కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సార్వజనీన.. విశ్వసనీయ.. వివేచనాత్మక ఆర్థిక చట్రం అవశ్యం

· ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్-2026’లో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా పిలుపు

· “బ్రాడ్‌బ్యాండ్‌ సౌలభ్యం దశాబ్ద కాలంలోనే 16 రెట్లు పెరిగి- 6 కోట్ల నుంచి 103 కోట్లకు చేరడంతో భారత్‌ ప్రపంచ డేటా రాజధానిగా ఎదిగింది”

· దేశంలో 5జి వ్యవస్థ 2022లో ప్రారంభం కాగా- రూ.4.5 లక్షల కోట్ల మూలధన వ్యయంతో 26 నెలల్లో 99.9 శాతం జిల్లాలు.. 85 శాతం జనాభాకు విస్తరించింది”

· “భారత పౌరులకు ఇవాళ స్మార్ట్‌ ఫోన్లు సరికొత్త బ్యాంకు శాఖలుగా మారిపోయాయి”

నాడు పోస్టు చేయడమైనది: 10 SEP 2026 10:30PM by PIB Hyderabad

దేశానికి నేడు సార్వజనీన, విశ్వసనీయ, వివేచనాత్మక డిజిటల్‌ ఆర్థిక చట్రం అవశ్యమని కేంద్ర కమ్యూనికేషన్లు-ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఈ మేరకు ముంబయి నగరంలో నిర్వహిస్తున్న ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్-2026’లో మాట్లాడుతూ- ఆర్థిక చట్రం వివేచనాత్మకంగా మారడానికి ముందు అది సార్వజనీనం కావాలని ప్రస్ఫుటం చేశారు. అగోచర రాచబాట వంటి టెలికమ్యూనికేషన్ల్‌ నెట్‌వర్క్‌ సాంకేతికార్థిక (ఫిన్‌టెక్‌) రంగం రూపాంతరీకరణకు వాస్తవ మూలస్తంభమని ఆయన అభివర్ణించారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ తదుపరి దశ పరిణామంలో ‘సాంకేతిక సామర్థ్యం, విశ్వసనీయత, అనుసంధాన’ త్రయం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు.

 

భారత డిజిటల్ రూపాంతరీకరణ స్థాయిని వివరిస్తూ- దశాబ్దం కిందట దేశ జనాభాలో సుమారు 25 కోట్ల మందికి మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉండగా, ఇవాళ 100 కోట్లు దాటిందని పేర్కొన్నారు. ఆ మేరకు బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 6 కోట్ల నుంచి 103 కోట్లకు… అంటే- పదేళ్లలో దాదాపు 16 రెట్లు పెరిగిందని చెప్పారు. ఈ సాంకేతిక జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్ఫుటం చేశారు.

దేశవ్యాప్తంగా నేడు స్మార్ట్‌ ఫోన్లు అరచేతిలో ఇమిడే ‘సరికొత్త బ్యాంకు శాఖలు’గా మారిపోయాయని శ్రీ సింధియా వ్యాఖ్యానించారు. తద్వారా ఇంటర్నెట్ సంధానం నుంచి రుణాలు, పెట్టుబడులదాకా పౌరులందరి ముంగిటకూ సేవలు చేరువయ్యాయని వివరించారు. సుమారు 6.5 లక్షల గ్రామాలు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావడం వల్ల ప్రతి అనుసంధానిత గ్రామం ప్రపంచ ఫిన్‌టెక్ వ్యవస్థలో అంతర్భాగంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

 

దేశంలో 5వ తరం (5జి) టెలికమ్యూనికేషన్‌ సాంకేతికతకు 2022లో శ్రీకారం చుట్టగా, కేవలం 26 నెలల్లోనే 99.9 శాతం జిల్లాలకు, దాదాపు 85 శాతం జనాభాకు ఇది విస్తరించిందని శ్రీ సింధియా గుర్తుచేశారు. ఈ విస్తరణ ప్రక్రియలో 5 లక్షలకు పైగా 5జి బేస్ స్టేషన్లు మద్దతునిస్తున్నాయని పేర్కొన్నారు.

 

మరోవైపు కమ్యూనికేషన్ వ్యయం గణనీయంగా తగ్గిందని, ప్రతి ‘జీబీ’పై డేటా ధర దాదాపు రూ.10 స్థాయికి దిగివచ్చిందని కేంద్ర మంత్రి వివరించారు. దీంతో డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. కాబట్టే, అత్యంత చౌక డేటా లభ్యతకు భారత్‌ నేడు ప్రపంచ రాజధానిగా మారిందని అభివర్ణించారు.

 

ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ- దీనికి శ్రీకారం చుట్టిన తొలి మాసంలో సుమారు 90,000 లావాదేవీలు నమోదయ్యాయని శ్రీ సింధియా గుర్తుచేశారు. యూపీఐ నేడు 740కి పైగా బ్యాంకుల స్థాయికి విస్తరించిన నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరం సుమారు ₹314 లక్షల కోట్ల విలువగల 24,162 కోట్ల లావాదేవీలు నమోదైనట్లు పేర్కొన్నారు. భారత సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల సామర్థ్యానికి ఈ గణాంకాలే నిదర్శనమని మంత్రి వ్యాఖ్యానించారు.

 

దేశీయ డిజిటల్ లావాదేవీలలో 84 శాతం యూపీఐ ద్వారానే సాగుతుండగా ప్రపంచవ్యాప్త తక్షణ చెల్లింపులలో భారత్‌ వాటా సుమారు 49 శాతానికి చేరిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ ఘనత పూర్తిగా సాంకేతికార్థిక (ఫిన్‌టెక్) వ్యవస్థ సామర్థ్యానికే చెందుతుందని ఆయన అన్నారు. భారత్‌ సాధించిన ఈ విజయం భారీ స్థాయిలో రూపొందించిన ఈ సాంకేతికత సామర్థ్యాన్ని చాటి చెబుతున్నదని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరచూ ప్రస్తావించే ‘వసుధైవ కుటుంబకం’ దృక్కోనానికి యూపీఐ విజయం ఒక నిదర్శనమని కేంద్ర మంత్రి శ్రీ సింధియా అన్నారు. ఈ సాంకేతికతను ఇప్పుడు ఎలాంటి వ్యయభారం లేకుండా 9 దేశాలకు అందిస్తున్నామని చెప్పారు. ఈ నమూనాను ప్రపంచం ఆసక్తితో గమనిస్తున్న నేపథ్యంలో మరో 20 దేశాలకు ఇది విస్తరించే అవకాశం ఉందని తెలిపారు.

 

వివిధ సంస్థలను జోడించే సంధాన వ్యవస్థలు, విశ్వసనీయత, పరస్పర అనుసంధాన వేదికల సహిత నెట్‌వర్కులపైనే డిజిటల్ ఆర్థిక చట్రం రూపకల్పన ఆధారపడి ఉంటుందని శ్రీ జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సాంకేతికత విస్తృతికి తోడ్పడే మూడు మూల సూత్రాలను ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు సార్వత్రిక, చౌక, సురక్షిత మౌలిక సదుపాయాలతో ఆవిష్కరణలు, సార్వజనీనత, విశ్వసనీయతల విస్తరణ సాధ్యమవుతుందని ప్రస్ఫుటం చేశారు.

 

జన్-ధన్ ఖాతాలు, డిజిలాకర్‌ పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- దేశంలో నేడు సుమారు 60 కోట్ల ఖాతాలుండగా, డిజిలాకర్లలో 900 కోట్ల పత్రాలను పౌరులు భద్రం చేసుకున్నారని శ్రీ సింధియా గుర్తుచేశారు. దీంతో ఆర్థిక సేవలకు, సౌలభ్య సామర్థ్యానికి మధ్య గల అంతరం గణనీయంగా సమసిపోయిందని పేర్కొన్నారు. కాబట్టి, ఇప్పుడు ఆర్థిక సేవల కోసం బ్యాంకు శాఖలపై పరాధీనత అవసరం లేదని, “స్మార్ట్‌ ఫోన్‌ నేడు బ్యాంకు శాఖగా మారింది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క స్మార్ట్‌ ఫోన్‌తో ఫిన్‌టెక్‌ ఇవాళ ప్రతి పౌరుడి అరచేతిలో ఇమిడిపోయిందని ఆయన చెప్పారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృఢ సంకల్పం, నిరంతర ప్రోత్సాహంతో ఈశాన్య రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి గ్రామానికీ సాంకేతికార్థిక అనుసంధానం కలిగిందని శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో 100 శాతం సంతృప్త స్థాయి సాధన లక్ష్యంగా డిజిటల్ భారత్ నిధి ద్వారా టెలికాం సంధానం కొరవడిన 34,000 గ్రామాల్లో 22,000 దాకా టవర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

మొబైల్ రంగంలోనూ 100 సంతృప్త స్థాయి సాధన దిశగా భారత్‌ కృషి చేస్తున్నదని మంత్రి చెప్పారు. ఇందుకోసం మొబైల్ నుంచి సరిహద్దు నెట్‌వర్కుల దాకా విస్తరించే కొత్త ‘ఆర్టీరియల్’ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సదుపాయం చేరని మిగిలిన గ్రామాలకు తొలి అంచె, మధ్య అంచె, తుది అంచె సంధానం సృష్టించడంలో పంచాయతీల పాత్ర కీలకమని ఆయన వివరించారు.

 

సాంకేతికత ఆధారిత డిజిటల్ మౌలిక సదుపాయాలతో జాతీయ ఏఐ సామర్థ్యాలు ఏకీకృతం కాగలవని కేంద్ర మంత్రి అన్నారు. ఆర్థిక సలహాలను, రుణాలను ఏఐ వ్యక్తిగతీకరిస్తూ, ఆర్థిక సేవలను క్రమేణా స్వయంప్రతిపత్తి గలవిగా మార్చగలదని చెప్పారు. అధిక మేధా సామర్థ్యంతో పాటు బాధ్యతల భారం కూడా పెరుగుతుందని శ్రీ సింధియా స్పష్టం చేశారు. పౌరుల గోప్యత, ఆర్థిక భద్రతల పరిరక్షణ కోసం ఆర్థిక వ్యవస్థలకు పటిష్ట కంచె (ఫైర్‌వాల్‌)తో రక్షణ వలయం ఏర్పరచాలని ఆయన పిలుపునిచ్చారు.

