ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
11 SEP 2026 8:33PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు గౌరవ డాక్టర్ మసూద్ పెజెష్కియన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సమావేశమయ్యారు. రెండు వారాల వ్యవధిలో ఇరువురు నేతలు సమావేశం కావడం ఇది రెండోసారి. అంతకుముందు ఆగస్టు 31న బిష్కెక్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు.
ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ బ్రిక్స్‌కు సంబంధించిన సమావేశాల్లో ఇరాన్ క్రమం తప్పకుండా ఉన్నతస్థాయి ప్రాతినిధ్యంతో పాల్గొంటున్నందుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత స్ఫూర్తిని పెంపొందించడంలో బ్రిక్స్‌కు ఉన్న సామర్థ్యాన్ని ఆయన ప్రస్తావించారు. బ్రిక్స్ వ్యాపార వేదిక నేతల సమావేశంలో పాల్గొన్నందుకు అధ్యక్షుడు పెజెష్కియన్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాలన్న భారత స్థిరమైన వైఖరిని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, సుస్థిరతను నిర్ధారించేందుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగాల్సిన అవసరాన్ని తెలియజేశారు. అలాగే నౌకాయానం, వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడం, సముద్ర నౌకల సిబ్బంది భద్రత, సంక్షేమాన్ని కాపాడటం కూడా అవసరమని పేర్కొన్నారు.
బ్రిక్స్ సహా బహుపాక్షిక సంస్థల్లో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ప్రధానమంత్రి అభినందించారు.
***
(రిలీజ్ ఐడి: 2309370)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8