సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
1.44 కోట్లమందికి పైగా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు రూ.12,773 కోట్ల ఉపకార వేతనాలు
సకాలంలో ప్రవేశాలు, పారదర్శకత, జవాబుదారితనం కోసం శ్రేష్ఠ, జాతీయ విదేశీ విద్యా ఉపకార వేతనం, జాతీయ ఫెలోషిప్ పథకాలలో కీలక సంస్కరణలు
1.01 కోట్లమందికి పైగా ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.2,445.05 కోట్ల ఉపకార వేతన సహాయం
నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2026 6:16PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం తన ఉపకార వేతనాలు, విద్యా సహాయ పథకాల పరిధిని గణనీయంగా విస్తరించడంతో పాటు పలు కీలక సంస్కరణలను చేపట్టింది. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈబీసీలు) చెందిన విద్యార్థులకు విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడం, పథకాల అమలును సకాలంలో, పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించడం ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా ఉంది.
ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతన పథకాల ద్వారా 1.44 కోట్లమందికి పైగా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు లబ్ధి పొందారు. వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతూ, ఆర్థిక అవరోధాలు లేకుండా విద్యా అవకాశాలను కొనసాగించేందుకు రూ.12,773 కోట్ల విలువైన ఉపకార వేతనాలను పంపిణీ చేశారు.
ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ ఉపకార వేతన పథకాల ద్వారా ఓబీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన 1.01 కోట్లమందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందారు. వారికి రూ.2,445.05 కోట్లను ఉపకార వేతనాలుగా అందించారు. ఈ విస్తృత ప్రయోజన పరిధి, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు సమగ్ర విద్యను, సమాన అవకాశాలను ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
లక్ష్యిత ప్రాంతాలలోని ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన రెసిడెన్షియల్ విద్యా పథకం ((శ్రేష్ఠ) కింద నిర్వహించే వార్షిక నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ (ఎన్ఈటీఎస్) పరీక్షల షెడ్యూల్‌ను మే నుంచి ముందుకు - డిసెంబర్ కు మార్చారు. కౌన్సెలింగ్, ప్రవేశాల ప్రక్రియను సమయానుకూలంగా పూర్తి చేయడం, విద్యాసంవత్సరం క్యాలెండర్‌తో అనుసంధానించడం, జాప్యాన్ని తగ్గించి విద్యార్థులు మధ్యలో చదువు నిలిపివేసే (డ్రాప్అవుట్స్) సమస్యను నివారించడమే లక్ష్యంగా ఈ సంస్కరణను తీసుకొచ్చారు.
సవరించిన ఈ షెడ్యూల్ ద్వారా అర్హత కలిగిన విద్యార్థులు నిర్దేశిత విద్యా సంవత్సర కాలంలోనే ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసి, అనవసరమైన అంతరాయాలు లేకుండా తమ చదువును ప్రారంభించేందుకు వీలు కలుగుతుంది.
పత్రాల ప్రామాణికతను బలోపేతం చేయడంతో పాటు, తప్పుడు క్లెయిమ్‌లను నివారించేందుకు 2024 - 25 విద్యా సంవత్సరం నుంచి జాతీయ విదేశీ విద్యా ఉపకార వేతనం పథకం కింద ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను వాటిని జారీ చేసిన అధికారుల నుంచే అక్కడికక్కడే ధ్రువీకరించే వ్యవస్థను ప్రవేశపెట్టారు.
ఈ చర్య ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను పెంపొందించడంతో పాటు, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే నిజమైన, అర్హులైన అభ్యర్థులకే ఉపకార వేతన ప్రయోజనాలు అందేలా చేస్తుంది.
ఎస్సీ విద్యార్థుల జాతీయ ఫెలోషిప్ పథకం కింద, యూజీసీ - నెట్, జాయింట్ సీఎస్ఐఆర్ - యూజీసీ నెట్ ఫలితాల ప్రకటన అనంతరం ఫిర్యాదులు సమర్పించేందుకు తప్పనిసరిగా ఏడు రోజుల వ్యవధిని కల్పించారు. ఈ విధానాన్ని 2025–26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.
నిర్దేశిత వ్యవధిలో విద్యార్థులు తమకు ఎదురైన లోపాలు, వ్యత్యాసాలను తెలియజేసేందుకు ఈ అవకాశం వీలు కల్పిస్తుంది. అలాగే, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు దోహదపడటంతో పాటు జవాబుదారీతనాన్ని బలోపేతం చేసి, ఫెలోషిప్ ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను పెంపొందిస్తుంది.
ఆర్థిక సహాయాన్ని విస్తరించడంతో పాటు, ప్రక్రియ ఆధారిత సంస్కరణలను అమలు చేయడం ద్వారా మరింత సమ్మిళిత, సమర్థవంతమైన, విద్యార్థి కేంద్రిత విద్యా సహాయ వ్యవస్థను రూపొందించేందుకు మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోంది. నాణ్యమైన విద్య, విద్యాపరమైన పురోగతికి సమాన అవకాశాలను అందించడం ద్వారా వెనుకబడిన వర్గాల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
****
(రిలీజ్ ఐడి: 2309002)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3