 

ఈ క్రమంలో ‘సంచార్ సాథీ’ పేరిట కేంద్ర ప్రభుత్వం ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచిందని చెప్పారు. అనుమానాస్పద కనెక్షన్ల నుంచి ఇది పౌరులకు రక్షణ కల్పించడంతోపాటు స్మార్ట్‌ ఫోన్లు అపహరణకు గురైనపుడు వాటిని పనిచేయకుండా చేయగలదని తెలిపారు. ఇక ఇప్పటిదాకా 88 లక్షలకు పైగా అనుమానాస్పద మొబైల్ కనెక్షన్ల తొలగింపులో తోడ్పడిన ఏఐ ఆధారిత ‘ఏఎస్‌టీఆర్’ ఉపకరణాన్ని శ్రీ సింధియా ప్రముఖంగా ప్రస్తావించారు.

 

ఆర్థిక మోసాల ముప్పును పసిగట్టే ఈ ఉపకరణం అనుమానాస్పద లావాదేవీలను ‘రింగ్-ఫెన్స్’ చేస్తుందని మంత్రి చెప్పారు. తద్వారా పౌరుల బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ అయ్యేలోగా మోసపూరిత చెల్లింపుల నిరోధంలో సాయపడుతుందని తెలిపారు. పౌరులకు, వారి ఆర్థిక సామర్థ్యానికి రక్షణ బలోపేతం దిశగా బ్యాంకింగ్ రంగం నెట్‌వర్కులన్నిటా ప్రామాణిక కార్యాచరణ విధానాల అమలుకు ఆయన పిలుపునిచ్చారు.

 

మోసాన్ని గుర్తించడం కాకుండా ముందస్తు నివారణే ప్రధానంగా ఉండాలని శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ప్రస్ఫుటం చేశారు. ప్రతిచర్యాత్మక భద్రత నుంచి దూరదృష్టి గల విశ్వసనీయత దిశగా పయనించడమే లక్ష్యం కావాలన్నారు. టెలికాం, డిజిటల్ గుర్తింపు, యూపీఐ, ఆర్థిక వ్యవస్థలను ఏకతాటిపైకి తెస్తూ, ఆర్థిక రంగం కోసం ఒక ‘ట్రస్ట్ గ్రిడ్‌’ ఏర్పాటు ఆవశ్యకతను కేంద్ర మంత్రి స్పష్టీకరించారు. ఆధార్, యూపీఐ మధ్య మరింత సమన్వయం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ప్రతి పౌరుడూ భాగస్వామిగా మారి ప్రయోజనం పొందగలరని ఆయన చెప్పారు.

 

డిజిటల్ ఇండియా సౌలభ్యంతో పాటు వివేచనాత్మక ఇండియా మేధను కూడా ప్రజాస్వామ్యీకరించాలని శ్రీ సింధియా అన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) కార్పొరేట్లు లేదా బ్యాంకులకు పరిమితం కాకుండా ప్రతి పౌరుడికీ లభించే సాధనంగా మారాలని చెప్పారు. తద్వారా ఆధునిక రూపాంతరీకరణ ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ చేరాలని స్పష్టం చేశారు. చారిత్రకంగా కొన్ని దేశాలు, కంపెనీలు మాత్రమే ‘టెలికాం స్టాక్‌’లను రూపొందించాయని చెబుతూ- భారత్‌ స్వదేశీ 4జీ టెలికాం స్టాక్‌ గురించి మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ క్రమంలో మన దేశం సొంత 4జీ అనంతరం 5జీ స్టాక్‌పై కృషి చేస్తోందని తెలిపారు. ఇక ప్రపంచ 6జీ పేటెంట్లలో 10 శాతం వాటా సాధించడం సహా ప్రమాణాల రూపకల్పనలో విలువైన భాగస్వామిగా నిలిచే ఆకాంక్షతో భారత 6జీ మిషన్ ఇప్పటికే శ్రీకారం చుట్టుకున్నదని శ్రీ సింధియా అన్నారు.

చివరగా- “మనం స్వదేశీ ఆవిష్కరణల ద్వారా స్థానికంగా సేవలందించాలి.. అలాగే, అంతర్జాతీయ స్థాయిలో సురక్షిత సేవా ప్రదానానికి భరోసా ఇవ్వాలి” అని శ్రీ జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. అనుసంధానిత భారత్‌ ఇక వివేచనాత్మక-సాధికార డిజిటల్ ఆర్థిక చట్రం వైపు, సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల నుంచి విశ్వసనీయత దిశగా తన ప్రస్థానాన్ని నిర్దేశించుకోవాలని ఆయన అన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2309165) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी