యం ముందడుగు వేయగలదు. అందుకే, నౌకాయాన స్వేచ్ఛ సహా నావికుల భద్రతకు భారత్‌ గట్టి మద్దతుదారుగా నిలుస్తోంది.

మా దార్శనికతలో బ్రిక్స్‌ మహిళా వాణిజ్య వేదిక కూడా ఓ కీలక భాగం. ఆ మేరకు మహిళా పారిశ్రామికవేత్తలు మా వృద్ధి ప్రస్థానానికి సారథ్యం వహించాలని మేం ఆకాంక్షిస్తున్నాం. భారత్‌లో జరిగిన ఈ కూటమి సమావేశంలో దాదాపు 200 మంది మహిళా వాణిజ్య అగ్రగాములు పాల్గొనడం మాకెంతో సంతోషాన్నిస్తోంది.

మిత్రులారా!

బ్రిక్స్ మూడో దశాబ్దంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో కింది అంశాలను ఒకసారి పరిశీలించాలని బ్రిక్స్ వాణిజ్య మండలికి నా వినతి. ఈ మేరకు బ్రిక్స్ దేశాల మధ్య గల 10 ప్రధాన వాణిజ్య అవరోధాల తొలగింపుపై ఒక నివేదిక ఇవ్వగలరా? ఇతర బ్రిక్స్ మార్కెట్లలోకి విస్తరించేలా ఏటా 100 బ్రిక్స్ అంకుర సంస్థలకు మనం మద్దతివ్వగలమా? మన వ్యాపారాల మధ్య 1,000 కొత్త భాగస్వామ్యాల ఏర్పాటుకు కృషి చేయగలమా? ఈ మూడు ప్రామాణికాల దృక్కోణంతోనే మనం వార్షిక పురోగతిని సమీక్షించుకోవాలి.

ఈ విధంగా బ్రిక్స్ ఆశయాలను కార్యాచరణలోకి తెస్తూ, మన సమష్టి సామర్థ్యాన్ని ప్రపంచ పరిష్కారాలుగా మలుద్దాం రండి. బ్రిక్స్ ముందడుగు వేయడమే కాకుండా ప్రపంచం కూడా పురోగమించడానికి తోడ్పడాలి.

మీకుందరికీ అనేకానేక ధన్యవాదాలు!

 

***


(రిలీజ్ ఐడి: 2309589) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Odia , हिन्दी , English , Urdu , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati